Read more!

మహాభారతం గురించి వ్యాసుడు చెప్పిన విషయాలు!

 

మహాభారతం గురించి వ్యాసుడు చెప్పిన విషయాలు!

రామాయణంలో వ్యాసుడు, పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్లు విస్తరించి ఉంటుంది. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రాంతం చాలా విశాలమైనది.  ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగిఆగి ఊదడం బట్టి, ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని, అక్కడి పరిస్థితిని బట్టి, ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధ ఘట్టాలలో మనకు కనపడుతుంది. ఆ కారణం చేత పాండవులు, కృష్ణుడు యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు.

శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహరథి శిఖండి (ద్రుపదుని కుమారుడు), ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్రకుమారుడు అభిమన్యుడు, తమ తమ శంఖములను వేరు వేరు గా పూరించారు.

ఈ విషయం గురించి విశ్లేషణ ఇస్తూ వ్యాసుల వారు రెండుపదాలు చెప్పారు. ఒకటి హృషీకేశో అంటే శ్రీకృష్ణుడు. హృషీకములు అంటే ఇంద్రియములు. ఈశుడు అంటే వాటికి అధిపతి. అధిపతి అంటే జయించిన వాడు అని అర్థం. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు. వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే, ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. 

రెండవది ధనంజయః అంటే ధనమును జయించినవాడు, సంపాదించిన వాడు. ధర్మరాజు రాజసూయయాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాసులను తీసుకొని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకము అయింది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు. ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు. ఈ కాలంలో అందరూ అదే భ్రమలో ఉన్నారు. డబ్బు ఉంటే అన్ని అవసరాలు తీరతాయి, గొప్ప గొప్ప వస్తువులు కొనచ్చు, మనిషికి శారీరక శ్రమ తగ్గించేలా చేసుకోవచ్చు, చల్లని ఎ.సి గదులలో కూర్చుని కడుపులో చల్ల కదలకుండా బతకాలని అనుకుంటారు. సుఖం అంటే ఇదే అనే భ్రమలో ఉన్నారు. సుఖమన్నా, సంతోషమన్నా మానసికంగా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటం అనే విషయం తెలియదు. ఆదే విషయాన్ని పరోక్షంగా మహా భారతం సందర్భంలో చెప్పాడు వ్యాసుడు. 

                                ◆ వెంకటేష్ పువ్వాడ.