కార్తీక మాసం చివరి రోజు.. ఇలా చేశారంటే మాసం మొత్తం ఫలితం లభిస్తుంది..!
కార్తీక మాసం చివరి రోజు.. ఇలా చేశారంటే మాసం మొత్తం ఫలితం లభిస్తుంది..!
కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో విష్ణువును, శివుడిని.. ఇరువురిని పూజిస్తారు. వీరికి బేధం లేదని చెప్పే మాసమే కార్తీకం. కార్తీక మాసంలో చాలామంది నియమాలు పెట్టుకుంటారు. వాటిలో కార్తీక స్నానం, ఇంట్లోనూ తులసి కోట దగ్గర దీపారాధన, దేవాలయ దర్శనం, కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం. ఇవన్నీ సాధారణంగా చాలామంది పాటిస్తారు. అయితే కార్తీక మాసం మొదలైనప్పడు ఉండే ఉత్సాహం చివరి వరకు సాగించలేరు. దీనికి కారణాలు ఏవైనా కానీ.. కార్తీక పౌర్ణమితో చాలామంది కార్తీక మాస ఆరాధన, నియమాలు నెమ్మదిస్తాయి. అయితే కార్తీక మాసంలో అన్ని రోజులు ఉత్సాహంగా నియమాలు పాటిస్తూ దైవాన్ని ఆరాధించకపోయినా.. మాసం మొత్తం ఆరాధించిన పుణ్య ఫలం లభించాలంటే కార్తీక అమావాస్య చాలా ముఖ్యమైన రోజని చెబుతున్నారు పండితులు. ఇంతకీ కార్తీక అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుంటే..
కార్తీక మాసంలో ఏవైనా కారణాల వల్ల మాసం మొత్తం పూజ, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధన, స్నానం వంటివి కుదరకపోతే.. కనీసం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు అయినా నియమాలు అన్నీ పాటించడం మంచిదట. ఉదయాన్నే స్నానం చేయడం, ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన, పురాణ పఠనం, దేవాలయ దర్శనం, నీటిలో దీపాలు వదలడం వంటివి చేయవచ్చు. ఇలా చేస్తే మాసం మొత్తం పాటించిన ఫలితం వస్తుంది.
కేవలం పైన చెప్పుకున్న నియమాలు మాత్రమే కాకుండా కుదిరిన వారు వస్త్రదానం, బ్రాహ్మణులకు స్వయం పాకం, పేదలకు ఆహారం, పశువులు, పక్షులకు ఆహారం, నీరు అందించడం వంటివి కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల భగవదనుగ్రహమే కాకుండా.. అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల పితృదేవతలు కూడా తృప్తి చెందుతారట. అందుకే కార్తీక మాసం ఆచరించలేకపోయిన వారు, ఏవైనా కారణాల వల్ల మధ్యలో పాటించలేని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు అయినా నియమాలు పాటించడం మంచిది.
*రూపశ్రీ.