Yeluka Vacche Illu Bhadram 52
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
Eluka Vacche Illu Badram 52
"పోర్టికో మరీ ఆరడుగులే ఉన్నది. కనీసం ఏడడుగుల ఎత్తైనా ఉండాలి. పోర్టికో అధిపతి శని. దీన్ని వీలైనంత దూరంగా పెట్టుకోవాలిగానీ మరీ నెత్తిన పెట్టుకున్నారే. అన్నన్న... వాటర్ పైపులు ఇక్కడ పెట్టారేంటి, అందునా ఈ ట్యాప్ పడమర చూస్తున్నది. పడమర చూసే ట్యాపు ప్రగతిని చేత్తో ఆపు అని అర్జంటినాలో అరిచి చెప్పాను. వాళ్ళు వినలేదు కాబట్టే ఆ దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. శాస్త్రమా మజాకా! శాస్త్రో రక్షితి రక్షితః అన్నారు. శాస్త్రాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది."
"స్వామీ! ఇన్ని విషయాలు మాకు నిజంగా తెలియవు."
"అందువల్లనే నాయనా ఇన్ని పొరపాట్లు జరిగాయి."
"మరి దీనికి నివారణ?'
"అందువల్లనే, నాయనా మేమున్నది? రండి...నెమ్మదిగా కూర్చుని మాట్లాడుకుందాం." ముగ్గురూ హాలులో కూర్చున్నారు.
సూట్ కేస్ లోంచి ఐదువేల పేజీల పుస్తకం ఒకదాన్ని బయటకు తీశాడు వాస్తుభూషణం. పేజీలు తిరగెయ్యసాగాడు.
"ఏం పుస్తకం సార్ అది అంతలావుంది?" అడిగాడు వెంకట్రావు.
"ఆరువేల సంవత్సరాల క్రితం వాస్తవ మహర్షి అనే ఋషి రచించిన వాస్తు వాద క్రియ అనే ఉద్గ్రంథం ఇది. ఆ మధ్య వాషింగ్టన్ వెళ్ళినప్పుడు పుట్ పాత్ మీద పదివేల దాలర్లిచ్చి కొన్నాను. మయుడు పాండవుల కొరకు మయసభను నిర్మించడానికి ఈ గ్రంథాన్ని పరిశీలించాడని ప్రతీతి. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపజేయడానికి ఈ గ్రంథంలో అనేక టెక్నిక్కులున్నాయి. ప్రపంచంలో ఇలాంటి గ్రంథం ఇదొక్కటే." చెప్పాడు వాస్తు భూషణం.
"ఆహా! అది నేనొకసారి చూడొచ్చా?" అడిగాడు వెంకట్రావు.
"తప్పకుండా. విజ్ఞానం అందరిదీనూ." అందించాడు వాస్తు భూషణం.
"ఏం భాషండీ ఇది.. ఏదో అరబిక్ ళా ఉంది. ఒక్కముక్క అర్థం కావడంలేదు." అన్నాడు వెంకట్రావు.
"అది దేవేంద్ర భాష. సామాన్యులకు అర్థం కాదు. ఇలా ఇవ్వండి." పుస్తకం తీసుకుని పేజీలు తిరగేశాడు వాస్తుభూషణం.
"వెంకట్రావు గారూ.... ఇంట్లో చాలా మార్పులు చెయ్యాలి. ఆగ్నేయంలో లెట్రిన్లను నిర్మూలించాలి. సెప్టిక్ ట్యాంకును మూసేసి ఉత్తరం వైపు తవ్వించండి. మెట్లు మొత్తం పడగొట్టించండి. బెడ్రూమ్ అంతా కూలగొట్టాలి. దక్షిణం వైపున్న ద్వారబంధాలు నిర్మూలించి రెండంగుళాలు ఉత్తరం జరిపించాలి. ఉత్తరం కాంపౌండ్ వాల్ పగలగొట్టి అంగుళం జరిపి తిరిగి కట్టించండి. హాల్లో ఉన్న అలమరలను తీసేయించండి. దక్షిణానున్న వాటర్ ట్యాపులను తీసేయించి ఉత్తరం వైపు పెట్టించండి. పిట్టగోడ తీసేసి రెండున్నరంగుళాల మందంతో తిరిగి కట్టించాలి. తూములను తవ్వించి పెద్దవి చేయించాలి. వంటింట్లో ప్లాట్ ఫామ్ ఎత్తు పెంచాలి. మోరీని తీసేయించి కణంలో పెట్టాలి" చెప్పసాగాడు వాస్తుభూషణం.
