Yeluka Vacche Illu Bhadram 54

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 54

ఇలపావులూరి మురళీమోహన రావు

"ఏమండీ..మీకు సిలెండర్ మార్చడం ముఖ్యమా నా శరీరం, నేను ముఖ్యమా? చివరకు పాడిమీద నా ఫోటో పెట్టి దహనం చెయ్యాలి." ఏడుస్తూ అన్నది వెంకట్రావుతో.

"నో..నో..సుందూ, నాకు నువ్వే ముఖ్యం. వెధవ సిలెండర్... వెయ్యి రూపాయలు పెడితే రెండొస్తాయి కానీ నీలాంటి భార్య నాకు దొరకదు" వణుకుతూ అన్నాడు వెంకట్రావు.

వాస్తుభూషణం మరింత మండి పడ్డాడు "వెంకట్రావు గారూ, బహు పరాక్, తిరుపతి వెంకన్నకే వాస్తు చెప్పిన వాడిని నేను పుష్కరిణి అంగుళం మేర లోతు తవ్వించాలన్న నా సూచన వారు పాటించబట్టి వెంకన్న భక్తులు పెరిగారు పోర్టికో ఎట్టి పరిస్థితులలోనూ పడగొట్టించి తీరాలి లేకపోతే ఏదో ఒకరోజు కూలి మీద పది మీ తొడలు విరగడం ఖాయం అప్పుడు మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటే సుందరి గారు సతీసుమతిలా మిమ్మల్ని తట్టలోనో, బుట్టలోనో కూర్చోబెట్టుకుని మోసుకు వెళ్ళాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త" ఆవేశంగా అన్నాడు.

"అమ్మో అయ్యన్ని మొయ్యడం నా వల్ల కాదు" కేక పెట్టింది సుందరి.

"ఓసి నీ ముండమొయ్యా ఆయన చెప్పేది నా తొడలు విరిగిన తరువాత మాట! వెధవ పోర్టికో పోతే పోయింది నీ కంత శ్రమ రానివ్వను " ఆక్రోశించాడు వెంకట్రావు.

"వెంకట్రావు గారూ. నా మాట వినండి వీడి మాటలు వింటుంటే వీడనలు వాస్తు పండితుడేనా అని నాకు అనుమానంగా ఉంది పిలవని పేరంటంలా వచ్చాడు వీడి పేరెన్నడూ నేను వినలేదు వీడనలు" కోపంగా అంటున్నాడు వాస్తుభూషణం.

"నోర్మూయ్ వీడు వాడు అంటే మర్యాద దక్కదు నీ ధోరణి చూస్తుంటే అసలు నువ్వు వాస్తు విద్వాసుడి వేనా అని పసివాడు కూడా సందేహిస్తాడు వా అంటే ప్రజల హితం కోరేది అని నీకు తెలుసా అని?" అరిచాడు వా.వి. చా.

వెంకట్రావు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. వాస్తంటే మరో అర్థం వినపడిందే అనుకున్నాడు.

"అప్రాచ్యుడా జుట్టు పెంచుకోగానే వాస్తు పండితుడివి కాలేవు" అరిచాడు వాస్తుభూషణం.

"మూర్ఖుడా గడ్డం పెంచగానే వాస్తు నిపుణుడివి కాలేవు " అదే స్థాయిలో అరిచాడు వా.వి.చా.

"నీ బిరుదులన్నీ బూటకం "

"నీ బిరుదులన్నీ నాటకం."

"నా మాట వినకపోతే వెంకట్రావు గారు కుష్టువ్యాధితో కుచించుకుపోతారు."

