Read more!

గీతా శ్లోకాన్ని అనుసరించి నేటి విద్యావ్యవస్థకు ఉదాహరణ!

 

గీతా శ్లోకాన్ని అనుసరించి నేటి విద్యావ్యవస్థకు ఉదాహరణ!


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగో స్వ కర్మణి

కర్మలాచరించే స్వాతంత్ర్యం మనిషికి ఉన్నా, ఫలంపై ఎటువంటి జోక్యం లేదు. కాబట్టి కర్మఫలాన్ని ఆశించకూడదు. అలాగని కర్మలు చేయటం మానకూడదు. కర్మఫలాలు ఈశ్వర సంకల్పాధీనాలు. ప్రకృతి నియమానుసారం ఎప్పుడు ఏ కర్మకు ఏ ఫలితం లభించాలో, అది లభించి తీరుతుంది.

ఈ ఆలోచనను మెట్ట వేదాంతం అని ఈసడించి కొట్టేస్తారు ఆధునిక అభ్యుదయ వాదులు. కానీ తరచి చూస్తే ప్రపంచంలో పలు నాగరికతల్లో, పలు సంస్కృతులలో సుఖమయజీవితానికి ఈ ఆలోచననే ఏదో ఓ రూపంలో ప్రదర్శించటం చూడవచ్చు.

'జయాపజయాలు దైవాధీనాలు' అనటం మనకు తెలుసు. గెలుపు ఓటములు భగవంతుడి అధీనాలు కాబట్టి, మనం ఆట ఆడటం మానేసి భగవంతుడినే ఎవరు గెలుస్తారో, ఓడతారో, అడిగేస్తే పోలా? అని ఎవరైనా అంటారా? ఆట ఆడిన తరువాత తమకి తాము సర్దిచెప్పుకునేందుకు ఈ భావనను ఉపయోగిస్తారు. ఆట ఓడిన తరువాత కాదు, ఆట ఆడే ముందు నుంచే ఈ భావనను అర్థం చేసుకుంటే పరోక్షంగా ఫలితాన్ని మనం నిర్దేశించవచ్చు.

సర్వసృష్టి భగవంతుడిమయం అయితే సృష్టిలో జరిగే ప్రతి విషయానికీ ఏదో స్పష్టమైన అర్థం ఉంటుంది. ప్రతి ప్రాణికీ స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. ఈ భావన పిల్లవాడిలో బలంగా నాటుకుంటే, ఎవరూ నేర్పకుండానే ఫలితంపై ఆసక్తి నశిస్తుంది.

మంచి పనికి మంచి ఫలితం ఉంటుంది. చెడు పనికి చెడు ఫలితం ఉంటుంది. కాబట్టి తన పనిని తాను సక్రమంగా నిర్వహిస్తే ఫలితం తప్పని సరిగా మంచి ఫలితమే అవుతుంది. ఈ విశ్వాసం పిల్లవాడిలో, తల్లిదండ్రులలో కలగాలి. అప్పుడు ఉద్విగ్నతలు అవే అదృశ్యం అవుతాయి. పరీక్షకు అవసరమైన సమాధానాలు క్షుణ్ణంగా నేర్చుకుని, రాసి చూసుకుంటూంటే పిల్లవాడికి తాను చేసే తప్పులు అర్థమౌతాయి. దాంతో ఆ తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ రాసుకుంటే తప్పులను తొలగించే అవకాశం హెచ్చవుతుంది. అలా కాక, తాను పరీక్షలో నెగ్గుతానో, లేదో, అన్న భయంతో ఎంత చదివినా ఫలితం ఉండదు. ఎందుకంటే హృదయంలోని ఉద్విగ్నత మెదడుపై ప్రభావం చూపిస్తుంది. కళ్లు అక్షరాల వెంట పరుగెడుతూంటాయి కాని మెదడుకేమీ సంకేతాలు అందవు. దాంతో ఎప్పుడూ చదువుతున్నట్టే ఉంటుంది. ఫలితం మాత్రం ఉండదు. తల్లిదండ్రులు సైతం పిల్లవాడిని కూచోబెట్టి "ఎంత సేపు చదివితే అంత మంచిది" అన్నట్టు ప్రవర్తిస్తారు. దాంతో "తప్పనిసరి తద్దినం"లా చదువుతాడు పిల్లవాడు. తల్లిదండ్రుల సంతృప్తి కోసం చదివినట్టు చదువుతాడు, అందుకే ఫలితం కూడా అలాగే ఉంటుంది.

కాబట్టి పరీక్షా ఫలితం మీద దృష్టి ఉండకుండా, ఎదురుగా ఉన్న ఒక్క ప్రశ్న సమాధానం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఈ ప్రశ్న పరీక్షలో అడుగుతాడో, అడగడో అన్న భావన వదిలేయాలి. పరీక్షలో వచ్చినా, రాకున్నా ఈ సమాధానం క్షుణ్ణంగా నేర్చుకోవాలి అనుకుంటూ ఒక్కో సమాధానం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. తల్లిదండ్రులు సైతం ఈ విషయంలో పిల్లవాడికి సహకరించాలి. ఫలితం ప్రసక్తి తేకుండా "నీ కర్తవ్యం చిత్తశుద్ధితో నిర్వహించు. ఫలితం భగవంతుడికే వదిలేయి" అన్నట్టు ప్రవర్తించాలి.

దీనివల్ల పిల్లవాడిలో ఫెలైతే?? అన్న భావన భూతంలా ఎదగదు. అసలు ఆ ఆలోచనే రాదు. భగవంతుడి సృష్టిలో పనికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి, తాను తన పని నిజాయితీగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఫలితం దానంతట అదే వచ్చి తీరుతుంది అన్న విశ్వాసం పెరుగుతుంది. ఉద్విగ్నత స్థానాన్ని విశ్వాసం ఆక్రమిస్తుంది. పనికి తగ్గ ఫలితం ఉంటుందన్న విశ్వాసం ఉండటంతో పని చేయాలన్న ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు చదువు "తప్పనిసరి తద్దినం" లా కాక ఆందోళన లేని ఆనందకరచర్యగా మారుతుంది.

                                         ◆నిశ్శబ్ద.