Yeluka Vacche Illu Bhadram 49

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 49

ఇలపావులూరి మురళీమోహనరావు

"హెడ్డాఫీసు నుంచే"

"అక్కడి నుంచే"

"అయ్యో"

"హు...ఇలాగైతే ఇహ మనం అడుక్కుతిని పోవాల్సిందే" ఇలా కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు, వినే వాళ్ళకేమీ అర్థం కావడంలేదు. మెసేజ్ రావడం పూర్తయింది. ఆ మెసేజ్ చదివిన మేనేజర్ 'ఛీ' అని నలిపి అవతల పడేసి ముఖం గంటు పెట్టుకున్నాడు.

"ఏవైంది బాబూ" అడిగాడొకాయన.

"ఏముంది !దరిద్రం. షేర్ ఇండెక్స్ బాగా పెరిగిందట. భారత్ నుంచి ప్రతిరోజూ పది లక్షల కోళ్ళు, బంగ్లాదేశ్ నుండి ఐదు లక్షల మేకలు, పాకిస్తాన్ నుండి రెండు లక్షల పందులు, చైనా నుండి లక్ష కిలోల ఎండ్రకాయలు, సింగపూర్ నుంచి పన్నెండు టన్నుల కప్పులు దిగుమతి చేసుకోవడానికి జర్మన్ ప్రభుత్వం ఆదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందట.

అరగంట క్రితమే అగ్రిమెంట్ల మీద అందరు విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారట. అందువలన జర్మనీలో కోళ్ళ రేటు బాగా పడిపోయిందట. ప్రతి చికెన్ అయిటమ్ మీద టో పర్సెంట్ డిస్కౌంట్ ఇమ్మని మెసేజ్ వచ్చింది." చెప్పాడు మేనేజర్.

ఏదో మహాద్భుతం కళ్ళముందు జరుగుతున్నట్లు వింత పడుతున్నారందరూ.

"జర్మనీలో కోళ్ళరేట్లు తగ్గడమేంటో, దానికి హైదరాబాద్ లో డిస్కౌంట్ ఇవ్వడమేంటో నాకు అంత అయోమయంగా ఉన్నది. నాబుర్ర తిరిగి పోతున్నది. ఇక నేను మరణిస్తే బాగుంటుంది." బుర్ర తిరిగి పడిపోయాడొకాయన.

"ఇలా దిస్కౌంట్లిస్తే మా గతేం కాను?" దీన వదనంతో అన్నాడు మేనేజర్.

'డిస్కౌంట్' అన్న మాట వినిపించగానే అందరికీ పూనకం వచ్చేసింది.

"ఒక ప్లెయిన్ రైస్ " అందరి కంటే ముందు అరిచాడు వృద్ధుడు.

"ఒక చికెన్ బిర్యానీ"

"వన్ మటన్ పలావ్"

"వన్ కర్డ్ రైస్" కేకలు పెట్టసాగారు అందరూ.

వెంకట్రావు అవాక్కయాడు. గాంధీని, పొట్టి శ్రీరాములును స్మరించిన వారు, ఐకమత్యమే మహాబలమని, మన ఐక్యత చూసి పారిపోతున్నారు అని అందరికీ సలహా ఇచ్చి రెచ్చగొట్టిన వృద్ధుడే మొదటి ఆర్డరు ఇవ్వడం వెంకట్రావుకు కోపాన్ని తెప్పించింది.

"ఏవండీ...ఐకమత్యమే మహాబలం అని చెప్పిన మీరే ఇలా ఆర్డరివ్వడం బాగుందా" కోపంగా అన్నాడు వృద్ధుడితో.

"అవును నాయనా ఐకమత్యమే మహాబలమన్న పెద్దలే బతికుంటే బలుసాకు తిన వచ్చని కూడా చెప్పారు. పెద్దలు చెప్పిన మాటలు మనకెల్లప్పుడు శిరోధార్యాలే. ఇందాక టిఫిన్ చేశాం కాబట్టి ఐకమత్యమే మహాబలం సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు ఆకలికి తాళలేక ప్రాణం పోయే పరిస్థితుంది కాని బతికుంటే బలుసాకు తినవచ్చనే సామెత వర్తిస్తుంది. సమయానుకూలంగా సామెతలను అన్వయించుకునే వాడే బుద్ధిమంతుడు" చల్లగా చెప్పాడు వృద్ధుడు.

గాంధీ, నెహ్రూ, పొట్టిశ్రీరాములు లాంటి వారు ఎందుకు మహాత్ములయ్యారో, ప్రాతస్మరణీయులుగా ఎందుకు మిగలిపోయారో స్పష్టంగా అర్థమైంది వెంకట్రావుకు.

అలా అనుకుంటుండగానే వెంకట్రావు ఆత్మారాముడు చిందులెయ్యసాగాడు. తానింకా కేకలు వెయ్యనందుకు తిట్టిపోయసాగాడు యజమానిని.

తానేమీ మహాత్ముడుని కానని గుర్తించిన వెంకట్రావు 'వెజిటబుల్ బిర్యానీ' అని పెద్దగా అరిచాడు. క్షణాలలో బండిలోని గిన్నెలు ఖాళీ అయ్యాయి జనం జేబులు కూడా ఖాళీ అయ్యాయి.

"సాయంత్రం ఐదు గంటలకు స్నాక్స్ ఉంటాయి సార్" వార్నింగిచ్చి వెళ్ళిపోయారు బండివాళ్ళు. ఆమాట వినగానే దడువు జ్వరాలొచ్చాయి అందరికీ.

"ఇక మనమేమీ ఆర్డరివ్వకూడదు" త్రేన్చుతూ అన్నాడు వృద్ధుడు.

