Yeluka Vacche Illu Bhadram 59

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 59

ఇలపావులూరి మురళీమోహనరావు

"నేను చెప్పేది ఆ ముక్కల సంగతి కాదండీ...నా ఉద్దేశ్యంలో ఒక్క చిన్నమాట అని అర్థం" అన్నాడు.

"చెప్పండి అన్నాడు వక్రతుండం.

"వెంకట్రావు గారికి మీరేమౌతారు?"

"ఏమౌతానా? సాక్షాత్తు మామగారిని"

"అలాగా...మీ అల్లుడుగారు ఇల్లమ్మే ప్రపోజల్ ఏదో పెడుతున్నారని తెలిసింది. దేనికండీ"?

"ఏం చేస్తాం? అంతా ప్రారబ్దం. ఇంటినిండా పుట్టెడు వాస్తులోపాలు. నానా ఇబ్బందులు పడుతున్నాడు. మనిషికి బోలెడంత అభిమానం. సాక్షాత్తు సుయోధనుడే. మామయ్యగారూ....ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను. కొంచెం దగ్గరుండి అమ్మిపెట్టండీ అని పిలిపించాడు. అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను. అల్లుడూ కావాలంటో నేనో పదిలక్షలు ఇస్తాను. ఇల్లు బాగుచేయించుకోవయ్యా అని. వింటేగా. ఏదీ ఒక సిండికేట్ వేద్దామా?" ముక్కలు కలిపాడు వక్రతుండం.

"లేదండీ...నాకలవాటు లేదు. ఎన్నాళ్ళ నుంచో సొంతిల్లు ఏర్పరచుకోవాలని కోరిక. ఒకవేళ ఇల్లు అమ్మేట్లయితే.." గొణిగాడు ఆనందరావు.

"మీకు వాస్తుల మీద నమ్మకం లేదా? మనం ఆడుకుంటూ మాట్లాడుకోగూడదూ"

"ఇదివరకోసారి ఈ వ్యవహారంలో సొంతిల్లు అమ్ముకున్నానండీ..జన్మలో ముక్కపట్టుకోగూడదని మా అమ్మగారి మీద ప్రమాణం చేశాను. ఇంతకూ మీ అల్లుడుగారిల్లు..ఇక వాస్తుదేముంది? ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది."

"హి..హి...హి అదీ నిజమేననుకోండి. మీ అమ్మగారేరీ కనిపించరేం?"

"ఆమె కనిపించరండీ"

"అదేం పాపం? వృద్ధాశ్రమంలో చేర్చారా? లేక తప్పిపోయారా?"

"అదేం కాదండీ.. చచ్చిపోయారు."

"అయితే ఇంకేం! మీ ఒట్టు కూడా చచ్చిపోయినట్లే. రండి ముక్కలు పంచుకుని మాట్లాడుకుందాం. పాయింటుకు పది రూపాయలే!" "అంటే కౌంటుకు వెయ్యిరూపాయలు ! నా వల్లకాడు. పాయింటుకు అరపైసా పెట్టుకుందాం."

"అరపైసానా? ఛీ..ఛ..అంటే ఫుల్ కౌంటుకు అర్ధరూపాయా! ఈ జన్మంతా అవిశ్రాంతిగా ఆడినా ఎవరికీ రూపాయి రాదు. కనీసం కాలక్షేపం కోసం ఆడినా రూపాయి పెట్టుకుందాం."

"మరి ఇల్లు..."

"డోన్ట్ వర్రీ..ఇల్లు మీకే ఇప్పిస్తా..సరేనా... ఇక పదండి ఆగలేను" చాపమీద కూర్చున్నాడు వక్రతుండం. మధ్యాహ్నం దాకా ఆడారు. వక్రతుండం ఒక్క ఆటకూడా గెలవలేదు. ఐదువేల రూపాయలు ఓడిపోయాడు.

