Yeluka Vacche Illu Bhadram 11

 

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -11

ఇలపావులూరి మురళీమోహనరావు

“అది సరేనండీ...ఇలాంటి రోగాలు నలభై,ఏభై దాటిన వారిలో కదా వచ్చేది ?” అడిగింది సుందరి.

“కలికాలం అంటే అదేనండీ.గర్భంలో ఉన్న శిశువుకే గుండె ఆపరేషన్లు చేసిన సంఘటనలున్నాయి.అయినా బీపీ,షుగర్లు నలభై దాటిన తరువాతనే వస్తాయని చెప్పిన ఆ గాడిదేవడో రమ్మనండి.నిలదీసి అడుగుతాను.నలబై దాటిన తర్వాతనే తగల బెట్టి బూడిదను విస్కీలో కలుపుకుని తాగుతాను "చాలెంజింగ్ గా అన్నాడు డాక్టరు.

“వద్దులెండి.ఈ చివరో పరీక్ష రాశారు.సరిగ్గా అర్థం కావడం లేదు.ఇదేంటి ?”ఒకదాని మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు వెంకట్రావు.

డాక్టరు నాలుగైదు సార్లు ఇటు తిప్పి చూశాడు.కళ్ళజోడు తీసి ఒకసారి,కళ్ళజోడు పెట్టుకుని ఒకసారి చూశాడు.పెదవి విరిచాడు.

ఇదేంటో నాకూ అర్థమై చావడంలేదు.లాబ్ వాళ్లకు తెలుస్తుంది లెండి.మీరేం వర్రీ కావద్దు" అభయమిచ్చాడు డాక్టరు.

“సరే...నేను వెళ్ళొస్తాను "లేచాడు వెంకట్రావు.

“ఎక్కడికీ ?” అడిగాడు డాక్టరు.

“ఈ మధ్యనే మా ప్రెండొకడు దాదాపు ఏభై లక్షల రూపాయల ఖర్చుతో లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో డయాగ్నస్టిక్ సెంటర్ పెట్టాడు.అక్కడికి చేయించుకొస్తా...”చెప్పాడు వెంకట్రావు.

“సరి సరి...భలేవారు.ఈ పరీక్షలు చేయవలసింది మంచి అనుభవమున్న వాళ్ళు కానీ... హంగులు,ఆర్భాటాలతో షాపులు నడిపే వాళ్ళు కాదు.వాళ్ళదంతా పైన పటారం లోన లొటారం.రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతాయి వాళ్లకు

.ఆ కంగారులో పిచ్చి పిచ్చి రిపోర్టులు రాస్తారు.వాటిని చూసి మేము ట్రీట్ మెంటిస్తాము.దాంతో గోవిందా...”అంటూ చేతులెత్తి దణ్ణం పెట్టాడు డాక్టరు.

డాక్టరు అలా చెప్పగానే భయం వేసింది వెంకట్రావుకి. “మరెక్కడ చేయించమంటారు ?” అడిగాడు కంగారుగా.

అలా అడగండి.విజయవాడ హైవేలో పదహారో నెంబరు మైలురాయి దగ్గర హేట్ ఆన్ హెడ్ డయాగ్నస్టిక్ సెంటర్ వుంది.డాక్టరుగా అరవై సంవత్సరాల అనుభవమున్న డాక్టరు దైవాధీనం గారు దాన్ని నడుపుతున్నారు.అక్కడ చేయించండి.పర్ ఫెక్టు రిజల్ట్స్ వస్తాయి " చెప్పాడు డాక్టర

“అబ్బో...అది చాలా దూరం కదండీ..ఆటోలో వెళ్లి రావడానికే మూడొందలు అవుతుంది.ఇక్కడ వేరే మంచివిలేవా ?”అడిగాడు వెంకట్రావు.

"లేకేం? ఇంజక్షన్ చెయ్యడం చాతైన వాడల్లా వాడకు పది సెంటర్లు పెడుతున్నాడు.ఇది ప్రాణానికి సంబందించినది కాబట్టి నేను చెప్పేది చెప్పాను.ఇక మీ ఇష్టం.ఎక్కడైనా చేయించుకోండి.కానీ తరువాత నన్నేం అనద్దు "కోపాన్ని ధ్వనింపజేశాడు డాక్టరు.

సుందరి విసుగెత్తింది.

“ఎందుకులెండి డాక్టరుగారు చెప్పిన చోట చేయిద్దాం.కానీ అంతవరకు పాపకు...”తడబడుతూ అడిగింది సుందరి.

“ప్రస్తుతానికి రెండు ఇంజక్షన్స్ ఇస్తాను.వీలైనంత త్వరగా టెస్టులు చేయించి పాపను తెండి. ఇంటిన్సివ్ కేర్ యూనిట్లో రెండు రోజులు ఉంచాలి.తరువాత చాలా టెస్టులు చెయ్యాలి. వెళ్ళిరండి"చెప్పాడు డాక్టరు.

తమ కర్మానికి తమనే నిందించుకుంటూ ఆటోలో బయలుదేరారు ఆ దంపతులు.

***

ఆటో సిటీ లిమిట్స్ దాటి పరుగులు తీస్తున్నది.ఆ డయాగ్నస్టిక్ సెంటర్ ఎక్కడ దొరుకుతుందా అని చెరో దిక్కు చూస్తున్నారు.

సెకన్ సెకనుకు మారిపోతున్న మీటర్ రీడింగ్ చూస్తుంటే వెంకట్రావుకు ముచ్చెమటలు పోస్తున్నాయి.

“ఎక్కడుందీ దరిద్రపు సెంటర్..విజయవాడకు పోయినా దొరికేట్లు లేదు.ఛి..ఛీ..ముండమోపి ఎలుకతో ఎంత చిక్కొచ్చి పడింది.డబ్బుకు డబ్బు...శనికి శని...”విసుగ్గా అరిచాడు వెంకట్రావు.

“కనుచూపులో మేరలో కొండలు గుట్టలు తప్పఇల్లు అనేది కనబడటం లేదు.ఇంత దూరం పంపించాడు అంటే ఆ డాక్టరుకు వీడికి ఏదో లింకు ఉండుంటుంది "అన్నది సుందరి.

“లేకపోతే సిటీలో లక్ష సెంటర్లు వుంటే ఇక్కడికే ఎందుకు వెళ్ళమన్నాడు?అంతా దొంగలు" అన్నాడు వెంకట్రావు.

“దేన్నీ గురించి సార్ మాట్లాడుతున్నారు "అడిగాడు ఆటోవాలా.

“ఇక్కడేదో హేట్ ఆన్ హెడ్ అనే డయాగ్నస్టిక్ సెంటర్ ఉందిట.ఎక్కడా కనబడిచావడు" చెప్పాడు వెంకట్రావు.

పగలబడి నవ్వాడు ఆటోవాలా.

(ఇంకా వుంది)