Yeluka Vacche Illu Bhadram 51
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 51
ఇలపావులూరి మురళీమోహన రావు
"అయ్యో.. సిలెండర్ తూర్పున ఉంచారా? తూర్పున పెట్టిన సిలెండర్ అగును అతి పెద్ద బ్లండర్ అని సింగపూర్లో చెప్పా. అరెరె! ఈ మోరీ ఇటు వైపు పెట్టారా? ఈశాన్యం చూసే మోరీ జేబులు శూన్యం చేసే గోరీ అని సోమాలియాలో గొంతు చించుకున్నాను. వినలేదా?" అన్నాడు వాస్తుభూషణం.
"అవునండీ. అందుకే కాబోలు ఈ మధ్య మీ దగ్గర అసలు డబ్బులే మిగలడం లేదు." అన్నది సుందరి వెంకట్రావుతో.
"అరెరె..దేవుడి విగ్రహం వాయువ్యాన ఉంచారా! ఘోరం. ఉంటే వాయువ్యాన విగ్రహం మనిషి కోల్పువును నిగ్రహం అని నిజామాబాద్ సభలో అన్నాను."
"నిజమేనండీ ఈమధ్య నాకు ఉత్తిపుణ్యానికే చచ్చే కోపం వస్తున్నది." అన్నాడు వెంకట్రావు.
"అబ్బెబ్బే... ఇదేంటి ఈషెల్ఫును ఈ వైపుంచారు? ఛ ఛ... ఈ ఫ్రిజ్జునిటుంచారేంటి? అరె! ఈ గోడలో మూలకోణం వంకరొచ్చిందే... వంటింట్లోనే ఇన్ని లోపాలుంటే ఇక ఇల్లంతా ఎన్ని లోపాలతో నిండి ఉందో ముందు బెడ్ రూమ్ కు పదండి" దారి తీశాడు వాస్తుభూషణం. దంపతుల గుండెలు గుబగుబ మంటున్నాయి.
"అర్రెర్రెర్రె... కిటికీ నైరుతిలో పెట్టారేంటి? ఉంటే కిటికీ నైరుతిలో పడక తప్పదు యజమాని గోతిలో అని గోవాలో గొంతు చించుకున్నాను. అయ్యో..అయ్యొ..బాత్ రూమ్ ఐదు బై ఆరు వేశారేంటి? నాలుగు బై ఏడు గదా ఉండాల్సింది. తగ్గినచో బాత్ రూమ్ పొడవు మల బద్దకములు వీడవు అని మాంఛేష్టర్లో చెప్పాను. ఛ ఛ...లెట్రిన్ బేసి తూర్పు పడమరలుగా పెట్టారండీ? ఉత్తర దక్షిణాలు కదా ఉండాల్సింది! అయ్యో.. రామ రామ! అటకను తూర్పున కట్టారేంటి? తూర్పునున్న అటక ఆరోగ్యం కటకట అన్నాను కంబోడియాలో. హా ...బీరువా దక్షిణాభి ముఖంగా ఉంచారేమిటి? ఉంటే దక్షిణాన బీరువా ఇంట్లో కరువుకు కరువా అని కర్నూలు జ్యోతిష్య మహాసభలో కంఠం చించుకుని చెప్పానే.
" రకరకాల ఎక్సప్రెషన్స్ ఇవ్వసాగాడు వాస్తుభూషణం. గుటకలు మింగ సాగారు దంపతులు. పెరట్లోకి నడిచాడు వాస్తుభూషణం దంపతులు అనుసరించారు.
"ఆగ్నేయాన్నానుకుని టాయ్ లెట్లా? మైగాడ్! ఆగ్నేయం చూసిన టాయ్ లెట్లు దంపతుల మధ్య పెంచు సిగపట్లు అని సింగపూర్లో చాటాను గదా! వాటర్ టాప్ ఈ దిక్కున పెట్టారా! దక్షిణం పారే నీరు తక్షణం వ్యాధులు చేరు అన్నాను వంగ దేశంలో వినలేదా?"
"వినపించలేదండీ" వణుకుతూ చెప్పాడు వెంకట్రావు.
