Read more!

మనిషి తనకేదురయ్యే పరిస్థితులను ఎలా తీసుకోవాలి!

 

మనిషి తనకేదురయ్యే పరిస్థితులను ఎలా తీసుకోవాలి!

జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడం గురించి యోగ తెలియజేస్తుంది. అంతేకాదు మానసిక ప్రశాంతతనూ, సమత్వాన్నీ ఎలా పొందాలో ప్రబోధిస్తూ మనకు మార్గదర్శకత్వం చేస్తుంది. అన్ని పరిస్థితులలోనూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిజంగా చూస్తే ఏ పరిస్థితీ దానంతట అది చెడుదీ కాదు, మంచిదీ కాదు! అదంతా ఆ సందర్భాన్ని బట్టీ, దాన్ని చూసే మన దృష్టిని బట్టీ ఉంటుంది. 'అయ్యో! నాకే ఈ బాధలు రావాలా?' అని చింతించకుండా మనకు ఎదురయ్యే క్లిష్టపరిస్థితులు మనల్ని పరిపూర్ణులుగా, వివేకం గలవారిగా తీర్చిదిద్దే మంచి అవకాశాలని భావించాలి.

కష్టాలు, బాధలు అనుభవించడం ద్వారా మన మనస్సు స్వభావాన్నీ, ఈ ప్రపంచపు నైజాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనలోని ఆలోచనాశక్తి మరింత పెరిగి, బాధ్యత గలవారిగా తయారవుతాం. వీటి వల్ల మానసిక పరిశుద్ధత (చిత్తప్రసాదనం) కలుగుతుంది.

కర్మఫలాలను అంగీకరించి, వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితినీ సానుకూలంగా మార్చుకునే శక్తి అంతర్గతంగా, సహజంగా మనకుంది. బాహ్యంగా జరిగే విషయాలు చెడువే అయినా, వాటి పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవచ్చు. కష్టమైన పరిస్థితి ఎదురైనా, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. దృఢంగా, వినయంగా, సరళంగా, ఋజుమార్గంలో, మంచిగా ఉండమని మన మనస్సుకు మనం సూచించాలి. అప్పుడు జీవితం గురించి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆనందంగా ఉండడమా, లేదంటే విచారంగా ఉండడమా అన్నది మన చేతుల్లోనే ఉంది. మనపైనే ఆధారపడి ఉంది. వ్యతిరేక భావాలు మనలో కలిగినప్పుడు, సానుకూల భావాలను ప్రేరేపించాలి. క్రోధం, ఇంద్రియ చాపల్యం, దురాశ లాంటి శత్రువులు మనలో తలెత్తినప్పుడు, వాటికి ప్రతికూలమైన భావాలను రేకెత్తించాలి. ఉదాహరణకు మన మనస్సులో దురాశ గానీ, ఒక వస్తువు కావాలన్న కోరిక గానీ కలిగితే, మన మనస్సునే ఈ విధంగా అడగాలి. "నేనెందుకని దీని పట్ల వ్యామోహ పడుతున్నాను? అది నిజంగా నాకు సంతోషాన్ని కలుగజేస్తుందా?"

 ఈ విధంగా ప్రశ్నించుకుంటూ పోతే క్రమక్రమంగా ఆనందానికి మూలం మన లోపలే ఉన్నదని కనుక్కోగలుగుతాం. మనస్సును విశదంగా పరిశీలించి, మనం కోరుకునే తాత్కాలిక సుఖాల ఫలితాలను తెలుసుకోగలగాలి. ఆ విధంగా చేస్తే మనస్సు నెమ్మది నెమ్మదిగా అన్ని బంధాల నుండీ విముక్తమై, పరిశుద్ధమైపోతుంది.

                                          *నిశ్శబ్ద.