Read more!

మనసు గురించి జిడ్దుకృష్ణమూర్తి వాఖ్యలేమిటి?

 

మనసు గురించి జిడ్దుకృష్ణమూర్తి వాఖ్యలేమిటి?

మనిషి జీవితంలో మనసు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి మనసు గురించి జిడ్డు కృష్ణమూర్తి ఇలా చెబుతాడు…

మనసును ఖండన, సమర్థనలతో మొద్దుబారేట్లు చేసుకుంటున్నాం. మనసు చురుకయిన సూదిలా పదునుగావుంటే, వజ్రంలా బలంగా వుంటే, దానిలో ఎంత లోతుకయినా పోవచ్చును. కులాసాగా కూర్చుని 'అటువంటి మనసు ఎలా వస్తుంది?' అని ప్రశ్న వేసుకున్నందువల్ల ప్రయోజనం లేదు. తరువాతి భోజనం ఎక్కడ దొరుకుతుందో అన్నంత ఆసక్తిగా మీరు అటువంటి మనసును వాంఛించాలి. అసలు మనసు ఎందుకు మొద్దుబారి పోతుందో తెలుసుకోవాలి. ఒక కవచంలా తన చుట్టూ గోడలు కట్టుకోవడం వల్ల ఈ మూర్ఖత్వం. సమర్ధనా ఖండనల్లో ఇదీ ఒక భాగం. మనసుకు ఇవి వదలిపోతే సమస్య అంతటినీ చక్కగా పూర్తి ఎరుకతో చూడగల స్థితికి వస్తుంది. 

'సరే, అసలు విషయానికి వద్దాం. మనలో హింసను తుడిచి పెట్టివేయడానికి వీలున్నదా? 'మీరు యేమీ మారలేదు. ఎందుకని?' అని అడగడం ఒక రకమయిన దౌర్జన్యం. నేనాపని చేయడం లేదు. మిమ్మల్ని ఏ విషయంలో అయినా ఒప్పించడం నాకు సమ్మతం కాదు. ఇది మీ జీవితం, నాది కాదు గదా! మీరు ఎలా జీవిస్తారు? అనేది పూర్తిగా ఏవీశ్రీది వారికి  సంబందించిన విషయం. ఇక్కడ  అడుగుతున్న ప్రశ్న అలా ఏ సంఘంలోనయినా మానసిక స్థాయిలో నివసిస్తూ మనిషి తన అంతరంగం నుంచి దౌర్జన్యాన్ని పరిపూర్ణంగా తుడిచివేయడం సాధ్యమవుతుందా?? సాధ్యం అవుతుంది అంటే ఈ ప్రపంచంలో యింకొక రకంగా జీవించటానికి తగిన  ప్రక్రియ ఉత్పన్నం అవుతుంది.

మనలో చాలమందిమి దౌర్జన్యాన్ని జీవితంలో ఒక భాగంగా అంగీకరించాము. రెండు మహా ప్రపంచ యుద్ధాలు గడిచాయి. కాని ఇవి మనకు మన మధ్య మనుషుల మధ్య, ఇద్దరు మనుషులు మధ్య  బలమయిన అడ్డుగోడలు నిర్మించుకోవడం తప్ప ఇంకేమీ నేర్పలేదు. దౌర్జన్యాన్ని సమూలంగా తుడిచివేసుకోవాలనుకుంటున్న మనకు అది ఎలా సాధ్యమో తెలియాలి. విశ్లేషణలద్వారా మనమో లేక ఇంకా విజ్ఞులయిన పండితులో చేసే వ్యాఖ్యానాల ద్వారా అది సాధ్యం అనిపించదు. 

మనను మనం కొంతలో కొంత మార్చుకుందుకు ప్రయత్నించవచ్చు. కాస్తంత ప్రశాంతంగా, మరికాస్త ఆప్యాయతతో బతకడం నేర్చుకోవచ్చు, అంతమాత్రంచేత పూర్తి అవగాహన ఏర్పడదు. పరిశీలన, విశ్లేషణ చేయడం ఎలానో నాకు తెలియాలి. ఈ విశ్లేషణ క్రమంలోనే నా మనసు మరింత పదునుగా చురుకుగా తయారవుతుంది. ఆ పదునుతనంలో జాగరూకత, గాంభీర్యం వచ్చి పూర్తి గ్రాహ్యత కలుగుతుంది. అంతటినీ ఒక్క క్షణంలోనే చూడగల సామర్థ్యం వున్న కళ్లు మనకు లేవు.. వివరాలన్నిటినీ చక్కగా చూడగలిగి తదుపరి దుముక గలిగితే . అప్పుడు స్పష్టంగా చూడగలుగుతాము.

దౌర్జన్యాన్ని తొలగద్రోసుకుందుకుగాను, మనలో చాలమందిమి, ఒక ప్రతిపాదనను, ఆదర్శాన్ని వాసుడుతున్నాం. అదేమిటంటే... అహింస అనే దానిని వాడుతున్నాం. దౌర్జన్యానికి వ్యతిరేక లక్షణమయిన ఆదర్శం వున్నప్పుడు ఆ దౌర్జన్యం ఆ వాస్తవం సమసి  పోతుందనుకుంటున్నాం. కాని అది జరగడం లేదు. మనకు అసంఖ్యాక ఆదర్శాలు వున్నాయి. మన పవిత్ర గ్రంథాలన్నీ వాటితో నిండివున్నాయి. అయినా మనం యింకా దౌర్జన్యపూరితులం అయ్యే వున్నాం. అందుచేత నేరుగా దౌర్జన్యంతోనే వ్యవహరించి ఆ మాటలను మరచి పోయెందుకు ఎందుకు తలపడగూడదు?

యదార్ధాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం పూర్తి సావధానాన్ని యివ్వవలసి వుంటుంది. దానికి  శక్తి అంతటినీ ధారపోయవలసి వుంటుంది. కాల్పనికమైన ఆదర్శాలతో నిండిన ప్రపంచాన్ని రూపుకట్టుకున్నప్పుడు ఆ సావధానత, శక్తి అంతరించి పోతాయి. కనుక మీరు పూర్తిగా ఆదర్శాన్ని త్రోసిరాజు అనగలరా? నిజంగా తీవ్రమయిన అసక్తి వున్న మనిషి, సత్యం యేమిటో తెలుసుకోవాలన్న తపన వున్న మనిషి, ప్రేమ యేమిటో అవగతం చేసుకోవాలనుకున్నవాడు అభిప్రాయాలు, సిద్ధాంతాల జోలికి పోడు. ఉన్నదానిలోనే జీవిస్తాడు.

                                   ◆నిశ్శబ్ద.