Read more!

ప్రతిమనిషి జీవితంలో ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి!

 

ప్రతిమనిషి జీవితంలో ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి!

జన్మించిన ప్రతి మనిషికీ మూడు ఋణాలుంటాయి. అవి: పితృ ఋణం, దేవ ఋణం, ఋషి ఋణం.

పితృ ఋణం : 

మనల్ని కని, పెంచి, కష్టపడి విద్యాబుద్ధులు చెప్పించి, సమాజంలో మనకు గౌరవ స్థానం కల్పించి మన కొరకు ఎన్నో త్యాగాలు చేసిన తల్లి తండ్రులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాం. ఆ ఋణం తీర్చుకునేందుకు మనం వారిని శ్రద్ధతో ఆదరించి, సేవించి వారిమాటకు మాన్యతనిచ్చి వారికి అనుకూలంగా జీవించాలి. అలా చేస్తేనే 'పితౄణం' తీర్చుకున్నట్లు అవుతుంది.

ఈ పితౄణంలో రెండో భాగం, మన పెద్దలు మనల్ని ఏ విధంగా కని, పెంచి, సంస్కారవంతుల్ని చేశారో అలాగే మనం కూడా ఉత్తమ గృహస్థులమై సద్గుణ వంతులైన సంతానానికి జన్మనివ్వాలి, వారిని సంస్కారవంతుల్ని చేయాలి. సత్ పౌరుల్ని చేయాలి. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి అనే పంచ సౌశీల్యాలను వారికి బోధించి, జాతి గర్వించదగ్గ రత్నాలుగా తీర్చిదిద్దాలి. సంతానాన్ని మంచి వారిగా తీర్చిదిద్దినప్పుడే మన వంశానికి, దేశానికి మేలు జరుగుతుంది. అందుకే పెద్దలు పితృయజ్ఞానికి ప్రాధాన్యత ఇచ్చారు.

దేవ ఋణం: 

పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం - ఇవి పంచ భూతాలు. ఇవి జడ దేవతలు. ఈ దేవతలను నిత్యం వాడుకుంటున్నాం. వాటిని అపవిత్రం చేస్తున్నాం. వాటిని శుద్ధి చేసే బాధ్యతను పరమాత్ముడు మానవులకే అప్పగించాడు. అందుకై నిత్యం ప్రాతః సాయం సంధ్యాసమయాలలో అగ్నిహోత్రం చేయాలి. 'అగ్నిర్ వై దేవానాం ముఖం' -అగ్నిహోత్రం దేవతలందరికీ ముఖం, అంటే నోరు లాంటిది. దేవతల్ని శుద్ధి చేయాలంటే అగ్ని హోత్రం ద్వారానే చేయాలి. సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి మొదలైన పుష్టికర పదార్థాలతో హోమం చేయాలి. ఇదొక వైజ్ఞానిక ప్రక్రియ. దీని ద్వారా 'దేవ ఋణం' తీరుతుంది.

ఋషి ఋణం : 

ఋషులు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, గృహ్య సూత్ర గ్రంథాల ద్వారా మానవ శ్రేయస్సుకు మార్గాల్ని ఉపదేశించారు. వాటిని తెలుసుకొని ఆచరించాలి. ఋషులు త్రికాలజ్ఞులు. భూత భవిష్యత్ వర్తమానం వారికి తెలుసు. పరమాత్ముని వేద జ్ఞానాన్ని గ్రహించి గురుశిష్య పరం పరగా భావితరాలకు అందిస్తూ వచ్చిన ఋషులకూ, గురువులకూ ఋణపడ్డాం. వారి ఋణం తీర్చుకోవాలి. అందుకు జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానం లేకుంటే మనిషి హీనంగా జీవిస్తాడు.

'న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే'

విద్యకూ, జ్ఞానానికీ మించిన పవిత్రమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. ఋషి ఋణం తీర్చుకోవాలంటే మనం విద్యావంతులం, బుద్ధిమంతులం, జ్ఞానవంతులం కావాలి. తరువాత తరాల వారికి ఆ జ్ఞానాన్ని అందించాలి. ఇది గొప్ప తపస్సు లాంటిది. మనిషి ఇక్కడే కైవల్యానికి దారులు వేసుకుంటాడు. దీని ద్వారా ఋషుల ఋణం తీరుతుంది.    

                                  ◆నిశ్శబ్ద.