Read more!

తనకేం కావాలో తెలుసుకుంటే ఏమి జరుగుతుంది?

 

తనకేం కావాలో తెలుసుకుంటే ఏమి జరుగుతుంది?

మానవస్వభావంలోనే అనుకరణ అన్నది ఉంది. పిల్లవాడు పెద్దలను అనుకరిస్తాడు. ఎదుగుతున్నకొద్దీ తనదైన పద్ధతిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇతరులు అతడిని అనుకరిస్తారు. కాబట్టి 'సచిన్'లానే అందరూ ఆడాలనుకోవటం కుదరని పని. ఆడిన ప్రతివారూ సచిన్ అవ్వాలనుకోవటం కూడని పని. ఒక వ్యక్తి చీకటి గదిలో కూర్చుని ఓంకారం వైపు చూస్తూ ఏకాగ్రత సాధించాడని, ప్రతి ఒక్కరూ అలాగే ఏకాగ్రత సాధించాలనుకోవటం, సాధించగలమని అనుకోవటం వెర్రితనం అవుతుంది.

ప్రతి వ్యక్తీ, ఏ విషయం తన మనస్సుకు నచ్చుతోందో, ఏ విషయం పై ఏకాగ్రత కుదురుతోందో గ్రహించాలి. మనం ప్రస్తావించుకునే అంశాలన్నీ వ్యక్తి తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. తద్వారా తన స్వభావాన్ని, తన పరిమితులను, తన శక్తిని వ్యక్తి గ్రహించగలుగుతాడు. అలా గ్రహించిన వ్యక్తి తనకు నచ్చిన అంశం, ఆసక్తి కల అంశంపై దృష్టిని కేంద్రీకరించాలి.  అప్పుడే ఏకాగ్రత అలవడటం సులభమౌతుంది.

పిల్లలకు మనం పురాణకథలు చెప్తాం. అందరూ కథలు ఆసక్తిగా వింటారు. కానీ తరచి చూస్తే మనం అందరినీ కూచోబెట్టి, ఒకే రకంగా కథలు చెప్పినా, అన్ని కథలూ అందరి పిల్లల మనస్సుకూ పట్టవు... కొందరికి రాముడి కథ నచ్చితే, మరి కొందరి మనస్సులలో కృష్ణుడి అల్లరి మిగిలిపోతుంది. ఇంకొందరికి అర్జునుడు నచ్చితే, మరి కొందరికి ప్రహ్లాదుడు నచ్చుతాడు. ప్రతి వ్యక్తిలో అతనికే ప్రత్యేకమైన సంస్కార బీజం ఉంటుంది. ఆ సంస్కారం వల్ల అతడు అన్ని విషయాలకూ స్పందించినా, కొన్ని విషయాలకు మాత్రం ప్రత్యేకంగా స్పందిస్తాడు. ఏ విషయాలు అతడిలో ప్రత్యేకస్పందనను కలిగిస్తున్నాయో గుర్తించటం, దానిపై దృష్టి కేంద్రీకరించటం ఏకాగ్రత సాధనకు మొదటి మెట్టు.

కానీ, ప్రస్తుతసమాజంలో ఎవరికీ అంత ఓపిక, తీరిక, ఆలోచన ఉండటం లేదు. పిల్లవాడి ఆసక్తిని గమనించి అతని శక్తిని ఆ దిశలో మళ్లించే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. తమ అభిప్రాయాలు, నిర్ణయాలు పిల్లలపై రుద్దటం జరుగుతోంది. దాంతో స్వతహాగా ఉన్న తెలివి వల్ల జీవితంలో ఓ స్థాయి సాధించినా, అంతర్గతంగా తనకే తెలియని అశాంతికి గురవుతున్నాడు వ్యక్తి. ఏ విషయం పైనా దృష్టిని నిలపలేక, సాధిస్తున్నదాని వల్ల సంతృప్తి పొందలేక సతమతమవుతున్నాడు. మాదకద్రవ్యాల వాడకం, మత్తు మందులకు బానిసలవటం, దొంగ ఆధ్యాత్మికగురువులకు లొంగిపోవటం వంటి వికృతులన్నీ ఈ అశాంతి ఫలితాలే.

అయితే కొన్ని సందర్భాలలో, కొందరు కొన్నాళ్ళకు తమ అసలు వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. అటువంటివారు విజేతలుగా నిలచి మార్గదర్శకులవుతారు. వివేకానందుడుగా ఎదగక ముందు నరేంద్రునికి తనకేం కావాలో తెలియదు. కానీ ఒక్కసారి తన ఆధ్యాత్మిక దృష్టిని గ్రహించి, సర్వశక్తులనూ ఆ వైపు కేంద్రీకృతం చేయటంతో, ఆయన సమస్తహిందూ సమాజాన్నీ జాగృతం చేయగల శక్తిగా రూపాంతరం చెందాడు.

అరబిందో జీవితం గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టమౌతోంది. తండ్రి కోరిక మేరకు పై చదువులకు ఇంగ్లాండ్ వెళ్లాడు. తనకా చదువులపై ఆసక్తి లేదని గ్రహించి స్వచ్ఛందంగా పరీక్షలో ఫెయిలై తిరిగి వచ్చాడు. కొన్నాళ్ళు రాజాస్థానాల్లో ఉద్యోగాలు చేశాడు. విప్లవకారుడయ్యాడు. కానీ ఎక్కడా ఆయనకు శాంతి లభించలేదు. తనని తాను తెలుసుకున్న మరు క్షణం ఆయన 'అరవింద యోగి' అయ్యాడు.

ఇంకా విభిన్నవ్యక్తిత్వాల వైపు దృష్టిసారిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు మనకు తెలుస్తాయి. వాటిలో కొన్ని మనల్ని ఆకర్షిస్తాయి తప్పకుండా…

                                       ◆నిశ్శబ్ద.