Yeluka Vacche Illu Bhadram 53

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

Eluka Vacche Illu Bhadram 53

ఇలపావులూరి మురళీమోహన రావు

"వెంకట్రావు గారూ... వాడికేం తెలియదు.ఆర్భాకుడు. ఆ లెట్రిన్లు పునాదులతో సహా నిర్మూలించకపోతే మీకు అగ్ని ప్రమాదం తప్పదు. ఇండియా ఏ దేశం మీదైనా అణ్వాయుధాలు ప్రయోగిస్తే అవి గురి తప్పి నేరుగా మీ ఇంటి మీదే పడి ఇంటి ఆనవాలు కూడా మిగలక పోవచ్చు." అన్నాడు వాస్తుభూషణం.

ఆ దృశ్యాన్ని గాలిలో చూస్తూ ఊహించుకున్న వెంకట్రావు ముఖం ఏదో డ్రాక్యూలా తన కోర పళ్ళతో తన ముఖంలోని రక్తమంతా పీల్చుకున్నట్లు పాలిపోయింది.

"సుందరి గారూ నైరుతిలో కిటికీ తప్పని సరిగా ఉండాలి. లేకపోతే మీకు కుష్టువ్యాధి సంక్రమించే అవకాశాలున్నాయి. మీ చేతులు ఎలుకలు కొరికిన దొండకాయల్లా కుంచించుకుపోతాయి. అప్పుడు మీ చేతులతో అన్నం కలుపుకోలేరు. స్పూన్ ముట్టుకోలేరు" చెప్పాడు వా.వి.చా.

వణికిపోయింది సుందరి. తన వేళ్ళన్నీ చిన్నచిన్న దొందకాయల్లా మారి వేళ్ళు ముడవలేక అల్లాడుతుంటే స్కూలుకెళ్ళే పిల్లలు తనను చూసి భయపడి రాళ్ళు వేస్తునట్లు, ఆకలో రామచంద్రా అని ఏడుస్తూ బస్టాండు వద్ద తినడానికేమైనా దొరుకుతాయోమోనని చెత్తకుండీల్లో వెదుకుతుంటే, ఎవరో తిని పారేసిన అరటిపండు తొక్క కోసం తాను ఆత్రంగా వెతుక్కుంటున్నట్లు భయంకరమైన దృశ్యం గోచరించి పరమ భయంకరంగా కేకపెట్టింది.

"వెంకట్రావు గారూ వాడిమాట వినద్దు. ఆ కిటికీ ఉంటే మీకు క్షయవ్యాధి సోకి దేవదాసులా దగ్గుకుంటూ ఊరకుక్కను వెంటేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటే, మీ దగ్గు భరించలేక జనమంతా మీ మక్కెలు విరగ్గొడతారు. ఇది నిజం." పళ్ళు నూరుతూ చెప్పాడు వాస్తుభూషణం.

"సుందరి గారూ మీ మంచి కోరి చెబుతున్నాను. పిట్టగోడ ఎంత మందంగానైనా ఉండవచ్చు. వాడి మాటలు నమ్మి దాన్ని పడగొట్టద్దు. ఒకవేళ అలా పడగొడితే వాస్తుపురుషుడికి కోపం వచ్చి మీకు కేశసంబంధ వ్యాధులు రావచ్చు. నీలాల మీ కురులకు పెనుబంక, ఆకుపచ్చ పురుగు చేరి జొన్నకంకులను నమిలినట్లు మీ తలను కొరికి వేస్తాయి. విగ్గు పెట్టుకోవడానికి కూడా తల షేపు పనికి రాకుండా పోతుంది." హెచ్చరించాడు వా.వి.చా.

సుందరి అరికాళ్ళ క్రింది నేల కదిలింది. తన తలంతా పురుగులు చేరి పొడవాటి గోళ్ళతో బరబర గోక్కుంటున్నట్లు, ఒక్కసారి దువ్వెనతో దువ్వగానే లక్షల పురుగులు జలజల రాలి నేలమీద పడ్డట్లు, అవి మళ్ళీ గబగబ తన శరీరం మీదుగా పాకుతూ తలలో దూరుతున్నట్లు, పళ్ళదువ్వెనతో దువ్వగానే తుట్టెలు తుట్టెలుగా తలంతా జుట్టూడిపోతూ నాలుగైదు రోజుల్లోనే తలంతా బోడి గుండైనట్లు దిక్కుమాలిన కలకని గజగజ వణికింది.

"వద్దు వద్దు ఆ పిట్టగోడ పడగొట్టం. నాతల... నాతల" అని తలంతా తడుముకుని వెంట్రుక వెంట్రుక పట్టి చూసింది.

వాస్తుభూషణం గుడ్లురుముతూ అందుకున్నాడు.

