నిజమైన గురువు కథనం!

 

నిజమైన గురువు కథనం!

యోగులు, మనులు భూమిపై తనువు చాలించవలసిన తరుణమాసన్నం అయినప్పుడు, శుభకార్యాలకు అన్నీ ఆయత్తం చేసుకున్నట్టే ఈ సందర్భానికి కూడా అన్నీ సిద్ధం చేసుకుని, నిశ్చల మనస్కులై మరణాన్ని ప్రతీక్షిస్తూ ఉంటారని అంటారు. అయితే ఈనాడు ఇలాంటి వారు ఎందరున్నారు?? ఎక్కడ ఉన్నారనేది మనకు తెలియదు. నేటి కాలంలో కొందరు బలహీన మనస్కులు పరిస్థితుల ఒత్తిడిని ధైర్యముగా ఎదుర్కోలేక ఏదో ఒక పద్ధతిని అవలంబించి తమ ప్రాణాన్ని తాము బలవంతంగా తీసుకుంటున్నారు.

ఇలా బీభత్సంగా మరణించే అవగుణానికీ, భూమి మీద తన కర్తవ్యం తీరిపోవడం చేత మరణాన్ని ఒక శుభ పరిణామంగా ఎంచి ప్రశాంత చిత్తంతో ఆ మహా ధర్మప్రభువైన కాలయముని పిలుపుకై ఎదురుచూచే ఉత్తమగుణానికి అసలు ఎలాంటి పోలిక లేదు. ఉత్కృష్టమైన ఇలాంటి మరణానికి ఉండే అందమే వేరు.

దీనికి ఒక ఉదాహరణ కథనం ఉంది…

ఆరవ నైజామ్ ప్రభువైన మహబూబ్ ఆలీ పాషా రాజ్యానికి రాకముందు ఆరున్నర శతాబ్దాల క్రితం, అనగా పదమూడవ శతాబ్దంలో, బాబా షరీఫుద్దీన్ అనే ముస్లిం యోగి హైదరాబాదు దాపులోని ఒక కొండవద్ద నివసించేవాడట. ఆ పుణ్యాత్ముడి చరిత్రను తెలుసుకున్న మహబూబ్కు అతడి మీద అమిత శ్రద్ధా భక్తులుండేవి. ఆ పుణ్యపురుషుడి సమాధి చెంతనే తానొక చిన్న ఆశ్రమం నిర్మించుకొని, పాషా అడపాదడపా అక్కడ నివసిస్తూ, ఉపవసిస్తూ భగవదారాధన చేస్తుండేవాడు.

బాబా షరీఫుద్దీన్ ఢిల్లీలోని ప్రసిద్ధ యోగి క్వాజా నిజాముద్దీన్ శిష్యుడు. షరీఫుద్దీన్ ఢిల్లీ నగరం నుండి బయలు దేరి అటు తిరిగి, ఇటు తిరిగి చిట్ట చివరకు హైదరాబాదు నగర సమీపంలోని పహాడ్ ఈ-జషరీప్ (పవిత్ర శిఖరం) మీద ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు. వనమూలికలతో మందూ మాకూ తయారు చేయగల్గిన విద్య తెలిసి ఉండటం మూలాన ప్రజలకు ఆధ్యాత్మిక విద్య బోధించుటయే కాకుండా, దేహ సంబంధమైన వ్యాధులకు కూడా చికిత్స చేస్తుండేవాడు. ప్రజల బాగోగులు కనుక్కుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండిన కారణం చేత వారంతా అతణ్ణి తమ గురువుగానే కాకుండా తమ ఆప్తబంధువుగా కూడా భావించి ఆదరిస్తుండేవారు. 

కొంత కాలానికి షరీఫుద్దీన్ బాగా వృద్ధుడై పోయాడు. ఒకనాడు అతడు కొండక్రింద ఉన్న పల్లెలోకి వెళ్లి అక్కడి ప్రజలను తనకు కొంత సహాయం చేయమని అడిగాడు. కొండపైన ఒక శవమున్నదనీ, దానిని పూడ్చి పెట్టవలసి వుందనీ, వాళ్ళతో చెప్పాడు. బాబాకు తామింత సహాయం చేయగలిగిన అవకాశం లభించినందుకు ఆ ప్రజలు ఎంతో సంతోషించి, బాబా వెనకాలగా గౌరవంతో కొంచెం ఎడంగా నడుస్తూ కొండ ఎక్కసాగారు. తీరా కొండ మీదికి వెళ్లేసరికి బాబా షరీఫుద్దీన్ ఎక్కడా కనిపించలేదు. అటూ ఇటూ వెతికారు. కానీ బాబా అదృశ్యమైనట్లు కనిపించింది. అతడు పూడ్చి పెట్టవలసి వుంటుందని చెప్పిన శవం మాత్రం అటొకపక్కన కనిపించింది. నేల మీద పరుండి వున్న ఆ శవం ముఖం మీద ఒక చేతి రుమాలు కప్పి వుంది. ఆ శవాన్ని పూడ్చి పెట్టే ప్రయత్నంలో ముఖం మీది ఆ చేతి రుమాలు తొలగిపోయింది. అప్పుడు తెలిసింది అక్కడి ప్రజలకి ఆ శవం బాబా షరీఫుద్దీన్ దే అని. ఇదీ నిజమైన ఓ గురువు కథనం.

                                ◆నిశ్శబ్ద.