ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడానికి నియమాలున్నాయని తెలుసా!

 

ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడానికి నియమాలున్నాయని తెలుసా!

 హిందూమతంలో శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు అత్యంత దయగలవాడు,  స్వభావరీత్యా అమాయకుడని చెబుతారు. అందుకే ఆయన్ను బోళాశంకరుడు అని అంటారు.  కేవలం ఒక కుండ నీటితో  అబిషేకం చేస్తే చాలు.. ఆయన చాలా పొంగిపోయి భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే చాలా మంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆయనను పూజిస్తారు, మరికొందరు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడం శుభప్రదంగా భావించినప్పటికీ, దానితో పాటు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం, లేకపోతే అది ఇంటి సంతోషం , శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుని పూజలు చేయడానికి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుంటే..

పరిమాణం..

మత విశ్వాసాల ప్రకారం, ఇంట్లో ప్రతిష్ఠించే శివలింగం బొటనవేలు పరిమాణంలో ఉండాలి. అంతకంటే పెద్ద శివలింగాలను పూజించడం సరికాదు, ఎందుకంటే వాటిని పూజించే నియమాలు మరింత కఠినంగా ఉంటాయి.

శివలింగ ప్రతిష్టాపన..

శాస్త్రాల ప్రకారం శివలింగం ఇంట్లో ఉంచుకోవడానికి  ప్రతిష్ఠాపన తప్పనిసరి కాదు. అయితే ప్రతిరోజూ జపం చేయడం, అభిషేకం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజించడం అత్యవసరం. దీనివల్ల శివుని ఆశీస్సులు లభించి, ఇంటికి సంతోషం చేకూరుతుంది.

దిశ..

శివలింగాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ప్రతిష్ఠించాలని చెబుతారు. ఈ దిశను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఇంటికి శ్రేయస్సును చేకూర్చి, ప్రతికూలతను తొలగిస్తుంది.

శివ పరివారం..

మత గ్రంథాల ప్రకారం  ఇంట్లో ఎక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినా, శివునితో పాటు పార్వతీ దేవి, గణేశుడు,  కార్తికేయుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి. దీన్నే శివ పరివారం అని అంటారు.  ఇది ఇంట్లో శాంతి, సంతోషం , కుటుంబ సమతుల్యతను చేకూరుస్తుంది. .

సంఖ్య..

శాస్త్రాల ప్రకారం, ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచడం అశుభం. అందువల్ల, ఒకే శివలింగాన్ని ప్రతిష్ఠించి, క్రమం తప్పకుండా పూజించడం మంచిది.

అభిషేకం..

ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే శివుడి ఆరాదనకు ఎంతో శ్రేష్టమైన మహా మృత్యుంజయ మంత్రం,  పంచాక్షరీ మంత్రాలను జపించడం తప్పనిసరిగా చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

                              *రూపశ్రీ.