Read more!

ఉసిరి దీపం, ఉసిరికాయ దానం!!

 

ఉసిరి దీపం, ఉసిరికాయ దానం!!

 

ఆరోగ్యాన్ని చేకూర్చే అమృత ఫలం ఉసిరికాయ. దీని ఆరోగ్య ప్రయోజనాలు, ఇందులో ఉన్న అద్భుత గుణాల గురించి ఆయుర్వేదం అయితేనే సంపూర్ణంగా చెప్పగలదు. సాగరమధనం జరిగినపుడు అమృతం బయటకు వస్తున్నప్పుడు అది తొణికి అమృతం చుక్కలు రాలిపడితే ఆ అమృతపు బిందువుల ప్రతిరూపంగా ఏర్పడినదే ఉసిరికాయ. కారం రుచి తప్ప అన్ని రుచులను కలుపుకుని ఉండే ఒకేఒక్క ఫలం ఉసిరి. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరిని కార్తీకమాసంలో దానం చేయడం మరియు, ఉసిరికాయలో దీపం పెట్టడం వల్ల అద్భుతమైన పలితాలు ఉంటాయని పెద్దలు మరియు పురాణ కథనాలు కూడా చెబుతున్నాయి.

ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకధారా స్తోత్రం. అయితే అందరికీ ఈ స్తోత్రం మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథనం బహుశా చాలాకొద్దిమందికే తెలిసి ఉంటుంది.  ఆదిశంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యసించాడనే విషయం అందరికీ తెలిసినదే. అలా ఆయన చిన్నతనంలో ఉన్నపుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి "మాతా బిక్షాన్ధేహి" అని అడుగుతాడు. అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రహ్మణురాలిది. ఆమెకు ఉన్నది ఒక్కటే చీర. ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని లోపలే ఒకమూల ఉండి ఎదురుచూస్తూ ఉంది. ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు. పూర్తిగా బీదరికంలో ఉంది. అలాంటి ఆమెకు ఆదిశంకరుల పిలుపు వినబడగానే "అయ్యో నా ఇంట్లో ఏమి లేదు. కానీ ఎవరో బిక్షకు వచ్చారు ఏమి చేయాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనిపించింది. ఆమె బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయనే తలుపుచాటు నుండి ఆదిశంకరుల భిక్ష పాత్రలోకి విసురుతుంది. మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్యదృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె బీదరికాన్ని తలచుకుని బాధపడుతూ విష్ణువు,లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధారా స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారట.  అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం. అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు.

ఉసిరికాయలు కార్తీక పౌర్ణమి రోజు దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది. దీనివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ వారిపై ఉంటుంది. కార్తీకమాసంలో ఏది దానం చేసినా దాని పుణ్యం ఎప్పటికీ వెంట ఉంటుంది కాబట్టి ఉసిరికాయ దానం గొప్పది.

ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీ దేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్టు అవుతుంది. కార్తీకపౌర్ణమి రోజు ముక్కోటి దేవతలూ శివుడి సమక్షంలో, శివాలయంలోనే ఉంటారు అక్కడ ఇలా ఉసిరిదీపం పెడితే సకల దరిద్రాలు తొలగి జీవితం గాడిలో పడుతుంది.

ప్రణవ పంచాక్షరీ జపం, విభూతి ధారణ, ఉసిరిదానం, దీపారాధన, కార్తీక పురాణ పఠనం. ఇవన్నీ ఈ కార్తీకమాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది. 

◆ వెంకటేష్ పువ్వాడ