Yeluka Vacche Illu Bhadram 50
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 50
ఇలపావులూరి మురళీమోహనరావు
"తేలేదు స్వామీ మర్చిపోయొచ్చాను"
"అదీ వాస్తులోపమే నీ ఇల్లు ఏ ముఖం?"
"తూర్పు ముఖం స్వామీ"
"దిక్కులు, విదిక్కులు ఏంటీ?"
"దిక్కులు నాలుగని తెలుసు కానీ విదిక్కులు ఏమిటో తెలియవు స్వామీ"
"వాస్తు లోపం ఉంటే ఇంటి యజమానికి ఇలాంటివి తెలియవు ఆయం ఏంటి?"
"ఈ ఆయాలు గాయాలు నాకు తెలియవు స్వామీ" నిట్టూర్చాడు వాస్తు భూషణం కళ్ళు మూసుకుని తల పైకెత్తి చేతి వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తూ దీర్ఘంగా ఆలోచించాడు.
రెండు నిముషాల తరువాత తల దించాడు.
"ఆ నీ ఇల్లు చూశాను నాయనా" అన్నాడు.
"ఎప్పుడు స్వామీ" అన్నాడు వెంకట్రావు ఆశ్చర్యంగా.
"ఇప్పుడే మనో నేత్రంతో చూశాను నీ ఇంటికి ముందు వైపు ఎక్కువ వెనుక వైపు తక్కువ ఖాళీ స్థలం ఉంది".
"అవును స్వామీ అవును ఎలా తెలుసుకున్నారు?"
"పిచ్చివాడా ఇల్లు చూశానని చెబుతుంటే ఎలా తెలుసుకున్నారణి అడుగుతావేం? వాస్తు లోపం ఉంటే యజమానికి కాన్సన్ ట్రేషన్ ఉండదు నాయనా నీ ఇల్లు అనేక వాస్తు లోపాలతో నిండి ఉంది ప్రత్యక్షంగా చూసి మాత్రమే తగిన సలహా ఇవ్వగలను."
"తప్పకుండా స్వామీ రేపు రాగలరా?"
"హి హి పిచ్చివాడా డైరీ చూసి చెబుతాను" డైరీ తీశాడు వాస్తుభూషణం.
పేజీలు తిరగేశాడు.
"నాయనా మరో ఎనిమిది నెలల దాకా నాడైరీలో ఒక్క లైను కూడా ఖాళీ లేదు వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తారీఖున బుక్ చేసుకో రిసెప్షన్లో పదివేలు కట్టి నీ చిరునామా వ్రాసి బుకింగ్ నెంబర్ తీసుకో. మై గాడ్ మీరు అంత బిజీయా సరే స్వామీ వస్తాను "నీరసంగా లేచాడు వెంకట్రావు.
అంత వరకూ కుదరదు, రేపే రావాలని అడగకుండా వెళ్ళొస్తానని చెప్పడంతో ఖంగు తిన్నాడు వాస్తుభూషణం.
"ఆగాగు" వెళ్ళ బోతున్న వెంకట్రావుతో అన్నాడు.
"ఏమిటి స్వామీ అన్నాడు వెంకట్రావు."
"నీది మరీ అర్జెంటు కేసా"
"అవును స్వామీ ఎమర్జెంటు"
"అలాగా పాపం! ఎంతో దూరం నుంచి నమ్మకంతో నాదగ్గరకు వచ్చిన ఎమర్జెంటు కేసులను కొంచెం సింపధటిగ్గా కన్సిడర్ చేస్తాను మీది ఏగ్రామం?"
"గ్రామం కాదండీ ఈ భాగ్య నగరమే"
"మంచిది మీ ఇల్లెక్కడ?"
"ముర్కీపురం"
"ఇల్లు ఎంత పెట్టి కొన్నావు?"
"పది లక్షలు పోశాను స్వామీ"
"అయితే జస్ట్ ఇరవై వేలు కన్సల్టేషన్ ఫీజు కట్టి రశీదు తీసుకోండి రేపే వచ్చి చూస్తాను."
"ఇరవై వేలా?" నోరు తెరిచాడు వెంకట్రావు.
"అది చాలా తక్కువ మొత్తం నాయనా ఇంటికైన ఖర్చులో రెండు శాతం మాత్రమే వాస్తుకు ఆ మాత్రం ఎవరైనా పుచ్చుకుంటారు" అనవసరంగా గొప్పలకు పోయి ఆరు లక్షల దానికి పదిలక్షలు చెప్పినందుకు తనను తానే నిందించుకున్నాడు వెంకట్రావు. ఇప్పుడు ఆ మాట మారిస్తే ఛండాలంగా ఉంటుంది. కానీ అంత ఛార్జీ అంటే నసిగాడు.