"వెంకట్రావు గారూ.. మీ హితం కోరి చెబుతున్నాను. మెట్లను మీరు తక్షణం పడగొట్టించండి. ఎనిమిది మెట్లు తరువాత ప్లాట్ ఫామ్ మీకు ఊహించని వ్యాధులు కలిగిస్తుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుడి చెయ్యి, కుడికాలు పడిపోతాయి. అప్పుడు మీరు అన్నం తినడానికి కూడా ఆ చెయ్యే...యాక్కిరే ఉపయోగించాల్సి వస్తుంది. బాత్ రూమ్ కు వెళ్ళాలన్న ఒంటికాలితో శరీరాన్నంతా మోసుకుంటూ కప్పలాగా ఎగురుకుంటూ వెళ్ళాలి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి." చెప్పాడు వాస్తు భూషణం.

వెంకట్రావు చేతులు కాళ్ళు వణికాయి.హఠాత్తుగా తన కుడి చెయ్యి, కుడి కాలు నీలుక్కు పోయినట్లు, ఒంటికాలుతో ఎగురుతూ బాత్ రూమ్ కు వెళ్తూ తలుపు తెరవమని సుందరిని కోరగా నిరాకంరిచినట్లు ఓ దరిద్రపు దృశ్యం సాక్షాత్కరించి చెవులకు అరిచేతులు అడ్డం పట్టుకుని 'నో' అని అరిచాడు. వా.వి.చా. అందుకున్నాడు.

"సుందరి గారూ.... ఆడవాళ్ళనే ఆపేక్షతో చెబుతున్నాను. కాపౌండ్ లోని చెట్లు పడగొట్టించవద్దు. వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. ఆ చెట్లే మీ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతాయి. వాటిని పడగొడితే నలభై ఏళ్ళు కూడా రాకుండానే దానిమ్మగింజలలాంటి మీ పళ్ళు టపటప రాలిపోతాయి. అప్పుడు మీరు నోరారా నవ్వలేరు. అన్నాన్ని సంకటిలా వండుకుని నేరుగా మింగవలసి వస్తుంది. వక్క పొడిని కూడా కల్వంలో దంచుకుని పౌడర్ లా చేసి చప్పరించవలసి వస్తుంది." హెచ్చరించాడు.

ఒకరోజు ఉదయం బ్రష్ చేసుకుంటుంటే తన పళ్ళన్నీ రాలిపోయినట్లు, దవడలు రెండూ సొట్టలు పోయి ముడుచుకుపోయినట్లు. ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి నేరుగా గొంతులో వేసుకున్నట్లు, చిన్న కల్వంలో తమల పాకులు, వక్కలు, సున్నం కలిపి నూరి దవడల మధ్య దోపి చప్పరిస్తున్నట్లు ముదనష్టపు ఊహ మెదిలింది సుందరికి.

"వద్దండీ వద్దు... ఆ చెట్లు చచ్చినా పడగొట్టం. నేను పోయిందాకా నా పళ్ళు నాతోనే ఉండాలి." అని గబగబ అరమరలోనున్న ఒక్కపొడి డబ్బా తెరిచి గుప్పెడు వక్కపొడి నోట్లో పోసుకుని నమిలేసింది. వాస్తుభూషణానికి కంగారెక్కువైంది. తన క్లయింట్ తన చెయ్యి జారి పోతున్నాడన్న భావన కలిగింది. కోపం వచ్చింది. చెప్పసాగాడు.

"వెంకట్రావు గారూ.. మీ శ్రేయోభిలాషిని. ఈ మోసగాడిని నమ్మద్దు. పిట్టగోడను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పడగొట్టించి తీరాలి. లేకపోతే వాటిలోని ఇనుప సాకులు మీ పాలిట చాకులై కాకుల్లా, బాకుల్లా మీకళ్ళును పొడుచుకు తింటాయి. అప్పుడు కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు. అప్పుడు మీ ఆవిడ కంచంలో ఎండిపోయిన వేపాకులను వేసినా పూతరేకులనుకుని నోట్లో పెట్టుకుంటారు. గ్లాసులో కషాయం పోసిచ్చి పరమాన్నం అని చెబితే నమ్మి తాగుతారు. ఎదురింటి బర్రె బామ్మగారిని చూపించి తానే అంటే వెళ్ళి గబగబ వాటేసుకుని చెప్పు దెబ్బలు తింటారు" హెచ్చరించాడు.

వెంకట్రావు గుండె ఝల్లుమన్నది. తాను రెండు కళ్ళూ పోగొట్టుకుని గుడ్లు పైకెత్తి రెప్పల్ని టపటపకొడుతూ వంగిపోయిన చేపాటి కర్రను పట్టుకుని నడుస్తున్నట్లు, భోజనానికి పిలిచినప్పుడు అరమరలు కిటికీలు పట్టుకుని తడుముకుంటూ వెళ్ళి కంచం ముందు కూర్చోగానే సుందరి కంచంలో వేపాకుల్ని వేసి పాలకూర ఇగురు అని చెబితే వెంటనే తాను తింటున్నట్లు ఒక పీడా దృశ్యం ఎదురుగా మెరిసి చావుకేక పెట్టాడు.

