Read more!

భారతీయ జీవనవిధానం పిల్లలకు ఎలా మార్గదర్శకం అవుతుంది?

 

భారతీయ జీవనవిధానం పిల్లలకు ఎలా మార్గదర్శకం అవుతుంది?

భారతీయ జీవనవిధానంలో వ్యక్తి ఎదుగుదల శిశువు గర్భంలో పిండరూపంలో ఉన్నప్పటి నుంచీ ప్రారంభమౌతుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆనందంగా ఉండాలి. సంతోషాన్ని అనుభవించాలి. ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. ఆమె అన్నీ మంచి మాటలే వినాలి. మంచి వాతావరణంలో ఉండాలి. మంచి ఆలోచనలు చేయాలి అని నిర్దేశించారు. ఈ అంశం సరిగ్గా అర్థమయ్యేందుకు పురాణాలలో రెండు కథలున్నాయి. ఒకటి రాక్షసుడి పుత్రుడైనా, గర్భంలో ఉన్నప్పుడే విష్ణుకథలు వింటూ జన్మించి విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి కథ. మరొకటి గర్భంలో పద్మవ్యూహ ఛేదనరహస్యాన్ని గ్రహించి జన్మించిన అభిమన్యుడి వృత్తాంతం. ఈ రెండు కథల్లో ఒక సూక్ష్మమైన తేడా ఉంది. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు రాక్షసుడైనా చిరంజీవి అయి సక్రమపాలనతో ధర్మాన్ని నిర్వర్తించి ఆదర్శప్రాయుడయ్యాడు. 

అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు, యుద్ధవిశేషాలు వినటంతో చిన్న వయసులోనే యుద్ధంలో మరణించాడు. శిశువు వ్యక్తిత్వ వికాసమే కాదు, భవిష్యనిర్దేశం కూడా గర్భస్థదశ నుంచే ఆరంభమవుతుంది. ఇది గ్రహించి శిశువు ఆరోగ్యకరంగా ఈ లోకంలో అడుగిడేందుకు సరైన మార్గం సూచించారు మన పూర్వికులు. ఇక జన్మించినప్పటి నుంచీ శిశువు మానసికారోగ్యం సక్రమరీతిలో అభివృద్ధి చెందేందుకు పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించారు.

ఆధునిక మానసికశాస్త్రం ప్రకారం శిశువు జీవితంలో మొదటి సంవత్సరం అత్యంతప్రాధాన్యాన్ని వహిస్తుంది. భవిష్యత్తులో అతడి ఆలోచనను నిర్దేశించే అనేక అంశాలు ఈ వయసులో అతడి మెదడులో నిక్షిప్తమౌతాయి. ఆ తర్వాత అతని జీవితం మొత్తం బాల్యావస్థలో గ్రహించిన విషయాలు నిగ్గు తేల్చుకుని ప్రతిస్పందించటమే ఉంటుంది. తల్లిదండ్రులపై పిల్లవాడి నమ్మకం అతడి ఆత్మవిశ్వాసమౌతుంది. వారి సఖ్యం అతని శాంతి అవుతుంది. వారు నేర్పిన అంశాలపై విశ్వాసం అతడి ఆత్మబలమౌతుంది.

అలా కాక కుటుంబ వాతావరణంలోని, కలతలు, క్రోధాలు, ఆవేశాలు శిశువులో ఆందోళన కలిగిస్తాయి. తెలియని అశాంతిని సృష్టిస్తాయి. అతడిలో అభద్రతాభావాన్ని కలిగించి, భవిష్యత్తులో అతడికి కలిగే అనేక అనర్థాలకు కారణమౌతాయి. ఇది గ్రహించే మన వ్యవస్థలో శిశువు జననం ఓ అద్భుతమైన ఘటనగా నిర్దేశించటం జరిగింది. శిశువు జననం సంబరాలకు దారి తీస్తుంది. బంధువులంతా సంతోషంగా కలిసేందుకు కారణమౌతుంది. ప్రతివారూ శిశువుపై వాత్సల్యం కురిపిస్తారు. ఎత్తుకుని ముద్దాడుతారు, లాలిస్తారు, పాటలు పాడి ఆనందం కలిగిస్తారు. శిశువును ఉయ్యాల్లో ఊపుతూ 'రామా లాలీ' అంటూ గానం చేస్తారు. 

అంటే తన తల్లిదండ్రుల జీవితంలో తానొక 'అద్భుతం’ అన్న భావన శిశువుకు కలుగుతుంది. వారు పాడే పాటల వల్ల సంగీతజ్ఞానం కలుగుతుంది. సాహిత్యంపై మక్కువ కలుగుతుంది. బంధువులలో కలసిమెలసి తిరగటం, ఆడటం అతడికి సామాజికజీవనం నేర్పుతుంది. ఆపై బొమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర వినే పౌరాణికగాథలు అతడికి ఉత్తమాదర్శాలు నేర్పుతాయి. రావణాసురుడిలా చెడు పనులు చేసేవారు విలన్లని, చెడును నిర్జించి మంచిని పెంచే రాముడు 'హీరో' అని అర్థమౌతుంది. ఎవరైనా 'హీరో' కావాలని అనుకుంటారు కానీ విలన్ కావాలని అనుకోరు కదా! అందుకే పసితనంలోనే పిల్లలకు ఉత్తమ వ్యక్తులను పరిచయం చేసి, ఉత్తమాదర్శం నిలపటం జరుగుతుంది. 

కాస్త ఊహరాగానే జానపదగాథలు, మాయలు, మంత్రాల కథలు అతడి ఊహాశక్తికి పదును పెడతాయి. అతనిలో సాహసగుణం పెంచుతాయి. ఇదే సమయంలో తల్లి నేర్పే సుమతీ శతకాలు, వేమన పద్యాలు అతడికి నీతి నియమాలు నేర్పుతాయి. సామాజిక మనస్తత్త్వాన్ని పరిచయం చేస్తాయి. 'ఎప్పుడు సంపద కల్గిన' 'వినదగు నెవ్వరు చెప్పిన', 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' 'వేరుపురుగు చేరి వృక్షంబు చెరచును' వంటి అనేకపద్యాలు అతడికి సమాజంలో మనుషులను గుర్తించటం నేర్పుతాయి. మంచిచెడులపై అవగాహన కలిగిస్తాయి. 

తల్లి దండ్రి, గురువు దైవాలని, వారిని గౌరవించటం వ్యక్తి కర్తవ్యమని బోధిస్తాయి. అంటే శిశువు సామాజికజీవనం ఆరంభమై, అతని వ్యక్తిత్వం ఎదిగే లోపలే శిశువుకు అవసరమైన అనేక అంశాల బోధన జరిగిపోతోంది. పాఠశాల అన్నది 'అఆ'లు నేర్పే కర్మాగారం కాదు. వికసిస్తున్న వ్యక్తిత్వానికి దిశను కల్పించే దేవాలయం అన్న భావన పిల్లల్లో కలుగుతుంది. అంటే తీగకు పాకేందుకు సరైన పందిరి నిర్మాణం పిల్లవాడి మనసు ఎదిగే సమయంలోనే జరుగుతోందన్న మాట. ఇదీ భారతీయ జీవన విధానంలో ఓ పిల్లవాడికి వేసే(వెయ్యాల్సిన) బాట.

                                  ◆నిశ్శబ్ద.