Yeluka Vacche Illu Bhadram 13

 

 

 

 This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -13

ఇలపావులూరి మురళీ మోహనరావు

పదిహేను నిమిషాల తరువాత లోపలి నుండి బయటికి వచ్చాడు డాక్టర్ దైవాధీనం.అతని చేతిలో ఒక పైలు ఉంది.

ఆ పైలును వెంకట్రావు దంపతులకు యిస్తూ "ఇవిగో మీ రిపోర్టులు. వీటికి సాధారంగా ఒక రోజు పడుతుంది.కానీ డాక్టర్ దుర్యోధన్ క్లయింట్స్ కావడం వలన ఎమర్జెన్సీ కింద మోస్ట్ కాస్ట్లీ కెమికల్స్ ను ఉపయోగించి త్వరగా తయారుచేశాను.దీనికి ఆరువందలు ఎక్కువవుతుంది "అంటూ నిదానంగా చెప్పాడు.

“పదిహేను నిమిషాల్లో ఇన్ని రిపోర్టులు తయారు చేశారా ?”ఆశ్చర్యంగా అడిగారు వెంకట్రావు దంపతులు.

“ఏం చేస్తాం?అర్జెన్సీ.త్వరగా డబ్బులివ్వండి.ఈ రిపోర్టులను వెంటనే డాక్టర్ దుర్యోధనకు చూపించి పాపకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయించండి.ఆల్ ద బెస్ట్.”అన్నాడు దైవాధీనం.

ముఖం మాడ్చుకుని పదివేల రూపాయల కట్ట ఇచ్చాడు వెంకట్రావు.సుందరి కళ్ళు చెరువులయ్యాయి.

“డాక్టర్...మిగిలిన చిల్లరిస్తే ఆటోకిస్తాం"పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు వెంకట్రావు. “ఓహ్...అయామ్ సారీ "అని పదివేల రూపాయల కట్టలోంచి నాలుగు కాగితాలు తీసి వెంకట్రావుకు ఇచ్చాడు దైవాధీనం.

వచ్చిన ఆటోలోనే తిరిగి బయలుదేరారు వెంకట్రావు దంపతులు.

“దొంగముండా కొడుకులు!పదిహేను నిమిషాలలో ఇన్ని పరీక్షలు చేశాడా?ఈ దరిద్రపు ఎలుక మూలంగా పెద్ద రొంపిలో దిగబడ్డాం"బండ బూతులు తిట్టసాగాడు వెంకట్రావు. అనూహ్య మాత్రం ఇద్దరి మధ్యా కూర్చుని వానా అల్లరి చేస్తున్నది.పాపం!దానికి ఈ సంగతులు తెలియవు కదా. గంటకల్లా హాస్పటల్ ముందు ఆగింది ఆటో.

“ఎంతైంది ?”అడిగాడు వెంకట్రావు.

“నాలుగువందల అరవై సార్ "మీటర్ చూస్తూ చెప్పాడు ఆటో డ్రైవర్.

“మైగాడ్!ఆ డబ్బుతో తిరుపతి పోయిరావచ్చు గదయ్యా...”కోపంగా అన్నాదు వెంకట్రావు. “ఇప్పుడు మీరు వెళ్లొచ్చింది అక్కడికే సార్.పదివేలు ఆ దొంగ వెధవకు సమర్పించుకున్నారు. కష్టం చేసినవాడికి న్యాయమైన డబ్బులివ్వడానికి అలా అల్లాడి పోతారేం?”విసుక్కున్నాడు ఆటోవాలా.

“అతను చెప్పిందీ నిజమే.ఇచ్చెయ్యండి"పాపను ఎత్తుకుని లోపలికి వెళ్తూ అన్నది సుందరి. డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించాడు వెంకట్రావు.

***

రిపోర్టులన్నీ చదివి అదోలా ముఖం పెట్టాడు డాక్టర్ దుర్యోధన్.

“ఏమైంది సార్ "అడిగాడు వెంకట్రావు.

“పాపకు బీపీ,షుగర్ లాంటివి ఏమిలేవు.పరువాలేదు.ఎందుకైనా మంచిది.ఇ.సి.జి.బ్రెయిన్ స్కానింగ్,వైడల్ టెస్ట్,నడుము ఎక్స్ రే తీయిద్దాం "చెప్పాడు డాక్టర్ దుర్యోధన్.

“పాపకు ఈసీజీనా?ఎంత ఈజీగా చెబుతున్నారు?బ్రెయిన్ స్కానింగ్ గట్రా అవసరమా?”ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాడి వెంకట్రావు.

“అవసరమనేది నా అభిప్రాయం.అనవసరం అని మిరూ అభిప్రాయపడితే అది మీ ఇష్టం.ఈ రోజుల్లో ప్రతివాడూ డాక్టరే.కానీ ఒక విషయం మాత్రం చెబుతాను.పాప విషం టిని చాలా సేపైంది.అది కాలి వేలు నుంచి తల మీది వెంట్రుక వరకు నరనరాల్లోనూ పాకి ఉంటుంది.

ఏ భాగమైనా ఎఫెక్ట్ అయిందేమోనని నా అనుమానం.ఒక వేళ పాప బ్రతికినా ఏ కాళ్ళో చచ్చుబడి మీ కళ్ళముందే బల్లిలా పాకుతుంటేనో,మెదడు చెడిపోయి రేపు బజార్లో కనిపించిన ప్రతివాడినీ డాడీ అని పిలుస్తుంటేనో భరించాల్సింది మీరేకానీ నేను కాదు.ఈ పరిస్థితుల్లోనే ట్రీట్ మెంట్ చెయ్యమని మీరంటే అలాగే చేద్దాం "అన్నాడు డాక్టర్ దుర్యోధన.

సుందరి భయంతో వణికిపోయింది.

“వద్దండీ వద్దు.అలాంటి స్థితిలో నా ఒక్కగానొక్క కూతుర్ని నేను చూడలేను.అలాగే చేయిస్తాం "అన్నది సుందరి.

“వెంటనే వెళ్లి చాదర్ ఘాట్ బ్రిడ్జి కింద డండం డయాగ్నస్టిక్ సెంటర్ లో చేయించుకుని రండి "ప్రిస్క్రిష్పన్ ప్యాడ్ మీదా రాస్తూ చెప్పాడు డాక్టర్ దుర్యోధన్.

“వీటికెంతవుతుంది ?”అడిగాడు వెంకట్రావు.

డాక్టర్ దుర్యోధన వెంకట్రావుని చూసి అదోలా నవ్వాడు.

(ఇంకా వుంది)

(హాసం సౌజన్యంతో)