ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు...ఈ రోజు శ్రీహరిని ఎలా పూజిస్తే శుభమంటే!
ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు...ఈ రోజు శ్రీహరిని ఎలా పూజిస్తే శుభమంటే!
ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలామంది ఏకాదశి తిథి ప్రాముఖ్యతను తెలుసుకుని ఏకాదశి వ్రతం కూడా ఆచరిస్తారు. దీని ప్రకారం ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉంటారు. శ్రీహరిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇలా చేస్తే ఆ శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. ఏకాదశి తిథి ఈ కార్తీక కృష్ణపక్షం లోని ఈ రోజే ఉద్భవించిందని చెబుతారు. అందుకే ఈ తిథికి ప్రాధాన్యత ఎక్కువ. ఈరోజు శ్రీహరిని, లక్ష్మీదేవిని చాలా శ్రద్దగా పూజిస్తారు. ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు. అయితే ఈ రోజు శ్రీహరిని ఈ కింద చెప్పుకున్న విధంగా పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది.
పూజ ప్రాముఖ్యత..
ఉత్పన్న ఏదాదశి రోజు శ్రీహరి, మహా లక్ష్మీ అమ్మవారి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఏకాదశి రోజు హస్త నక్షత్రం ఉంటుంది. వీటి కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయని శాస్త్ర పండితులు అంటున్నారు.
ఏకాదశి..
ఉత్పన్న ఏకాదశి తిథి రోజు విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఉత్పన్న ఏకాదశి రోజే విష్ణువు శరీరం నుండి ఏకాదశి పుడుతుందట. ఈ రోజు శ్రీహరి లేదా విష్ణుమూర్తిని పూజించే సమయంలో "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించాలి.
విష్ణువుకు సమర్పించే నైవేద్యం, పానకం, వడపప్పు.. ఇలా ఏదైనా సరే.. అందులో తులసి దళం వేసిన తరువాతే నైవేద్యాన్ని ఆయనకు సమర్పించాలి. తులసి దళం లేకుండా పెట్టే నైవేద్యాన్ని విష్ణువు స్వీకరించడట. అందుకే తులసి దళం తప్పనిసరిగా వేయాలి.
ఉత్పన్న ఏకాదశి రోజు సత్యనారాయణ కథ వినడం, చదవడం ద్వారా తెలిసీ తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారట.
ఉత్పన్న ఏకాదశి రోజు వీలైతే విష్ణుమూర్తి ఆలయాన్ని కానీ విష్ణువు దశావతారాలలో ఏదో ఒక ఆలయాన్ని కానీ దర్శించడం చాలా మంచిది.
మహిళలకు తమ జీవితంలో అదృష్టం, సంతోషం కలగాలన్నా, వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరియాలన్నా ఉత్పన్న ఏకాదశి రోజు తులసిని పూజించాలి. ఈ రోజు వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ముత్తైదువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి.
ఉత్పన్న ఏకాదశి రోజు చేసే దానానికి చాలా ప్రత్యేక ఉంటుంది. ఈ రోజు చేసే దానం సాధారణ రోజులలో చేసే దానం కంటే ఎక్కువ పుణ్య ఫలాన్ని ఇస్తుంది. పేదలకు, నిస్సహాయులకు, వృద్దులకు వీలైనంత దానం చేయాలి. ఇలా చేస్తే ఉత్పన్న ఏకాదశి జీవితంలో సంతోషాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగానూ, దైవిక పరంగానూ భక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది.
*రూపశ్రీ.