మనిషి ఆధ్యాత్మికత సాధించలేకపోవడానికి కారణమిదే..

 

మనిషి ఆధ్యాత్మికత సాధించలేకపోవడానికి కారణమిదే..

 ఆధ్యాత్మికత మనుషుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది ఈ కాలంలో. దీని కారణంగా మనిషికి ప్రశాంత జీవనం సంప్రాప్తిస్తుందని, ప్రతిఒక్కరికీ అది అవసరం అనీ భావిస్తారు. అయితే ఆధ్యాత్మికత అనుకున్నంత సులువుగా మనిషి జీవితంలో భాగం కాదు. దేనికి కారణం మనుషులే.. తాము ఆధ్యాత్మికత సాధించాలంటునే ఇతర విషయాలవైపు ఆకషర్షింపబడి, దారి తప్పి ప్రవర్తిస్తూ తామింకా ఆధ్యాత్మికత కోసం తపిస్తున్నాం అనుకుంటారు. దానికి చక్కని ఉదాహరణగా ఈ కథ నిలుస్తుంది.

ఒక రాజుగారు తన రాజ్యానికి వారసుణ్ణి ఎన్నుకుందామనుకున్నాడు. తన వారసుడు ఎలాంటి పక్షపాత బుద్ధీ లేకుండా రాజ్యపాలన చేయగలగాలని ఆయన అభిప్రాయం. ఆ వారసుడు అన్ని ప్రలోభాలకూ దూరంగా ఉండాలని ఆయన ఆకాంక్ష. సరియైన వారసుణ్ణి ఎన్నుకునే ఉద్దేశంతో రాజు ఒక పథకం వేశాడు. వారసులు కాదలచుకున్నవారంతా రాజభవనం వద్దకు ఫలానా సమయానికి చేరుకోవాలని ప్రకటించాడు. ఈ లోపల, రాజప్రాసాదంలో అనేక వస్తువులతో కూడిన అసంఖ్యాకమైన అంగళ్ళు, శోభాయమానమైన దృశ్యాలతో ఒక తాత్కాలికమైన సంతను ఏర్పాటుచేయాల్సిందిగా సేవకులను ఆదేశించాడు.

ఆ సంతలో ప్రలోభానికి గురి చేసే ఆకర్షణీయమైన వస్తువులు ప్రదర్శితమైనాయి. ఎవరికి ఏ వస్తువు కావాలన్నా సరే, ఏ విధమైన పైకమూ చెల్లించకుండా, ఉచితంగా తీసుకోవచ్చు. రాజభవనానికి చేరాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశం ద్వారానే వెళ్ళాలి. ఒక నిర్ణీత సమయానికి రాజభవనం వద్దకు చేరుకోవాలని అభ్యర్థులందరికీ చెప్పారు. చాలామంది ఆ ప్రదేశంలోకి ప్రవేశించి, అక్కడి అద్భుతమైన వస్తువులను చూస్తూ, మధుర సంగీత, నృత్యాలను ఆస్వాదిస్తూ సంతోషంతో తమను తాము మరచిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం ఆ ప్రలోభాలకు లొంగక, దృఢసంకల్పంతో నిర్ణీత సమయానికి రాజభవనం చేరుకున్నాడు. అతణ్ణి చూసి ఆ రాజు తాను సరియైన వ్యక్తిని తన వారసునిగా పొందగలిగానని చాలా సంతోషించాడు.

పవిత్రమైన, ప్రశాంతమైన, ఆదర్శవంతమైన మనస్సును పొందడం కూడా అలాంటిదే! అంతర్గత శాంతి, పరిశుద్ధత అనే రాజును కలుసుకోవాలంటే దారిలో ఎదురయ్యే ప్రలోభాలతో కూడిన సంతలో సమయాన్ని వృథా చేసుకోకూడదు. మన జీవితానికొక లక్ష్యం ఉంది. ఆధ్యాత్మిక చైతన్యంతో, బంధవిముక్తులం కావాలన్నది మన ఆకాంక్ష. అందువల్ల మనకు జీవన పథంలో ఎదురయ్యే ప్రలోభాలన్నిటినీ వదిలివేయగలగాలి. లేనట్లయితే మనం గమ్యం చేరుకోలేం. కాబట్టి మనస్సును పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవడమే జీవితంలో గొప్ప సద్గుణం.

                                         *నిశ్శబ్ద.