"ఆపండి మీ వాచాలత్వం" అనే మాటలు గంభీరంగా వినిపించాయి.
ముగ్గురూ ఉలిక్కిపడి వాకిలి వైపు చూశారు. నిలువునా కాషాయవస్త్రాలు, అరణ్యంలో పెరిగినట్లు తైల సంస్కారం లేని తల, గుబురు మీసాలు, కొమ్మల నుండి దిగిన ఊడల్లాంటి గిరజాలు, నుదుట మందమైన గంధపుగీతలు, మెడలో నిమ్మకాయలంత రుద్రాక్షలతో మాల, చేతులకు బంగారు కడియాలు, పాదాలకు పావుకోళ్ళు దరించి నిలబడి ఉన్నాడో వ్యక్తి. రెండు పండిత శాలువాలు భుజం మీదున్నాయి. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. కనుబొమ్మలు వరుసా వాయీ లేకుండా పెరిగున్నాయి. బక్కపలచగా ఉన్నా బలంగా ఉన్నాడు. అతనిని చూసి పళ్ళునూరాడు వాస్తుభూషణం.
"ఎవరు మీరు?" అడిగాడు వెంకట్రావు.
"ఆ.. ఎంత మదం ఎంత కావరం? ఎంత అహంకారం" ఆగ్రహంగా అన్నాడా వ్యక్తి.
"విచిత్రంగా ఉందే... ఈ శతాబ్దంలో ఇలాంటి పేర్లా? ఇంతకూ ఈ మూడింట్లో మీ అసలు పేరేంటి" అయోమయంగా అడిగాడు వెంకట్రావు.
"ఔరా దురహంకారీ... మాతోనే పరాచికాలా! మాకు ఆగ్రహం వస్తున్నది." తీవ్ర స్వరంతో అన్నాడా వ్యక్తి. అతని కోపం చూసి సుందరి, వెంకట్రావు భయపడ్డారు.
"క్షమించండి స్వామీ ఏదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే వాళ్ళ ఆకారాలు చూశాం కాబట్టి వెంటనే గురుతు పట్టగలం. కానీ మీరు మనిషా...దేవుడా... మనుషుల్లో దేవుడా...ఏదైనా పీఠాధిపతా క్షమించండి. ఇంతకు ముందు తమరినెక్కడా చూసినట్లు గుర్తు లేదు. అందుకే అడుగుతున్నాం" చేతులు జోడించి అడిగారు ఇద్దరూ.
"సరే క్షమించాం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్యోతిష్య, సాముద్రిక, నాడీశాస్త్ర, భాషాశాస్త్ర, సర్వశాస్త్ర, వాస్తుశిరోమంజరి, వాస్తు నవరత్న చింతామణి, వాస్తు దైవ చూడామణి, వాస్తు విభూషణాచార్యులను నేనే" అన్నాడు గంభీర స్వరంతో.
"అలాగా... మీరు మా ఇంటికి రావడం..మేము పిలవలేదే..." తడబడుతూ అన్నాడు వెంకట్రావు.
"హు .. సర్వాంతర్యామిని. నన్ను ఒకరు పిలేచేదేంటి? ఎక్కడ వాస్తు పురుషుడు అవమానించిన బడుతాడో అక్కడ నేను ప్రత్యక్షమౌతాను. ణా సెవెన్త్ సెన్స్ నన్ను సదా హెచ్చరిస్తుంటూనే ఉంటుంది."
"వాస్తు పురుషుడికి అన్యాయమా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా?" ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.
"అవును.. అక్షరాల వాస్తుపురుషుడికి అన్యాయమే జరుగుతున్నది. అది సహింపలేకే హిమాలయాలకు తప్పస్సుకని బయలుదేరి కూడా మా శరీరం ఇటు మళ్ళింది."
"ఇంతకూ మీరు చెప్పిన ఆ అన్యాయం ఎక్కడ?"
"ఎక్కడో ఏందీ..ఇక్కడే.. మీ ఇంట్లోనే... ఈ అజ్ఞాని కారణంగానే" వాస్తుభూషణాన్ని చూపిస్తూ అన్నాడతను. వాస్తు భూషణం ముఖం నల్లబడింది. సుందరి, వెంకట్రావులు విస్తుపోయారు అతడి మాటలకు.
"ఏవిధంగా?" అడిగాడు వెంకట్రావు.
"ముందు మీరు లోపలకు రండి కుర్చీలో కూర్చోండి." అన్నది సుందరి కుర్చీలో చూపిస్తూ.
