Yeluka Vacche Illu Bhadram 12
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం -12
ఇలపావులూరి మురళీ మోహనరావు
“ఎందుకలా నవ్వుతావు?నేనేమైనా జోక్ వేశానా?”
కోపంగా అన్నాడు వెంకట్రావు.
“మిమ్ముల్ని డాక్టర్ దుర్యోధన్ పంపించారా?”
నవ్వుతూనే అన్నాడు ఆటోవాలా.
“అరె!నీకెలా తెలుసు ?”ఆశ్చర్యంగా అడిగాడు
వెంకట్రావు.
“అదంతేలెండి..”అంటూనే రోడ్డు నుంచి కుడివైపుకు తిప్పాడు ఆటోను ఆటోవాలా. “అయ్యయ్యో ఏంటి ఇటు తిప్పావు?యిటు వైపు పెంటకుప్పలు చెత్తా చెదారం ఉంటే... కొంపదీసి మమ్ముల్ని కిడ్నాప్ చేస్తున్నావా ఏంటి?”కంగారుగా అరిచాడు వెంకట్రావు. సినిమాలో విలన్ లా విటకంగా నవ్వాడు ఆటోవాలా.
“మీ ముఖాలు చూస్తుంటే మీరు పాతిక వేలిస్తామన్నా ఎవరూ కిడ్నాప్ చెయ్యరు.మీరు చెప్పిన ఆ సెంటరు ఇటే ఉంది"అంటూ రయ్ మని ఆటోపోనివ్వసాగాడు ఆటోవాలా.
కొంచెం సేపు అలా వెళ్ళిన తరువాత నాలుగైదు పూరిపాకలు కనిపించాయి.ఆటోను ఆపాడు డ్రైవర్.
“ఏంటి ఇక్కడాపావు?ఇక్కడేమైనా కల్లు తాగే ప్రోగ్రాం ఉందా ఏమిటి?”భయపడుతూ అడిగింది సుందరి.
“లేదు మేడమ్.మీరు వెతికే ఆ సెంటర్ అదే"ఓ పాకను చూపిస్తూ చెప్పాడు ఆటోవాలా.
సుందరి,వెంకట్రావు ఆ పాకలోకి వెళ్లారు. లోపల ఒక టేబుల్ మీద పది ప్లాస్టిక్ డబ్బాలు చిన్నవి.ఒక పెద్ద గాజు సీసా,కొన్నిచిన్నగాజు సీసాల్లో రంగు రంగుల ద్రవపదార్థాలు,ఒక పురాతన ఎక్స్ రే మిషన్ ఒక చిన్న కంప్యూటర్ ఉన్నాయి.ఇవాళో రేపో అన్నట్లున్న తొంభై సంవత్సరాల వృద్ధుడు కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు.
“ఇక్కడ డయాగ్నస్టిక్ సెంటర్ ఉందిట!ఎక్కడో మీకు తెలుసా?”వృద్ధుడిని అడిగాడు వెంకట్రావు.
“హి...హి...హి...యస్..ఇదే అది.అయామ్ డాక్టర్ దైవా ధీనం.యమ్మి.బి.యస్.ఇన్ నైన్టీన్ థర్టీ.వాడ్డూ యూ వాంట్?”అడిగాడు దైవాధీనం.
“డాక్టర్.దుర్యోధన్ గారు పంపించారు.నా పేరు వెంకట్రావు"చెప్పాడు వెంకట్రావు.
“ఓ...చిన్నపాపాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని...”గొణిగాడు వృద్ధుడు.
“నో నో...ఇట్స్ రాంగ్..అయినా మికెలా తెలిసింది?”ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.
“డాక్టర్ దుర్యోధన్ ఫోన్ చేశారు.వెరీ నైస్ డాక్టర్.వేరీజ్ ద ప్రిస్క్రిప్షన్ తీసిచ్చాడు.రెండు పేజీలని పరిశీలించాడు దైవాభీనం. “వీటన్నిటికి ఎంతౌతుందండీ ?”అడిగాడు వెంకట్రావు.
“జస్ట్ ఏ మినిట్ "కాలిక్యులేటర్ తీసుకుని లెక్కలు వేయసాగాడు దైవాధీనం.
“అన్నీ కలిపి తొమ్మిది వేల తొంభై రెండు రూపాయలౌతాయి.టెన్ పర్సంట్ డిస్కౌంట్..” దైవాధీనం చెబుతుండగా ఫోన్ మోగింది.
“హలో..దైవాధీనం..డాక్టర్ దైవాధీనం హియర్..”
