Read more!

దుర్యోధనుడు ద్రోణుడు విషయంలో వేసిన ఎత్తు?

 

దుర్యోధనుడు ద్రోణుడు విషయంలో వేసిన ఎత్తు?

దుర్యోధనుడు, యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న, తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తెరిపార చూశాడు. తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏయే వ్యూహములు రచించారో. పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు. వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నారు. 

ద్రోణుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు?

కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు. యుద్ధము గురించి, అందులో అనుసరించ వలసిన వ్యూహములు ప్రతి వ్యూహములు గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకుపోవాలి. కాని కేవలం తన ఉప్పుతింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్లాడు? భీష్ముని మీద నమ్మకం లేదా! భీష్ముడు, పాండవులు తన మనుమలు అనే మమకారంతో, సరిగా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా! లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా! ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. 

ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. "పాండవులు నా మనుమలు. నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను" అని భీష్ముడు యుద్ధానికి ముందే ఎప్పుడో చెప్పాడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే! ఎవరి మీదా అధిక ప్రేమ లేదు. అలాగని ఎవరి మీదా ద్వేషమూ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము. అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదికి రెచ్చగొడదామని వెళ్లి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి. అలాంటి వాడు ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు. వక్రంగానే ఆలోచిస్తాడు,

పాండవుల సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమాన పరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు, ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేసాడు ద్రుపదుడు. దాని ఫలితంగా ధృష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి ధృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడుకి విలువిద్య నేర్పించాడు. అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు, తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా? లేక శిష్యుడు అని  ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా అంటున్నారు.

"గురువుగారూ! నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనాసముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు! తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే ధృష్టద్యుమ్నుని మహా బుద్ధిమంతుడు అని పొగిడేవారు, కాని ఆచార్య ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మరిచిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక, కేవలం మిమ్మల్ని చంపడానికే ద్రుపదుడు తపస్సుచేసి, దృష్టద్యుమ్నుని కుమారుడిగా పొందాడు. ధృష్టద్యుమ్నుడు. మీ శిష్యుడు, బుద్ధి మంతుడు అని ఉపేక్షచేస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడనీ, మిమ్మల్ని చంపడానికే పుట్టాడనీ అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో, మీ ఇష్టం" అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు.

ఇదీ దుర్యోధనుడు ద్రోణుడి విషయంలో వేసిన ఎత్తు!!


                               ◆ వెంకటేష్ పువ్వాడ.