శివలింగం ముందు నంది మాత్రమే ఉంటాడు ఎందుకు!
శివలింగం ముందు నంది మాత్రమే ఉంటాడు ఎందుకు!
పరమేశ్వరుడిని బోళాశంకరుడు అని కూడా అంటారు. ఆయన స్వరూపం నుండి ఆయన తత్వం వరకు అన్నీ ఇతర దేవతలకు విభిన్నంగా ఉంటాయి. ప్రతి శివాలయంలో పరమేశ్వరుడి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అందరూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుడిని దర్శించుకుని, నందీశ్వరుడి చెవులలో తమ కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. అయితే నంది విగ్రహాన్ని శివలింగానికి ఎదురుగా ఎందుకు ప్రతిష్టిస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అసలు నందీశ్వరుడు పరమేశ్వరుడికి వాహనంగా ఎలా మారాడు? తెలుసుకుంటే..
నంది శివుడి వాహనంగా ఎలా మారాడు?
పురాణాల ప్రకారం శిలాదుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయన శివుడికి అంత్యత గొప్ప భక్తుడు. అయితే ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వంశం అంతరించిపోతుందని, సంతానం పొందే మార్గాన్ని వెతకమని ఆయన పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో శిలాదుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేయడం మొదలు వెట్టాడు. శిలాదుడి భక్తికి సంతోషించిన శివుడు శిలాదుడికి ఒక కొడుకు లభిస్తాడని చెబుతాడు. కొంతకాలం తర్వాత శిలాదుడు భూమిని దున్నుతున్నప్పుడు, భూమిలో ఒక మగబిడ్డ దొరికాడట. ఆ బిడ్డకు శిలాదుడు నంది అని పేరు పెట్టాడట.
ఒకసారి ఇద్దరు ఋషులు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. వారు నంది జనన సమయం వంటివి గమనించి నంది ఆయుష్షు చాలా తక్కువ అని శిలాదుడితో చెప్పారు. నంది ఎనిమిది సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడనే రహస్యాన్ని తెలిపారు. ఆ విషయం వినగానే శిలాదుడు ఎంతో బాధపడతాడు. తండ్రి బాధ చూసిన నంది తన తండ్రి దగ్గరకు వెళ్లి నాన్నా నేను పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల నీకు లభించాను కదా.. అలాంటప్పుడు దీనికి పరిష్కారాన్ని కూడా పరమేశ్వరుడినే అడుగుతాను అని చెప్పి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం నంది తపస్సు చేయడం మొదలుపెట్టాడు.
నంది భక్తిని చూసి పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు, నంది ముందు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నాలో ఒక భాగం, అలాంటిది నువ్వు మరణానికి ఎలా భయపడగలవు? అని పరమేశ్వరుడు నందితో చెబుతాడు. నందికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఆ రోజు నుండి నందికి శివుడితో విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఎప్పుడూ పరమేశ్వరుడి సమక్షంలోనే ఉంటూ ఆయన ద్వారం ముందు ఉండటం మొదలైంది. అందువల్లే ప్రతి శివాలయంలో శివలింగం ముందు నంది విగ్రహాన్ని ఉంచుతారు.
నందీశ్వరుడి పూజ..
హందూ మత విశ్వాసం ప్రకారం నంది పూజ లేకుండా శివుని పూజ చేస్తే అది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది . కాబట్టి శివ పూజ సమయంలో, నందిని పూజించడం తప్పనిసరి. నందిని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి, శుభ ఫలితాలు వస్తాయి. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. అంతే కాదు.. భక్తులు తమ కోరికలను నందీశ్వరుడికి విన్నవిస్తే.. నందీశ్వరుడు వాటిని పరమేశ్వరుడికి చేరవేస్తాడట. అలా చేస్తేనే పరమేశ్వరుడు భక్తుల కోరికలు తీరుస్తాడనే నమ్మకం కూడా ఉంది.
*రూపశ్రీ.