" చూడు నాయనా మనం తిరుపతి వెళ్తాం ధర్మదర్శనం క్యూ నాలుగు కిలోమీటర్ల పొడవుంటుంది అప్పుడేం చేస్తాం? నలభై రూపాయల క్యూకు వెళ్తాం అక్కడ మూడు కిలోమీటర్ల క్యూ ఉంటుంది మనకవతల ట్రెయిన్ టైం అవుతుంది అప్పుడేం చేస్తాం? వందరూపాయలకు క్యూకు వెళ్తాం అక్కడ రెండు కిలోమీటర్ల పొడవు క్యూ వుంటుంది. మనకవతల ట్రెయిన్ టైమై పోతూ ఉన్నది టెన్షన్ పెరుగుతుంది అప్పుడేం చేస్తాం? రెండువేల ఐయిదు వందలు పెట్టి కళ్యాణం టిక్కెట్టు కొని గంటలో బయట పడతాం అంతే కదా! ఇక్కడా అంతే! ఎనిమిది తొమ్మిది నెలలు ఆగి లక్షల్లో నష్టపోయే కంటే ఇరవై వేలు అవతల పారేసి లాభ పడటం మంచిది కదా!" అన్నాడు వాస్తు భూషణం.
"అలాగే నండి రేపు ఉదయం రండి లేచాడు వెంకట్రావు. వాస్తు ఫల ప్రాప్తిరస్తు" దీవించాడు వాస్తుభూషణం.
* * *
మనింట్లో కచ్చితంగా ఏదోక వాస్తులోపం ఉండి తీరుతుంది లేకపోతే ఈ విధంగా డబ్బు వదలడం జరగదు శతక కారుడేమన్నాడు? సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరి మింగిన వెలగ పండు కరిణిని సుమతీ! అంటే లక్ష్మి అనేది "అబ్బ ఆపండి ఆవెధవగోల! అర్థమైందిలెండి" వెంకట్రావు సన్యాసాన్ని మధ్యలోనే ఖండిస్తూ అన్నది సుందరి విసుగ్గా .
"అదేంటోయ్ అంత కోపం? శతకంలో చెప్పింది మనకెలా సరిపోతున్నాదో చెబుతుంటే " నవ్వుతూ అన్నాడు వెంకట్రావు.
"మేము చదివేం ఆ శతకాలు చిన్నప్పుడు ఇదేమైనా కవి సమ్మేళనమా కవిత్వం చదివి అర్థాలు తాత్పర్యాలు చెప్పడానికి? నాకూ తెలుసు" కోపంగా అన్నది సుందరి.
"వెధవ డబ్బు పోతే పోయింది గానీ కోపంలో నీ అందం ద్విగుళం బహుళం అవుతుందోయ్."
"సంతోషించాం గానీ ఈ భోషాణం ఇంకా రాలేదేంటి?"
"భోషణమా?"
"ఈ పాటికీ రావాలే?" ఇంతలో కాలింగ్ బెల్ మోగింది వెంకట్రావు తలుపు తీశాడు.
ఎదురుగా వాస్తుభూషణం!
"ఓ..వచ్చారు ..వచ్చారు ..రండి ..రండి..నమస్కారం. దయచెయ్యండి." ముఖాన నవ్వు పులుముకుని స్వాగతం చెప్పాడు వెంకట్రావు.
"వాస్తు ఫల ప్రాప్తిరస్తు" లోలపకొచ్చాడు వాస్తుభూషణం.
" ఈవిడ నా భార్య సుందరి." పరిచయం చేశాడు వెంకట్రావు.
"వాస్తు లాభమస్తు అమ్మాయి ముఖంలో దివ్య తేజస్సు ఉట్టి పడుతున్నది. దివ్యమైన జాతకమే కారణం" అన్నాడు వాస్తుభూషణం.
సుందరి ముఖం లక్ష వోల్టుల బల్బులా వెలిగింది. "నమస్కారం స్వామీ. రండి..రండి..మీ పేరు ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను దయచేయండి" ఆహ్వానించింది సుందరి.
"వాకిట్లో అడుగు పెట్టగానే వాస్తులోపాలు స్పష్టంగా అర్థమయ్యాయి మీ ఆర్థిక నష్టాలకు కారణాలు అవగతమయ్యాయి. ఎలుక రూపంలో వాస్తు పెద్దమ్మ మీ ఇంట్లో అడుగు పెట్టింది. అమ్మా కాసిని మంచి తీర్థం పట్రా తల్లీ" అన్నాడు వాస్తుభూషణం.
"అలాగే కాఫీ కూడా తెస్తాను స్వామీ."
"కాఫీ అలవాటు లేదమ్మా హార్లిక్సు పట్టుకురా."