"నా మాట వినకపోతే సుందరిగారు క్షయవ్యాధితో క్షయించిపోతారు"

"నా మాట కాదంటే వెంకట్రావు గారు కళ్ళులేని కబోది అవుతారు"

"నా మాట వినకపోతే సుందరిగారు బిడ్డలు లేని గొడ్రాలవుతారు"

"నా మాట వినకపోతే వెంకట్రావు గారు కాళ్ళు విరిగి కుంటి వాడౌతారు" సుందరి, వెంకట్రావు దడదడలాడుతూ ఇద్దరి వంకా మాటమాటకు చూడసాగారు వాస్తు పండితులిద్దరూ అదేం చూడకుండా వాగ్యుద్ధం కొనసాగించారు.

"నువ్వు పరమ మూర్ఖుడివి"

"నువ్వు పరమ ధూర్తుడివి."

"నువ్వు నీచుడివి"

"నువ్వు నికృష్టుడివి"

"నువ్వు లుచ్చావు"

"నువ్వు బద్మాష్ వి "

"అబద్దాల వల్ల నీ నోరు పడిపోతుంది"

"నీ మోసాల వల్ల నీ నాలుక తెగుతుంది"

"పళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నాకు కోపం వస్తే నీ పేగులు తీస్తా "

"నాకు మండిందంటే నీ గుండె చీల్చి రక్తం జుర్రుకుంటాం"

"నేను తెగించానంటే నీ మెదడు బయటకు లాగి నేతిలో వేయించుకు తింటా"

"నేను తెగిస్తే నీ తలను ఒక్క వేటులో నరికి ఈ యింటి గుమ్మానికి గుమ్మడికాయలా వేలాడదీస్తా"

"రేయ్" పెద్దగా అరిచి జేబులోని రివాల్వర్ తీసి గురిపెట్టాడు వాస్తు భూషణం.

"ఏంది బే" గర్జించి వీపు వెనుక దాచుకున్నా ఏకే 47 బయటకు తీశాడు వా.వి.చా. వారి వాలకం ఆగ్రహావేశాలు చూసి దంపతులిద్దరూ వణికిపోయారు ఇరువురి కళ్లలో నీళ్ళు వరదలై పొంగింది అమాంతం ఇద్దరూ చెరొకరి పాదాలను చుట్టేసుకున్నారు.

"అన్నా అన్నా మీకు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు. మా ఇంటి వాస్తు బాగాలేదని మీరు చెప్పిన మాటలు ఇప్పుడే నిజమయ్యేట్లున్నాయి. మీరిద్దరూ ఇక్కడ ఏమైనా అఘాయిత్యాలు చేస్తే మేము వెళ్ళి జైయిల్లో కూర్చోవాలి" భోరుమన్నాడు వెంకట్రావు.

"అవునన్నా మీ ఇద్దరి మాటలు వింటాం ఇల్లంతా కూల్చి పారేస్తాం మీరిద్దరూ ఒకరినొకరు కాల్చుకోవద్దు మాపరువు మంట గలపద్దు చెల్లెలాంటి దాన్ని నామాట విని బయటకు వెళ్లండి" కన్నీళ్ళతో పాదాలను తడిపింది సుందరి.

"మీరు వాస్తు ఫలితాలు చెబుతున్నారో లేక శాపనార్థాలు పెడుతున్నారో మా కర్థం కావడం లేదు మీరు చెప్పినవన్నీ జరిగితే మాకు ఆత్మహత్యే శరణ్యం ఆ బ్రతుకులు మేము బ్రతకలేము దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి" పెద్దగా ఏడ్చాడు వెంకట్రావు.

వాస్తు భూషణం. వా.వి.చా. ఒక నిముషం ఆలోచించారు. అవును అదీ నిజమే పదరా బయటకు పద నీ అంతు చూస్తా అన్నాడు వాస్తు భూషణం "పద నీ ఎముకలు ఏరి మెడలో వేసుకుంటా" బయటకు నడిచాడు వా.వి.చా.

ఇద్దరూ బయటకు వెళ్ళారు.

"హమ్మయ్య" ఊపిరి పీల్చుకున్నారు దంపతులు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)