"ఇక మీరు డబ్బులిస్తే ఆట కంటిన్యూచేద్దాం. నేను గాథలో కూడా ఇలా గెలిచుంటే ఇంటి మీద మరో అంతస్తు వేసుండే వాడిని. చూస్తుంటే నాకు శుక్ర మహర్దశ వచ్చినట్లు కనిపిస్తున్నది" ఉత్సాహంగా అన్నాడు ఆనందరావు.

"డబ్బుదేముందండీ వెదవడబ్బు. ఇంతకూ మీకు ఇల్లు చవగ్గా కావాలి. అంతే కదా!" ముక్కలను డబ్బాలో పెడుతూ అన్నాడు వక్రతుండం.

"అంతేనండీ...జేబులో చిల్లర కూడా లేదు. మీరా డబ్బిస్తే అలా రైతు బజారు కెళ్ళి కూరలు తెచ్చుకుంటాను."

"మా ఊరు వెళ్ళగానే డిమాండ్ డ్రాఫ్ట్ పంపుతాను."

"అంటే డబ్బుల్లెకుండా ఆడారా? వస్తే దొబ్బుదామని" కోపం వస్తున్నది ఆనందరావుకు.

"రోజుకు పాతికవేలు ఖర్చుపెట్టే స్థోమతనాది. అయిదువేలు అనేది హోటల్లో నేనిచ్చే టిప్పులాంటిది. రైల్లో వచ్చాను కదా. దొంగల భయంతో తీసుకురాలేదు. వెళ్ళగానే పంపిస్తాలెండి కొరియర్లో." ఆనందరావు కళ్ళు ఎర్రబడ్డాయి.

" జీవితంలో మొదటిసారి గెలిచాను. డబ్బు కక్కకపోతే కీళ్ళు విరుస్తాను" అన్నాడు కోపంగా.

"అప్పుడు పోలీస్ కంప్లెయింటిస్తాను. పేకాటలో గెలిచిన డబ్బులిప్పించమని దైర్యముంటే పోలీసులకు చెప్పండి. మీరు కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి పొరుగూరి వ్యక్తి మీద హత్యాప్రయత్నం చేసినందుకు కనీసం మూడేళ్ళు పడుతుంది కఠిన కారాగారం. కొట్టండి." ధీమాగా అన్నాడు వక్రతుండం.

నీరుగారిపోయాడు ఆనందరావు. అది గమనించి నవ్వాడు వక్రతుండం.

"చూడండి.. ఆరులక్షలు ఖరీదు చేసే ఇల్లు. నాలుగుకిప్పిస్తాను. కనీసం రెండు లక్షలు అడ్వాన్సు ఇవ్వండి. మిగిలింది రిజిస్ట్రారు ఆఫీసులో ఇద్డురుగాని. నాకు నిజాయితీలే ప్రాణం. మీకివ్వాల్సిన ఐదువేలు దాన్లో జమ వేసుకోండి. ఏవంటారు?" అన్నాడు.

"అంత డబ్బు లేదు. లక్షైతే ఇవ్వగలను. బ్యాలెన్సంతా లోన్ రాగానే ముద్దర శుద్ధిగా ఇస్తాను. ఒక్కసారి మీ అల్లుడు గారితో కూడా చెప్పి"

"భలేవారే, మామగారు చెబితే ఒకటి అల్లుడు చెబితే ఒకటీనా? మా అల్లుడికి అభిమానం ఎక్కువ. దాన్లో అతనితో పోల్చదగినవాడు కలియుగంలో లేడు. ద్వాపరయుగంలో సోయోధనుడొక్కడే అతనికి సాటి. ఇల్లు అమ్ముకుంటున్నామని చాలా సిగ్గుపడుతున్నాడు."

"అలా అయితే సరే.. రేపు సాయంత్రంలోగా అడ్వాన్సు ఇస్తాను. వారం రోజుల్లో రిజిస్టర్ చేయించాలి" లేచాడు ఆనందరావు.

{ఇంకావుంది}

{హాసం వారి సౌజన్యంతో}