"అలాగే స్వామీ."
లోపలి కెళ్ళి ఒక ట్రేలో మంచి నీళ్ళు గ్లాసుతో వచ్చింది సుందరి.
"తీసుకోండి స్వామీ." పక్కనే పిడుగు పడ్డట్లు ఉలిక్కి పడ్డాడు వాస్తుభూషణం.
"ఏమైంది స్వామీ ఇవి మంచినీళ్ళే." చెప్పింది సుందరి.
" అన్నన్నన్న..ఎంత పొరపాటు పని తల్లీ! గ్లాసును ట్రేకి ఈశాన్యం మూల ఉంచావే! ఈశాన్యం బరువెక్కువై నైరుతి తేలికై పోలేదా! ఈజిప్టులో నేనేమన్నాను?"
"తమరు ఈజిప్టు వెళ్ళారా? తెలియదు స్వామీ."
"హయ్యో. ట్రేలో ఈశాన్యముంచిన గ్లాసు కొంపలు ముంచును బాసూ అన్నాను. అలా పెట్టకూడదమ్మా చ్చొ చ్చో. చ్చొ ...చ్చొ" పెదవుల మీద చూపుడు వేలుంచి శబ్దం చేస్తూ అన్నాడు వాస్తుభూషణం.
"ఏమిటి స్వామీ విడ్డూరం! ట్రేలో పెట్టే గ్లాసుకు కూడా వాస్తుంటుందా!" ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావు.
నవ్వాడు వాస్తుభూషణం.
"వాస్తుకు ట్రే అని, ప్లేట్ అని తేడా లేదండీ, వాస్తు వాస్తే. భోజనం చేసేటప్పుడైనా సరే అన్నాన్ని నైరుతిమూల, భగభగ మండే పచ్చళ్ళను ఆగ్నేయ మూల, కాస్త కారంగా, కాస్త చప్పగా ఉండే కూరలను వాయువ్య మూల, అభికరించే పులుసు, పాయసం, నెయ్యి ఈశాన్యం మూల వడ్డించాలి పప్పును దక్షిణం వైపు, పులిహోరను పడమర వైపు, ఉప్పును ఉత్తరం వైపు, అప్పడాలను తూర్పు వైపు వడ్డించాలి. మంచి నీళ్ళ చెంబు పొరపాటున దొర్లితే తూర్పు నుంచి నీరు ఉత్తరం వైపు పారాలి. ఖాళీగా ఉన్న కంచం త్వరిత జీర్ణానికి ఇచ్చే లంచం నైరుతి ఖాళీగా ఉన్న కంచం రోగాలకు వేసే పట్టెమంచం అని వినలేదా?" క్షమించండి ఈ కవితను మేమెన్నడూ వినలేదు." అన్నారు దంపతలిద్దరూ కోరస్ గా.
"హయ్యో ఇది కవిత కాదమ్మా ఉగాండాలో నా ఉవాచ ఇది నా అనుభవంతో ఇలాంటివి ఇరవై వేల సూక్తులను తయారుచేశాను పదండి ఇల్లు చూద్దాం." లేచాడు వాస్తు భూషణం.
ముఖం గంభీరంగా పెట్టి తలను పైకి, కిందికి దించుతూ మూలలకు తిప్పుతూ పెదవులు విరుస్తూ, ప్చ్..ప్చ్.. సౌండ్లు చేస్తూ చేతులు వెనక్కు కట్టుకుని కళ్ళు విశాలం చేస్తూ, గట్టిగా మూస్తూ వివిధ భంగిమలు ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు.
దంపతలిద్దరూ ఎంతో టెన్షన్ తో అతని అడుగులో అడుగు వేస్తూ ఆగితే ఆగుతూ, వాస్తుభూషణం ఎటువైపు చూస్తే అటువైపు చూస్తూ నడవసాగారు.
వంటింట్లోకి నడిచాడు వాస్తుభూషణం "అయ్యయ్యో ఇదేమిటి ఈప్లాట్ ఫామ్ ఇంతెత్తును కట్టారు? శాస్త్ర ప్రకారం ప్లాట్ ఫామ్ ఎత్తు రెండడుగుల నాలుగంగుళాలకు మించరాదు. కానీ ఇది రెండడుగుల నాలుగున్నరంగుళాలుంది. ఎత్తైన వంటగట్టు పాకములను చెడగొట్టు అని పాకిస్తాన్ లో నొక్కి చెప్పాను" అన్నాడు.
"ఓహో అందుకే కాబోలు ఈ మధ్య నువ్వు ఏం వండినా కుదరడంలేదు సుందూ." అన్నాడు వెంకట్రావు సుందరి గుర్రుగా చూసింది.
(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)