"ధిక్.. వాస్తు ధిక్కారం చేసిన కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే టపా కడతాడు. కనుక మేము ఈ కుర్చీలో కుర్చోము. ఇలాగే నించుంటాము."
"అయ్యో అలా ఎంత సేపు నిలుచుంటారు? పోనీ ఈ సోఫాలో ఆశీనులుకండి."
"అజ్ఞాని హిమాలయాలలో ఒంటికాలు మీద పన్నెండు సంవత్సరములు తపము చేసిన వారము. రెండు కాళ్ళమీద నిలబడటం మాకు బ్రహ్మవిద్యేమీ కాదు."
"సంతోషం ఇంతకూ మీరేం చెప్పదలిచారు?"
"ఇతడు చెబుతున్న మార్పులన్నీ అబద్దాలు, దంబాచారాలు." తీవ్ర కంఠస్వరంతో అన్నాడు వా.వి.చా.
"అతను చెప్పేది అబద్దం, నమ్మకండి" అన్నాడు వాస్తుభూషణం కోపంగా.
"అవును నమ్మకండి అతడిని. అతడి మాటలు వింటే ఇలా పోతారు. అతడి చెప్పినట్లు వంటింట్లో ప్లాట్ ఫామ్ ఎత్తు పెంచితే సుందరి గారికి చర్మవ్యాధి కలిగి చర్మం అక్కడక్కడా ఊడిపోయి కురూపిలా తయారౌతారు." అన్నాడు వా.వి.చా.
"భయమేసింది సుందరికి. తన శరీరంపై చర్మం ఊడిపోయి తెల్లని మాంసభాగం కనబడుతూ వణుకుతూ బజార్లో నడుస్తుంటే అందరూ తనను చూసి భయపడి పారిపోతున్నట్లు మనసులో దృశ్యం మెడలి కెవ్వునకేక పెట్టింది. "వద్దు..వద్దు.. ఎత్తు పెంచం గాక పెంచం." అరిచింది. వాస్తు భూషణం అందుకున్నాడు.
"వెంకట్రావు గారూ నా మాట వినండి, ఆ ప్లాట్ ఫామ్ ఎత్తు పెంచకపోతే ఆఫీసులో జీతం తీసుకుని ఇంటికి వస్తుంటే సిటీ బస్సులో ఎవడో ఒకడు మీ జేబు కత్తిరించి పర్సు కాజేస్తాడు. లేదా జేబులో దోపుకునేటప్పుడు పర్సు జారి కిందపడుతుంది. దాన్ని మీరు గమనించరు. ఆ నేలంతా మీరు అప్పుల పాలౌతారు." హెచ్చరించాడు. వెంకట్రావు విలవిలలాడాడు.
ఇంటికి రాగానే సుందరిని పిలిచి రెండు ముద్దుకు పెట్టి జీతం మొత్తం ఇద్దామని జేబులో చెయ్యి పెట్టంగానే ఖాళీగా ఉన్నట్లు దేభ్యం మొహం వేసుకుని పర్సు కొట్టేశారని సుందరికి చెప్పినా నమ్మకుండా ఏ లాడ్జింగ్ కో వెళ్ళి భోగం దానికి సర్వం సమర్పించి తన దగ్గర నాటకాలాడుతున్నట్లు తిట్టిపోసిన దృశ్యం సాక్షాత్కరించింది.
"నో నో.. పెంచుతాను. పెంచి తీరుతాను." అరిచాడు.
"వెంకట్రావు గారూ. లెట్రిన్లు ఆగ్నేయమూల ఉండకూడదని రూలేం లేదు అసలక్కడే ఉండాలి. అవి పడగొట్టిస్తే సుందరి గారికి అగ్ని ప్రమాదం జరిగి ముఖమంతా కాలిపోయి అద్దంలో చూసుకున్నపుడల్లా తన రూపానికి తనే భయపడి కేకలు పెడుతుంటారు." అన్నాడు వా.వి.చా.
సుందరి నరాలు వణికాయి. స్టౌ మండుతున్నప్పుడు చీర కొంగుకు మంట అంటుకుని వాళ్ళంతా కాలిపోయినట్లు, ముఖమంతా కాలి చర్మం అట్టలు కట్టినట్లు, బొట్టు పెట్టుకుందామని అద్దం ముందు నిలుచోగానే భయపడి కేకలు పెట్టినట్లు ఓ దృశ్యం కనిపించి 'నో' అని అరిచింది.
(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)