“హలో..నేను డాక్టర్ దుర్యోధన్ని..”
“యస్...యస్..డాక్టర్...వాటీజ్ ద మాటర్?”
“ఆ పేషంట్లు వచ్చారా?”
“వచ్చారు..”
“సీ డాక్టర్..ఆ వెంకట్రావు గవర్నమెంట్ ఎంప్లాయీ.మంచి లంచగొండి కూడా.వీలైంత వరకు బాగా గుంజండి "చెప్పాడు డాక్టర్.
“ఓకే...ఓకె...నేనా పని మీదనే ఉన్నాను"
“రిపోర్టులు అరగంటలో ఇవ్వాలంటే నాలుగొందలు ఎక్కువౌతుందని చెప్పండి"
“ఓకే..ఓకె..”
“నిజానికి టెస్టులు ఏవీ అవసరం లేదు.ఏదో ప్రెండ్షిప్ కొద్దీ పంపించాను"అన్నాడు డాక్టర్.
“ఐనో..ఐనో...మీ మంచితనం నాకు తెలీదా డాక్టర్?ఎనీ డేంజర్ ?”
“నథింగ్...ఆ పిచ్చి ముండ ఎలుకల మందు నాకిందట.నిజానికి ఆ మందు మొత్తం నోట్లోకుక్కినా ఆ ఎలుకపిల్ల చావదు.ఇక ఈ పిల్ల ఎక్కడ చస్తుంది.అంతా వాళ్ళ కంగారు.కాసిని నీళ్ళు వుక్కలిస్తే ఉమ్మేయిస్తే సరిపోతుంది.ఆపని ఇక్కడ నేను చేస్తాను"చెప్పాడు దురోధ్యన్.
“ఓకె డాక్టర్...”అన్నాడు దైవాధీనం.
“మీరు డిస్కౌంట్లు లాంటివి వాళ్లుకేం ఇవ్వనవసరం లేదు.బాగా వదిలించి నా ఫిప్టీ పెర్సంట్ కమిషన్ మాత్రం మర్చిపోవద్దు.వెంటనే పంపండి ఓకే"అన్నాడు దుర్యోధన్.
“అది మీరు వేరే చెప్పాలా డాక్టర్...పేషెంట్ కే ఇచ్చి పంపించనా ?”
“వద్దొద్దు.సాయంత్రం మా కాంపౌండరును పంపుతా"అన్నాడు డాక్టర్ దుర్యోధన్.
“ఓ..యస్..”
“ఉంటాను..” ఫోన్ పెట్టాడు దైవాధీనం.
“చూశారా...డాక్టర్ దుర్యోధన్ ఎంత మంచివాడో.చాలా కేర్ పుల్ గా టెస్టులు చెయ్యమని చెబుతున్నాడు.పేషెంటంటే పంచప్రాణాలు "చెప్పాడు డాక్టర్ దైవాధీనం.
“ఏదో డేంజర్ అంటున్నారు "అడిగింది సుందరి.
“రిపోర్టుల ఆధారంగా మధ్యాహ్ననికి ట్రీట్ మెంట్ మొదలు పెట్టక పొతే ప్రాణాలకు ప్రమాదం అనీ.అందువల్లన నాలుగొందలు ఎక్కువైనా సరే అరగంటకల్లా రిపోర్టులు పంపమంటాడు" చెప్పాడు దైవాధీనం.
“ఇందాకేదో డిస్కౌంట్ అన్నారు..?” అడిగాడు వెంకట్రావు.
“యస్..యస్...డిస్కౌంట్ పోగా తొమ్మిది వేల తొంభై రెండు రూపాయలన్నారు.లెటజ్ స్టార్ట్ " అంటూ సిరంజితో రక్తం తీసుకున్నాడు దైవాధీనం.
“ఈ చివర్లో మరో టేస్టేదో రాశారు డాక్టరుగారు.ఇదేంటండీ..”అడిగాడు వెంకట్రావు.
పగలబడి నవ్వాడు దైవాధీనం.
“ఎందుకు నవ్వుతున్నారు ?”అర్థంకాక అడిగాడు వెంకట్రావు.
“మరేం చెయ్యమంటారు ?అది టెస్టు కాదు.డాక్టర్ సంతకం !”నవ్వుతూనే చెప్పాడు దైవాధీనం.
సుందరి,వెంకట్రావులకు కూడా అంత విషాదంలోనూ నవ్వు వచ్చింది.
(ఇంకా వుంది)
(హాసం సౌజన్యంతో)