Read more!

భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కొన్ని అద్భుత వాక్యాలు!

 

భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కొన్ని అద్భుత వాక్యాలు!

కొంతమంది పెద్దవాళ్ళు వారు ఏదైనా ఇతరులకు చెప్పేటప్పుడు కొన్ని ఉదాహరణల సహాయంతో విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెబుతారు. ఈ ఉదాహరణలనే పోలికలు, ఉపమానాలు అని కూడా అంటారు. అలా ఉపమానాలతో చెప్పడం వల్ల వారు చెప్పదలచుకున్న కష్టమైన విషయం అయినా వినేవారికి ఎంతో బాగా తొందరగా, వివరంగా అర్థమవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే పద్ధతి అనుసరించి ఎన్నో విషయాలను అర్జునుడికి చెబుతాడు. భగవద్గీతలో ఉన్న అలాంటి కొన్ని వాక్యాలు ఇవి!!

మనుజుడు పాతబట్టలను విడిచి యితరములగు క్రొత్తబట్టల నెటుల ధరించుచున్నాడో; అట్లే ఆత్మ పాతశరీరములను వదలి క్రొత్త శరీరములను ధరించుచున్నది.

సర్వత్ర జలముచే పరిపూర్ణమైన గొప్ప జలాశయము లభింప, అత్తఱి స్వల్పజలముతో గూడిన బావి మొదలగు వానియందు మనుజున కెంత ప్రయోజన ముండునో, అనుభవజ్ఞుడగు బ్రహ్మజ్ఞానికి సమస్త  వేదములందును అంత ప్రయోజనమే ఉండును.

తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు యోగియగువాడు ఇంద్రియములను విషయములనుండి ఎపుడు మరలించుకొనునో అపుడతని జ్ఞానము స్థిరమైనదిగా అగుచున్నది.

జలముచే సంపూర్ణముగా నిండింపబడినదియు, స్థిరమైన ఉనికి గలదియునగు సముద్రమును నదులు మొదలగువాని ఉదకములు ఏ ప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారముగా సమస్తమైన కోరికలు ఏ బ్రహ్మనిష్ఠునియందు ప్రవేశించి అణగిపోవుచున్నవో, అట్టి మహనీయుడే శాంతిని పొందునుగాని విషయాసక్తి కలవాడు కాదు.

పొగచేత నిప్పు, దుమ్ముచే అద్దము, మావిచే గర్భమందలి శిశువు ఏలా కప్పబడియున్నవో అలా కామముచే ఆత్మజ్ఞానమున్ను కప్పబడియున్నది.

ఓ అర్జునా! లెస్సగ మండుచున్న అగ్ని ఏ ప్రకారము కట్టెలను భస్మమొనర్చునో ఆ ప్రకారమేజ్ఞానమను అగ్నియు సమస్తకర్మలను భస్మమొనర్చివేయును. 

ఎవడు తాను చేయు కార్యములను పరమాత్మయందు సమర్పించి ఫలాసక్తిని (సంగమును) విడిచి పెట్టునో అట్టివానికి తామరాకునకు నీరంటనట్లు పాపములు అంటకుండా ఉండును.

ఏ ప్రకారము గాలి వీచనిచోట గల దీపము నిశ్చలముగ నుండునో, ఆ ప్రకారము ఆత్మధ్యానమందు లగ్నమైయున్న యోగియొక్క స్వాధీనచిత్తము కూడ నిశ్చల స్థితిని పొందియుండును.

అర్జునా! నా కంటే ఇతరమైనది ఏదియును ఈ ప్రపంచమున ఒకింతైనను లేదు. దారమునందు మణులవలె నాయందు ఈ సమస్త ప్రపంచమున్ను కూర్చబడియున్నది. అంతటా సంచరించునది గొప్పది అయిన వాయువు సర్వకాలములందును ఆకాశమునందెట్లు నిలిచియున్నదో, అట్లే సమస్తభూతములు  నాయందున్నవని తెలిసికొనుము.

ఓ అర్జునా! ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది. మఱియు దీనిని తెలియువాడు క్షేత్రజ్ఞుడని విజ్ఞులు పేర్కొనుచున్నారు.

అతిసూక్ష్మమై ఉండుటచే సర్వవ్యాపకమగు ఆకాశము దేనిచేతను అంటబడక ఎట్లుండునో, అట్లే సర్వత్రవ్యాపించియున్న ఆత్మ దేహాదులచే నంటబడక యుండును. 

అర్జునా! సూర్యుడొకడు సమస్తలోకముల నెట్లు ప్రకాశింపచేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడగు ఆత్మ దేహాది సమస్తక్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు.

దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి సంసారరూప అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను వేళ్ళు పైన కొమ్మలు క్రిందగా గలిగియున్నదిగను, బహుకాలముండునదిగను పెద్దలు చెప్పుదురు. దానినెవడెఱుగునో అతడు వేదము నెఱింగిన వాడగును.

సంసారమను ఆ అశ్వత్థవృక్షము యొక్క కొమ్మలు గుణములచే వృద్ధినొందింపబడినవియు, విషయములను చిగుళ్లుగలవి పైకిని, క్రిందకును వ్యాపించి యున్నవి. దానివేళ్ళు మనుష్యలోకమునందు కర్మసంబంధము గలవియై క్రిందికి గూడ విస్తరించి యున్నవి. 

వాయువు - పుష్పములు మొదలగు వాసనగల పదార్థములనుండి బయలుదేరునపుడు, ఆ యా పదార్థములు వాటి సువాసనను ఎట్లు తీసికొని పోవుచున్నదో, అట్లే జీవుడు ఒక దేహమును వదలి మఱియొక దేహమును పొందునపుడు శరీరము నచ్చటనే విడిచిపెట్టినను, దానియందుండు మనస్సు మొదలగు ఆరు ఇంద్రియములను, వాసనలను తీసికొని వెలుచున్నాడు.

◆ నిప్పు పొగవే కప్పబడినట్లు సమస్త కర్మములు దృశ్యరూప దోషముచేత కప్పబడియున్నవి.

ఓ అర్జునా! ఈశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క హృదయస్థానమున నివసించి, యంత్రమున తగుల్కొన్నవారినివలె వారినందరిని మాయచే త్రిప్పుచున్నాడు.

ఇవీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కొన్ని అద్భుతమైన వాక్యాలు.


                                         ◆నిశ్శబ్ద.