"వద్దు భూషణం గారూ.. ఆ ఊహ నేను భరించలేను. నా కళ్ళు కావాలి. కళ్ళులేకపోతే కలియుగం లేదు." పిచ్చిగా పిల్లాడిలా అరిచాడు. వా.వి.చా. కోపం ఎక్కువైంది.

"సుందరిగారూ. పోగాలము దాపురించిన వారు మంచి మాటలు వినరంటారు. నామాట వినండి బెడ్ రూమ్ లోని బాత్రూమును కదిలించొద్దు అది పెద్ద వాస్తు దోషమవుతుంది. ఒకవేళ బాత్రూమ్ ను కదిలిస్తే ఇక ఈ జన్మలో మీకు పిల్లలు పుట్టరు. ఉన్న ఒక్కపిల్లా దక్కదు. అప్పుడు అందరూ వెంకట్రావు గారిని 'ఆకో' అని ఎగతాళి చేస్తుంటారు. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా మిమ్మల్ని గొడ్రాలు అని ఆడిపోసుకుంటారు. మీ గర్భసంచి పగిలి ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. ఇక మీకు పిల్లలు పుట్టరని వంక పెట్టి మీ అత్తగారు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొడతారు." వివరంగా చెప్పాడు.

సుందరి నిలువెల్లా వణికింది. ఒకరోజు ఆవకాయ ఎర్రగా కలుపుకుని తింటుండగా కడుపులో మంటలు రగిలి నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఎక్సురే తీసి గర్భసంచికి చిల్లు పడిందని ఆపరేషన్ చేసి తొలగించాలని డాక్టర్ చెప్పినట్లు, అత్తగారు కాళికాదేవిలా ఉగ్రరూపం ధరించి పిల్లలు లేని పిశాచి అని తనను తిడుతూ దుడ్డు కర్రతో చావగొట్టి ఇంట్లోంచి బయటకు నెడుతున్నా వెంకట్రావు పట్టించుకోకుండా చూస్తున్నట్లు పీడా కారపు శీను కనిపించి గొంతు పగిలేలా అరిచింది. వాస్తుభూషణనికి మండిపోయింది. కాకి కష్టపడి తెచ్చుకున్న మాంసం ముక్కను గద్దతన్నుకుపోతున్నట్లు ఫీలై పళ్ళు పటపట కొరికాడు.

"వెంకట్రావుగారూ... పాతికేళ్ళ అనుభవంతో నేను చెబుతున్న మాటలు వినండి. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు వాడిని నమ్మి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు. ఆ బాత్రూమ్ ను నిర్మూలించకపోతే ముప్పై అయిదు కూడా దాటకుండానే మీరు "చూడు పిన్నమ్మా పాడు పిల్లాడూ" అని చెమ్మచెక్క లాడుతూ తలలో పూలు పెట్టుకున్న నలుగురిని వెంటేసుకుని బజార్ల వెంట తిరుగుతుంటారు. తస్మాత్ జాగ్రత్త!" తీవ్రస్వరంతో అన్నాడు.

వెంకట్రావు పక్షవాతం వచ్చిన వాడిలా విలవిలలాడాడు. వంటి నిండా చీరకప్పుకుని, జాకెట్ వేసుకుని, కొప్పునిండా పూలు పెట్టుకుని, నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, మరో పదిమంది అలాంటి వారిని వెంట బెట్టుకుని చప్పట్లు కొట్టుకుంటూ "ఓ బాయ్యో..ఓ అక్కయ్యో.." అని అందరినీ పిలుస్తూ వయ్యారంగా నడుస్తున్న దృశ్యం కనిపించి శరీరమంతా చెమటలు పట్టాయి. "వద్దు..వద్దు..." భోరుమన్నాడు. వా.వి.చా... ఆగ్రహోదగ్రుడయ్యాడు.

"సుందరి గారూ.. ఆటను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఎట్టి పరిస్థితులలోనూ సిలెండర్ దిశను మార్చద్దు. దాన్ని అలాగే ఉంచండి. ఒకవేళ దాన్ని కదిలించినట్లయితే సిలెండర్ పేలిపోయి మీ సుకుమార శరీరం తునాతునకలై పోతుంది. కాలువెళ్ళి కాశ్మీర్లో, చెయ్యివెళ్ళి చెన్నైలో, ముక్కు వెళ్ళి ముంబాయిలో, నడుము నాగాలాండ్లో, పళ్ళు పాట్నాలో, చెవులు చండీఘర్లో, పుర్రె పూనాలో, చెంపలు వెళ్ళి పాతాళగంగలో పడతాయి. ఆ పార్టులన్నీ వెతికి పెట్టడానికి ఆర్మీ అంతా రంగంలోకి దిగినా సాధ్యంకాదు " అన్నాడు.

ఆ భీభత్స దృశ్యాన్ని ఊహించుకోగానే పేగులు తెగి పోయి పొట్టలోంచి బయటకు వచ్చినట్లయింది సుందరికి.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)