Read more!

మంచి జన్మ పొందాలి అంటే మనిషి చేయాల్సినది?

 

మంచి జన్మ పొందాలి అంటే మనిషి చేయాల్సినది?

శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్రామతీశ్వరః॥ గృహీత్వైతాని సంయాతి వాయుర్గస్థానివావయాత్।।

పది ఇంద్రియములతో కూడిన ఈ దేహములో నుండి పరమాత్మయొక్క ప్రతిబింబ కాంతి తొలగిపోయినపుడు, ఈ శరీరం మరణిస్తుంది. అప్పుడు పుష్పముల మీది నుండి వీచే గాలి ఆ పుష్పముల యొక్క వాసనలను తనతోఎలా మోసుకొని పోతుందో, అలాగే మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మశరీరం ఆ శరీరంలో తాను అనుభవించిన వాసనలను తనతో కూడా గ్రహించి బయటకు వస్తుంది.

 దేహములో ఉన్న జీవాత్మ దేహము కాల పరిమితి దాటగానే ఆ దేహమును విడిచిపెట్టి దేహములో నుండి బయటకు వస్తాడు. దానినే మనము మరణము అంటాము. ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు. గాలి పుష్పముల నుండి వచ్చే సుగంధము మీది నుండి, మురికి నుండి వచ్చే దుర్గంధము మీది నుండి వీచినపుడు ఆ సుగంధ దుర్గంధములు గాలిలో కలిసి వెళుతుంటాయి. అలాగే జీవుడు ఈ శరీరములో నుండి బయటకు వచ్చినపుడు శరీరంలో ఉన్నప్పుడు తాను పంచేంద్రియములు, మనసుతో చేసిన మంచి పనులు చెడ్డ పనుల వాసనలను తన వెంట తీసుకొని వస్తాడు. ఆ వాసనలతో పాటు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. దీని వలన మనం ఈ క్రింది విషయాలను గ్రహించాలి.

1. జీవాత్మ పరమాత్మ ఒకటే, వేరు కాదు.

 2. జీవాత్మ శరీరము వేరు. ఒకటి కాదు. 

3. జీవాత్మ శరీరమును వదిలేటప్పుడు, తాను ఈ శరీరంలో ఉన్నప్పుడు మనస్సుతో, ఇంద్రియములతో చేసిన పనుల వాసనలను తనలో తీసుకొని వెళతాడు. వాటితో పాటు కొత్త దేహంలో ప్రవేశిస్తాడు.

నేను వేరు శరీరం వేరు అని తెలుసుకున్న వాడు, శరీరము, మనస్సుకు కలిగే వికారములకు లోను కాడు. నిర్మలంగా ఉంటాడు. తాను ఈ శరీరం కాడు, పరమాత్మ స్వరూపుడు అని అనుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉంటాడు. జీవుడు ఈ శరారాన్ని పదిలేటప్పుడు తనతో పాటు సూక్ష్మమైన ఇంద్రియముల యొక్క లక్షణములను, తనతో తీసుకొని వెళతాడు. జీవుడు తన జీవిత కాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలో దొరికే పదార్థములను ముఖ్యంగా ధనమును, ఆస్తిని, రాజ్యమును, పదవులను, భార్య, సంతానము, బంధువులు, మిత్రులు సేకరిస్తుంటాడు. వాటిని అనుభవిస్తుంటాడు. దీనితోనే అతని జీవితం గడిచిపోతుంది. కాని ఇవేవీ కూడా మరణించేటప్పుడు అతని వెంటరావు. ఆ విషయం అతనికి తెలుసు కానీ తెలియనట్టే ఉంటాడు. అదే అజ్ఞానము.

జీవుని వెంట వచ్చేవి రెండే రెండు. ఒకటి సూక్ష్మశరీరము. రెండు ఆ సూక్ష్మశరీరానికి అంటుకొని ఉన్న అతని కర్మల వాసనలు. ఈ వాసనలు, సంస్కారములు శుద్ధంగా ఉంటే, మంచి జన్మ వస్తుంది. ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచజన్మ లభిస్తుంది. మనం మరుజన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. మనసు, ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డిపరక కూడా రాదు, బంధువులు, మిత్రులు, భార్యబిడ్డలు, శ్మశానం దాకా వస్తారు. ధనము, ఆస్తులు, ఏవీ వెంటరావు. అవి అతని మరణాన్ని ఆపలేవు. అతనికి మంచి జన్మ ఇవ్వలేవు. కేవలము మనస్సు, ఇంద్రియతత్వములు వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరు జన్మను నిర్ణయిస్తాయి.

ఈవిషయాన్ని సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. వాయువు అంతటా వీస్తూ ఉంటుంది. ఆ వాయువులో పూల మీది నుండి మంచి వాసనలు, మలినపదార్థముల నుండి చెడు వాసనలు చేరుతూ ఉంటాయి. ఆ వాసనల ప్రభావం వాయువుకు అంటదు. వాయువు ఈ మంచి వాసనలు చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకొని పోతుందో, సూక్ష్మదేహం కూడా తన వెంట మానవుడు తన జీవిత కాలంలో తన మనసు, ఐదు ఇంద్రియ సూక్ష్మతత్వములు, ఆ ఐదు ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలిగిన వాసనలను తన వెంట తీసుకొని పోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మాత్రమే తీసుకొని, చెడు వాసనలు ఇక్కడే వదిలిపెట్టదు. అన్ని వాసనలను తన వెంట తీసుకొని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని, జీవిత కాలంలో మనసుతో, ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే, సంగము విడిచిపెడితే, నిష్కామ కర్మలు చేస్తే, తన వెంట మంచి వాసనలు తీసుకొని పోయి మంచి జన్మ పొందగలడు. లేకపోతే నరకప్రాయమైన నీచజన్మ తప్పదు.

                              ◆ వెంకటేష్ పువ్వాడ.