Read more!

గొప్ప నీతిని తెలిపే రెండు రాళ్ళ కథ!

 

గొప్ప నీతిని తెలిపే రెండు రాళ్ళ కథ!

దేవాలయంలోకి వెళ్ళిన ఓ మనిషి దేవుడి విగ్రహం ముందు నిలుచుకుని ఉండగా  అతడికి అక్కడి నిశ్శబ్ద వాతావరణంలో హఠాత్తుగా రెండు సన్నని గొంతులు వినిపించాయి. విగ్రహం ముందున ఉండే చోటులోని రాయి విగ్రహంతో మాట్లాడుతోంది. దాన్ని ఆ వ్యక్తి ఆసక్తిగా వినసాగాడు. రాయి ఆ విగ్రహాన్ని ఇలా అడిగింది, "ఈ వచ్చే భక్తులందరూ నీకు ఆభరణాలు వేస్తుంటారు. మంచి వలువలు కట్టిస్తుంటారు, పూజిస్తుంటారు. కానీ నన్ను మాత్రం నిర్దాక్షిణ్యంగా తొక్కి పోతుంటారు. నా మీద వీళ్లకు ఏ రకమైన మర్యాద లేదు.  సరికదా, పై పెచ్చు కాలి ధూళిని దులుపుతూ పోతారు, నువ్వూ రాయివే, నేనూ రాయినే మనిద్దరి మధ్యా ఈ తేడా ఏమిటంటావ్?” అని అడిగింది.

అప్పుడు ఆ విగ్రహం నెమ్మదిగా ఇలా సమాధానం చెప్పింది. "నన్ను గౌరవించినట్లే నిన్నూ గౌరవించి వుండేవారు. కానీ నువ్వు మరచిపోయావేమో… ఒకప్పుడు నీకు కలిగిన సదావకాశాన్ని నువు జారవిడుచుకున్నావ్. నన్ను మలచిన శిల్పి ఒక రోజున ఒక పెద్దబండ తెప్పించాడు. బండ మరీ పెద్దదిగా కనిపించేసరికి దానిని రెండుగా పగులగొట్టించాడు. అందులో నేనోభాగాన్ని, నువ్వు ఆ రెండో భాగానివి. ఆ శిల్పి తన పనిని నిజానికి నీ మీదే ప్రారంభించాడు. కానీ అతడు తన ఉలి నీపై ఉంచి సుత్తితో ఒక్కటి కొట్టాడో లేదో, నువు ఒక్కసారిగా అబ్బా, నొప్పి నన్ను ముట్టుకోకు. నన్ను బాధించేందుకు నీకేమి హక్కుంది?" అన్నావు.

నీకేదో దయ్యం పట్టి వుంటుందని భావించి ఆ శిల్పి నీ జోలికి రావడం మానేసి, నామీద పని ప్రారంభించాడు. ఇతడు కొట్టే దెబ్బలకు నాకు బాధ కలిగినా అందులో  ఏదో ప్రయోజనముండి వుంటుందని నేను అలగకుండా ఓర్చుకున్నాను. అలా మెల్లగా ఓర్చుకుంటూ అతడేమి చేస్తున్నాడా అని గమనిస్తూ వుండగా, అతడు కొద్ది కొద్దిగా నాలోని అనవసర భాగాలన్నీ నేర్పుగా చెక్కిపారేశాడు. అతడు చేసిన ప్రత్యేక సృష్టి అంటూ ఏమీలేదు. ఆ బండరాతిలో విగ్రహ స్వరూపం మొదట్నించీ వుండేవుంది. అతడు చేసినదల్లా అనవసరమైన భాగాలు చెక్కివేయడమే. అప్పుడు నా స్వరూపం బయట పడింది.  అందుచేతనే నువ్వు అక్కడ, నేను ఇక్కడ ఉన్నాము" అన్నది ఆ విగ్రహం.

 బాధ, కష్టాలు, దుఃఖాలు మన జీవితాల్లో ఎందుకు తటస్థిస్తాయో అర్థం చేసుకోవాలి. అంటూ పై కథ చెప్పాడు స్వామి సచ్చిదానంద. శస్త్రచికిత్స బాధతో కూడుకున్నప్పటికీ అది మన శ్రేయస్సుకే ఉద్దేశింపబడింది. నెలలు నిండిన ఆడమనిషి ప్రసవవేదనను సహిస్తున్నదంటే, జన్మించబోయే ఆ శిశువును, దాని అందాన్ని తలుచుకొని మురిసి పోతున్నందువల్లనే సహించగలుగుతున్నది. ఈ విషయం అన్ధశ్రీకీ తెలిసిందే….. 

మహాత్ములందరూ బాధ అనే ముడి సరుకుని వినియోగించుకొని అద్భుతమైన, ఆనందమయమైన దేనినో కనుగొన్నట్లు మనందరికీ స్పురిస్తూనే వుంటుంది. మహాత్ములకూ మనకూ ఉన్న తేడా అల్లా వారికి వున్న పూనిక మనకు లేకుండా పోవడమే. 

                                         ◆నిశ్శబ్ద.