కార్తీక అమావాస్య.. ఈరోజు ఇలా చేస్తే పితృదోషాలు తొలగుతాయి..!
కార్తీక అమావాస్య.. ఈరోజు ఇలా చేస్తే పితృదోషాలు తొలగుతాయి..!
ప్రతి మాసంలో పౌర్ణమి తిథికి ప్రాముఖ్యత ఉన్నట్టే.. అమావాస్య తిథికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి రోజు ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పితృపక్షాలతో పాటు కార్తీక అమావాస్య కూడా ఇలా తర్పణాలు ఇవ్వడానికి చాలా మంచి సమయం. కార్తీక అమావాస్య రోజును దర్శ అమావాస్య అని అంటారు. ఈరోజు ఏం చేస్తే పితృ దేవతలు తృప్తి పడతారు. కార్తీక అమావాస్య రోజు ఏం చేయాలి? తెలుసుకుంటే..
కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేసి, ప్రశాంతమైన మనస్సుతో పూర్వీకులను స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెద్దల పట్ల గౌరవాన్ని, భక్తిని వ్యక్తం చేసినట్టు అవుతుంది. ఈ దర్శ అమావాస్య నాడు కొద్దిగా నల్ల నువ్వులు, కుశ గడ్డి లేదా గరిక, గంగా జలం కలిపిన నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని కలిగిస్తుందని, కుటుంబంలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని చెబుతారు.
సులువైన మంత్రజప ఆరాధన..
పిత్ర దోషం వల్ల పదే పదే అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల జీవితంలో సంతోషానికి ఆటంకాలు లేదా అనవసరమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న కుటుంబాలు పిత్ర దోషాన్ని తగ్గించడానికి "ఓం పిత్రిదేవాయ నమః " అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. ఆ తప్పులను పూర్వీకులు లేదా పితృ దేవతలు క్షమిస్తారు. అలాగే వారి ఆశీర్వాదాన్ని అందిస్తారు.
పితృ సూక్తం..
కార్తీక అమావాస్య రోజు పితృ దోషాల నుండి బయట పడటానికి, పితృదేవతలు తృప్తి చెందడానికి పితృసూక్తం పఠించాలి. దీన్ని పఠించడం వల్ల పితృదేవతలు సంతోషించి కుటుంబాన్ని, వంశాన్ని కష్టాల నుండి గట్టెక్కిస్తారు.
దానధర్మాలు..
అమావాస్య రోజు కేవలం తర్పణం వదిలి, పితృసూక్తం వంటివి పఠించడమే కాకుండా.. పేదలకు, అవసరమైన వారికి, నిస్సహాయులకు వస్త్రాలు, ఆహారం, నీరు వంటివి దానం చేయాలి. ఇది పితృ దేవతలను తృప్తి పరిచే మంచి మార్గం.
*రూపశ్రీ.