Read more!

ఏకాగ్రత కోసం మనిషికున్న దారులేవి?

 

ఏకాగ్రత కోసం మనిషికున్న దారులేవి?

ప్రస్థుత కాలంలో మనిషిని వేధిస్తున్న సమస్య ఏకాగ్రత లేకపోవడం. ఎంత ప్రయత్నం చేసినా ఏకాగ్రత కుదరడం లేదనన్నది పలువురి ఫిర్యాదు కూడా. అయితే ఏకాగ్రత అనేది నిజంగా మనిషికి అందకుండా ఉండేంత అసాధ్యమైనదా?? అంత కష్టమైనదా??  కొన్ని విషయాలు పరిశీలిస్తే….

గాలిలో కొన్ని వందల మైళ్ళ ఎత్తున ఎగురుతున్న పక్షికి, నీటి అడుగున ఉన్న తన ఆహారమైన చేప కదలికలు కనిపిస్తాయి. ఆ చేప నీటి పైకి రావటం తెలుస్తుంది. వెంటనే అంత ఎత్తు నుంచి కిందికి దూకి, నీటి పైపొరకు చేరిన చేపను ముక్కున కరుచుకొని పోతుంది. ఆ ఏకాగ్రత దానికి స్వతహాగా వస్తుంది. అందుకే అంత ఎత్తు నుంచి తన ఆహారాన్ని గమనించగలగటమే కాదు. దాన్ని పట్టుకొనే సమయాన్ని సైతం సెకన్లతో సహా కచ్చితంగా అంచనా వేయగలుగుతుంది.

లేడిని వేటాడే చిరుత ఏకాగ్రత కూడా అటువంటిదే. నిశ్శబ్దంగా లేడిని చేరుతుంది. దాడి చేసే సమయం వరకు నిశ్శబ్ధంగా ఎదురు చూస్తుంది. ఒక్కసారిగా పరిగెడుతుంది, వెంటపడుతుంది. దాని వేటు నుండి పరుగెత్తి తప్పించుకునే లేడి ఏకాగ్రత కూడా అసమానం. అంత వేగంలో అది అడ్డంకులను గ్రహిస్తుంది. వాటిని దాటి దూకుతుంది. అయినా వెనుక నుండి వస్తున్న చిరుతపై నుంచి దృష్టి చెదరనివ్వరు. గమనిస్తే, ప్రతి జంతువూ ఏ పనిలో ఉన్నా ప్రమాదంపై ఓ కన్నేసి ఉంచుతుంది. అందుకే ప్రశాంతంగా మేత మేస్తున్న లేళ్ళు, క్షణంలో గాలి వేగంతో పరుగెత్తగలవు. వాటికి శక్తి ఏకాగ్రత వల్ల లభిస్తుంది. ఈ ఏకాగ్రత వాటికి స్వతహాగా వచ్చింది.

మనిషిలో కూడా ఇదే ఏకాగ్రత ఉంటుంది. ఆ ఏకాగ్రత మనిషికి కూడా గొప్ప శక్తిని ఇస్తుంది. కానీ మనిషి ఏకాగ్రత కోసం కష్టపడాలి. నలువైపుల నుంచి చుట్టుకున్న ఆరాటాలను, ఆత్రుతలను, ఆకర్షణలను తట్టుకోగలగాలి. తన మెదడు నుండి వాటిని తరమగలగాలి. ఇది చేయగలిగినపుడు మనిషి ఆ జంతువులను మించిన అసమానమైన శక్తిని తనలోనే కనుగొంటాడు. కానీ ఇటువంటి ఏకాగ్రత కుదరాలంటే సాధన అవసరం. తన ఇష్టం వచ్చిన దానిపై దృష్టి కేంద్రీకరించటం అలవాటు చేసుకోవాలంటే, ముందుగా తన దృష్టిని ఆకర్షించేవాటిని గ్రహించాలి. 

కొందరిని సంగీతం సర్వం మరిపింపచేస్తుంది. మరి కొందరికి పాటలు పాడటమంటే ఇష్టం.  కొందరు అందమైన చిత్రాలను చూసి సర్వం మరిచిపోతారు. ఇంకొందరు ప్రకృతిని చూసి పరవశించిపోతారు. ముందుగా వ్యక్తి, తనదృష్టి ఆకర్షించి, దాన్ని బంధించి ఉంచే అంశాన్ని గ్రహించాలి. ఆపై, తన దృష్టిని ఆ అంశంపై నిలిపి ఏకాగ్రత సాధన చేయాలి.

ఏకాగ్రత సాధన కోసం కొన్ని సాంప్రదాయక పద్ధతులున్నాయి. చీకటి గదిలో దీపం వెలిగించి, ఆ దీపం వైపు చూస్తూ కూచోవాలంటారు. అలా కూర్చున్నప్పుడు, మదిలో మెదిలే ఆలోచనలన్నింటినీ ఒకటొకటిగా దూరం చేస్తూ పోవాలంటారు. ఏకాగ్రత కావాలంటే, వ్యక్తి నాసికాగ్రభాగంపై దృష్టి నిలపాలంటారు. కనుబొమ్మల నడి భాగంపై దృష్టి కేంద్రీకరించాలంటారు. కళ్ళు మూసుకొని జపం చేయాలంటారు. మనసుకు వచ్చిన అంశాన్ని ఊహిస్తూ, కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చుంటే, దృష్టి దాని పైన కేంద్రీకృత మౌతుందంటారు. ఇలా ఏకాగ్రత కోసం మనిషి ఆరాటం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం. ఏకాగ్రత అనేది అసాధ్యమైనదేమి కాదు.

                                        ◆నిశ్శబ్ద.