"ఈ బాత్రూమ్ రెండడుగులే ఉందేంటి? ఎవడు చెప్పింది? ఉంటే బాత్రూమ్ రెండడుగులు వంటి రోగాల పిడుగులు అని ఫిజీలో చెప్పాను. ఈ దొడ్డి వాకిలి వద్ద రెండు మెట్లు కట్టారేంటి? ఒకటే కదా ఉండాల్సింది! వాకిలి వద్ద కట్టిన రెండు మెట్లు తప్పించును కీళ్ళ వద్ద జాయింట్లు అని జాంబియా సభలో నెత్తీ నోరు కొట్టుకున్నానే ణా నెత్తి పగిలింది గానీ ఎవరూ విన్నట్లు లేదే!" తల బాదుకున్నాడు వాస్తుభూషణం. వణికిపోసాగారు దంపతులు. అంతా ఈయన వల్లనే వచ్చింది. ఇంటిని కట్టేముందు ఎవరైనా మంచి వాస్తు పండితుడికి చూపించమని చెప్పి చెప్పి నానోరు నొప్పి పుట్టింది. ఎవడో పనికి మాలిన అంట్ల సన్నాసి ఉప్పరి వెధవ రాసిన పుస్తకం తెచ్చి దాన్ని బట్టి ఇల్లు కట్టించాడు." కళ్ళు తుడుచుకుంటూ అన్నది సుందరి.
" అడ్డమైన గాడిదలు రాసిన దాన్ని చదివి నమ్మడమేనా? ఏం పుస్తకమమ్మా అది?" నవ్వుతూ అన్నాడు వాస్తుభూషణం.
"ఏదో వాస్తు విజ్ఞాన చింతామణి అని ఎవడో అణాకానీ వెధవ రాశాడు. పేజీలు నలభై. రేటు మాత్రం నూట అరవై. జనాన్ని దోచుకునే దొంగ గాడిదలు." తిట్టిపోసింది సుందరి.
గత్తుకుమన్నాడు వాస్తుభూషణం.
"ఆ..ఆ ..ఆ.." నత్తలు కొట్టసాగాడు.
వెంకట్రావు సుందరి చెయ్యి పట్టుకుని అవతలకు లాక్కెళ్ళి "బుద్ధి లేకుండా మాట్లాడకు. ఆ పుస్తకాన్ని రాసింది ఈయనే." చెవిలో గొణిగాడు.
సుందరి గుటకలు మింగింది.
"ఆ చూడమ్మా. వాల్మీకి రామాయణం రాశాడు. వ్యాసుడు భారతం రాశాడు. ఆ తరువాత అనేక మంది రచయితలు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేస్తూ మళ్ళీ వందలకొద్దీ రామాయణాలు, భారతాలు రాశారు. అలాగే అనుభవజ్ఞులైన నాలాంటి వాస్తు శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు ప్రకృతిని పరిశీలించి పరిశోధించి కనిపెట్టిన రహస్యాలు, వింతలు, విశేషాలు గుచ్చిగుచ్చి సామాన్య ప్రజలకు అందజేస్తాం. కేవలం గ్రంద పఠనం సరిపోదు. ప్రాక్టికల్ నాలెడ్జి చాలా అవసరం. ఈత కొట్టడం ఎలా అనే పుస్తకం చదివి వెంటనే గోదావరిలో దూకితే ఏమౌతుంది? భద్రాచలంలో బాడీ తేలుతుంది. ఇదీ అంతే. సరే పదండి. మేడపైన చూద్దాం" మెట్ల వైపు దారీ తీశాడు వాస్తు భూషణం మొదటి మెట్టును చూడగానే ఏదో పాము అడ్డం వచ్చినట్లు ఠక్కున ఆగాడు వాస్తుభూషణం.
"అరె మొదటి మెట్టు దక్షిణం చూస్తున్నదే! ఇది అతిపెద్ద దోషం దక్షిణం చూస్తున్న మెట్టు పక్షవాతం తెచ్చిపెట్టు అన్నాడు తెనాలి సభలో అర్రెర్రెర్రె ఇదేంటి ఎనిమిది మెట్ల తరువాత ప్లాట్ ఫామ్ కట్టారు? దోషం కదా! అయ్యో ఈపిట్టగోడేమిటి రెండగుళాల మందంతో కట్టారు? మందం లేని పిట్టగోడ ప్రగతికి అడ్డుగోడ అన్నాను అమెరికాలో ఇదేంటి వాయువ్యం వైపు మెరకైంది ? వాయువ్యం పెట్టిన మెరక పర్సులో మిగల్చదు గడ్డి పరక అన్నాను గాటిమాలాలో ఛీ ఛీ ఇదేంటి? ఉత్తరం వైపున్న సీకులకు ఇటుకలు పెట్టి ప్లాస్టరింగ్ చేశారు? ఏ గాడిద కొడుకిచ్చాడీ వెధవ సలహా?" కోపంగా అన్నాడు వాస్తుభూషణం.
"అ అ అవి వర్షానికి తుప్పు పడతాయని అలా కట్టించమన్నాడు మా సూపరెంటెండెంట్ ఇంజనీర్ గారు అందుకని " సంజాయిషీ ఇచ్చాడు వెంకట్రావు.
