Read more!

మంచి సందేశాన్నిచ్చే విష్ణుభక్తుడి కథ!

 

మంచి సందేశాన్నిచ్చే విష్ణుభక్తుడి కథ!

ఓ రోజు నారదుడు, విష్ణువు కలసి భూమి మీద సంచారానికి వచ్చారు. ఇద్దరూ బాటసారుల వేషంలో నగరవీధుల్లో తిరగసాగారు. అలా నడుస్తూన్నవాళ్ళు ఓ దుకాణం ముందు నుంచి వెళ్తుండగా, విష్ణువు ఆ యజమానికి నమస్కారం చేశాడు. ఆ దుకాణం యజమాని అది గమనించలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ నారదుడికి కోపం వచ్చింది. 

"నువ్వు ఓ సామాన్యుడికి దండం పెట్టటం ఏమిటి" అని వాపోయాడు. 

"నా భక్తులంటే నాకు ప్రీతి" అన్నాడు విష్ణువు. 

తీరా చూస్తే ఆ యజమాని శరీరం మీద విష్ణుభక్తుడన్న సూచనలేవీ లేవు. కనీసం దుకాణంలో దేవుడి పటం కూడా లేదు. దాంతో అతడు విష్ణుభక్తుడెట్లా అయ్యాడో తెలుసుకోవాలనిపించింది నారదుడికి.

'అతడిని గమనించా'లన్న కోరికను నారదుడు వ్యక్తపరచాడు. 'సరే' నన్నాడు విష్ణువు. ఇద్దరూ అతడిని గమనించటం ఆరంభించారు. సాయంత్రం అయింది. దుకాణం కట్టేస్తూ ఆ వ్యాపారి, ఈ ఇద్దరు బాటసారులనూ చూశాడు. 'అయ్యా తమరు అలసిపోయి నట్టున్నారు. ఈ రాత్రికి నా ఇంట్లో విశ్రమించండి' అని అభ్యర్థించాడు. 

ఇద్దరూ అతడి ఇంటికి వెళ్ళారు. అతడి దినచర్యను నారదుడు  గమనించసాగాడు. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు తప్ప భగవంతుడి పేరు కూడా ఎత్తడు ఆ వ్యాపారి. రోజంతా నిజాయితీగా వ్యాపారం చేస్తాడు. భార్యాపిల్లలను ప్రేమగా చూస్తాడు. ఇదంతా గమనించిన నారదుడు విష్ణువును నిలదీశాడు. '

"నీ పేరే తలవడు. అతడు నీ భక్తుడు ఎలా అయ్యాడు?" అని ప్రశ్నించాడు.

దానికి విష్ణువు నవ్వి. "ఓ గిన్నె నిండుగా నూనె పోసి నూనె చిందకుండా రోజంతా నడుపు. అప్పుడు చెప్తా'ను" అన్నాడు. 

నారదుడు 'సరే'నని నూనెను తలకెత్తుకున్నాడు. జాగ్రత్తగా నడిచాడు. అప్పుడప్పుడు దాదాపుగా నూనె ఒలికే పరిస్థితి వస్తే ఒడుపుగా, నూనె పడకుండా కాపాడాడు. సాయంత్రం కాగానే సంతోషంగా నిట్టూర్చి నూనె గిన్నె దించి 'ఇప్పుడు చెప్పు' అనడిగాడు విష్ణువును, అంతలోనే నారదుడికి సమాధానం స్ఫురించింది. పొద్దుటి నుంచీ తన దృష్టి గిన్నెలోంచి నూనె ఒలకకుండా చూడటం పైనే ఉంది తప్ప ఒక్కసారి కూడా విష్ణునామస్మరణ చేయలేదు. అదే ఆ వ్యాపారి సంసారంలో ఉంటూ, తన కర్తవ్యం చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, కనీసం రోజుకు రెండు మార్లయినా భగవంతుడిని స్మరిస్తున్నాడు. అది అర్ధమైన తరువాత, నారదుడు కూడా ఆ వ్యాపారికి నమస్కరించాడు.

కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలి. ఫలితం గురించి ఆలోచించకూడదుఆ అని చెప్పటం సులభం. ఆచరించటం కష్టం. వెంటనే ఓ సందేహం వస్తుంది. ఫలితం గురించి ఆసక్తి, ఆశ లేనప్పుడు కర్మలు చేయటం ఎందుకని ప్రశ్నించవచ్చు. పరీక్షల్లో పాసయితే, మంచి మార్కులు వస్తే పై చదువులు చదవచ్చు. మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. ఇటువంటి ఆశలు, కోరికలు లేనప్పుడు చదవటం ఎందుకు? పరీక్షలు రాయటం ఎందుకు? అని అడగవచ్చు. పెద్దలను సైతం వేధించే ఈ సందేహాన్ని సరైన రీతిలో వివరించకపోతే పిల్లలకు ఆరంభం నుంచీ మన శాస్త్రాలు సిద్ధాంతాల పట్ల చులకన భావం కలగవచ్చు. ప్రస్తుతం జరుగుతోందీ ఇదే. 'కర్మలు చిత్తశుద్ధితో నిర్వహించండి. ఫలితం గురించి ఆలోచించకండి' అంటే ఏ పనీ చేయకుండా కూర్చుని, 'నేనేమీ ఆశించటం లేదు' అనటం కాదు. లేక ఫలితం గురించి ఆశ లేనప్పుడు ఇక పని చేయటం ఎందుకని వాదించటం కాదు. ఇటువంటి సందర్భంలోనే విష్ణుభక్తుడి కథను మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.

                                    ◆నిశ్శబ్ద.