"ఇంజనీర్లకేం తెలుస్తాయి ఇటుకలు సీకుల సంగతులు? తుప్పు పడితే మాత్రం? ఆఫ్ట్రాల్ వందరూపాయలు విలువ చెయ్యని ఇనుప చువ్వలు! వాటి కోసమని పదిలక్షలు విలువ జేసే ఇల్లు నాశనం చేసుకుంటారా? లండన్లో ఏం చెప్పాను? ఉత్తరం మూసిన సీకులు వృద్ధిని చెండాడే చాకులు అని చెప్పాను తుప్పు పట్టే చువ్వల కోసమని ఇంత పెద్ద తప్పు చేస్తారా!" అని వాటర్ ట్యాంకు వైపు నడిచాడు వాస్తుభూషణం.
"[పుస్తకాన్ని చదవడం కూడా రాదు ఇన్ని పొరపాట్లా ఈ చిన్నకొంపలో" కోపంగా అన్నది సుందరి భర్తను చూసి "అసలే నా మూడంతా పాడైంది నువ్వు అరవమాకు" విసుక్కున్నాడు వెంకట్రావు.
అది విని తృప్తిగా ఫీలయ్యాడు వాస్తుభూషణం. "ఒరెరెరె! ఈ వాటర్ ట్యాంక్ ఇంత పెద్దదిగా ఏదో బావిని నిర్మించినట్లు కట్టించారేం? అదీ ఆగ్నేయమూల! మీ ఇంట్లో గ్యాస్ సిలెండర్ ఎన్నాళ్ళొ స్తుందమ్మా" అడిగాడు వాస్తుభూషణం.
"నెలరోజులొస్తుంది సార్" చెప్పింది సుందరి.
ఎలా వస్తుంది? ఇదే ట్యాంకు నైరుతి మూల ఉంటే గ్యాస్ రెండు నెలలొచ్చేది" అన్నాడు వాస్తుభూషణం.
వ్యాసుకి, వాటర్ ట్యాంకుకు సంబంధమేంటో బుర్రలుబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు వెంకట్రావుకు. అయ్యో అయ్యో అయ్యో ఇదేంటండీ ఈ తూము! ఇంత చిన్నదిగా ఉందేం కనీసం ఎలుక దూరే సందు కూడా లేకుండా?" అటుండగానే కెవ్వున అరిచింది సుందరి.
"ఏవైందమ్మా" కంగారుగా అన్నాడు వాస్తుభూషణం.
"ఆ అహ ఏం లేదు సార్ ఎలుకంటే మా ఆవిడకు ఎలర్జీ అసలు మా కష్టాలన్నింటికీ మూలకారణం ఆ పాడు ఎలుకే" అన్నాడు వెంకట్రావు.
"ఐసీ వర్షపు నీరు ధారాళంగా పారాలంటే కనీసం పిల్లి కూనైనా పట్టేంత రంధ్రం మళ్ళీ కెవ్వున అరిచింది సుందరి మళ్ళీ ఏమైందమ్మా" గాభరాగా అన్నాడు వాస్తుభూషణం "స్వామీ ఆ పిల్లి ఊసెత్తకండి ఆ ముదనష్టపు పిల్లి వల్ల సర్వ నాశన మయ్యాం" అన్నాడు వెంకట్రావు.
తలపంకించి ఆలోచనలో పడ్డాడు వాస్తు భూషణం. "పోనీయండి జంతువులనొదిలెయ్యండి కనీసం మనిషి చెయ్యి పట్టేంతకంతయినా ఉండాలి కానీ ఈ తూములో చిటికిన వేలు కూడా దూరదు సన్నని రంధ్రపు తూము కీర్తిని కాటు వేసే పాము అన్నాను పాలస్తీనా తెలుగు మహాసభలలో క్లింటన్ సెక్స్ స్కాండల్లో ఇరుక్కుంటాడని వైట్ హౌస్ లోని తూములు చూసి ఎపుడో చెప్పాను" అన్నాడు.
ముగ్గురూ కిందికి వచ్చారు "దక్షిణం వైపు కాళీ స్థలం ఐదడుగులు వదిలారు తూర్పు వైపు ఐదున్నరడుగులు మాత్రమే వదిలారు కనీసం ఆరడుగులైనా ఉండాలి దీనివలన మీకు రావలసిన ప్రమోషన్లు ఆగిపోతాయి. దక్షిణాన తరిగిన స్థలము ఉద్యోగం పాలిట విషం అని విజయనగరంలో గంటకొట్టి చెప్పాను"
"అవునండీ ప్రమోషన్ సంగతి దేవుడెరుగు, రావల్సిన ఇంక్రిమెంట్లు కూడా రాలేదు."
"అదే నాయనా వాస్తు భూషణం వెంకట్రావు ఆలోచనలో పడ్డాడు. ఇంతకు ముందు తమ సూపర్నెంట్ మరేదో నిర్వచనం ఇచ్చినట్లు గుర్తుంది.
(ఇంకావుంది )
(హాసం వారి సౌజన్యంతో)