"సాయంత్రం అయిదు గంటల దాకా" వ్యంగంగా అన్నాడు వెంకట్రావు.

వృద్ధుడి ముఖం మాడింది. క్యూలో మరో నూటేభైమంది దాకా ఉన్నారు. సాయంత్రం అయిదైయింది. గంటలు మోగించుకుంటూ బండివాళ్ళు వాచ్చారు. నిమ్మకాయ సైజులో ఉన్న మైసూర్ బజ్జీలు, రెండగులాళ పొడవున్న మిర్చి బజ్జీలు, రేగిపళ్ళ సైజు పునుగులు ఉన్నాయి.

"ఎంత బాబూ" అడిగాడు వెంకట్రావు.

"మైసూర్ బజ్జీ ప్లేట్ కు నాలుగు సార్. ప్లేట్ అరవై రూపాయలు. మిర్చి బజ్జీ రెండు నలభై రూపాయలు. పునుగులు ప్లేట్ కు మూడుంటాయి. ముప్పై ఆరు రూపాయలు. ఆనియన్స్ కావాలనుకుంటే ప్లేట్ ఇరవై రూపాయలు." చెప్పారు వాళ్ళు.

"నాకో ప్లేట్ మైసూర్ బజ్జీలివ్వు" అన్నాడు వెంకట్రావు.

"నాకు మిర్చి"

"నాకు పునుగులు" మిగిలిన వారంతా కోరస్ పాడారు. పదిహేను నిముషాలలో బండి ఖాళీ అయింది.

* * *

తెల్లవారుజామున మూడున్నర గంటలకు వాస్తుభూషణం రూమ్ లోకి ప్రవేశించే అవకాశం దొరికింది వెంకట్రావుకు. వెంకట్రావు ముందు టైపిస్తున్నాడు. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య?" టైపిస్టు నడిగాడు వాస్తుభూషణం.

"స్వామీ...నాకు పెళ్ళై పదిహేనేళ్ళయింది."

"అందుకు నా బాధ్యతేమైనా ఉందా నాయనా? అది నీ ఖర్మ"

"లేదు స్వామీ"

"మరి నీ సమస్య?"

"ఇంత వరకూ పిల్లలు లేరు."

"నీ ఇంటికి ఈశాన్య వాస్తు దోషముంది నాయనా."

"నాకంటే ముందు ఆ ఇంట్లో ఉన్నాయనకు పన్నెండు మంది పిల్లలున్నారు స్వామీ."

"ఒక్క సంతానం కూడా ఉండకూడదని ఇంట్లో పన్నెండు మంది పుట్టారంటే అదీ వాస్తుదోషమే నాయనా."

"నా ఇంటి ప్లాను చూసి ఏం చేయాలో చెప్పండి."

"ఈశాన్యం వైపు గోడ ఎతైంది నాయనా దాన్ని రెండగుళాలు ఎత్తు తగ్గించు సంతానం కలుగుతుంది."

"థ్యాంక్సండీ. ఫీజు"

"ఐదువేలు కౌంటర్లో కట్టి వెళ్ళు నాయనా, రసీదు మెయిన్ గేట్లో చూపిస్తే బయటకు వెళ్ళనిస్తారు." ముఖం మాడ్చుకుని బయట పడ్డాడు టైపిస్టు.

వెంకట్రావు వంతు వచ్చింది.

"చెప్పు నాయనా ఏమిటి నీ సమస్య." అడిగాడు వాస్తుభూషణం.

స్వామీ... ఈ మధ్యనే పది లక్షలు పోసి ఇల్లు కొన్నాను.

"శుభం."

"ఏం శుభమో ఏమో ఇల్లు కొన్నప్పటి నుంచీ అన్నీ అశుభాలే."

"ఇంట్లోకి ఒక ఎలుక వచ్చింది."

"ఇల్లన్న తరువాత ఎలుకలు, బొద్దింకలు రాకుండా ఉంటాయా నాయనా? అవేమైనా కాకులా పిచ్చుకలా గూళ్ళు కట్టుకుని ఉండటానికి? వాటికి ఒక ఇల్లు ఉండాలి కదా?"

"అది కాదు స్వామీ...ఆ ఎలుక ఇంట్లో కొరుకుతాయా? అది వాటి సహజగుణం ఏదైనా మందు పెడితే పోయేది."

"పెట్టాం స్వామీ. కానీ"

"ఎలుక ఆ మందు తిన్నా చావలేదా?"

"మందు తిన్నదో లేదో కానీ ఆ మందును మాపాప తిన్నది వెంటనే వాంతులు, విరేచనాలయ్యాయి."

"మరి ఎలుకల మందు తింటే వాంతులు విరేచనాలు కాక గర్భాలు, ప్రసవాలు వస్తాయా నాయనా?" హాస్పిటల్ కు తీసుకెళ్తే సరిపోయేది."

"తీసుకెళ్ళాం స్వామీ. మందులు ఖర్చు పద్నాలుగువేలైంది."

"ఆ డాక్టర్ చాలా మంచి వాదులా ఉన్నాడు. అదే ఎన్నారైలు కట్టించిన హాస్పిటల్ కు వెళ్ళుంటే మీ ఇల్లు అమ్మేయాల్సివచ్చేది. తరువాత?"

"ఎలుక నివారణ కోసం పిల్లిని పెంచామండీ. అది ఆడపిల్లి."

"ఏ పిల్లయినా ఎలుకను తింటుంది నాయనా, అది వాటి సహజగుణం. మరి అది ఎలుకను చంపిందా?"

"చంపింది స్వామీ. కానీ అది కడుపుతో ఉన్న పిల్లి."

"సృష్టిలో స్త్రీ లింగానికే కడుపొస్తుంది నాయనా. అందులో వింతేముంది? అది సహజం దాన్ని ఎక్కడైనా వదిలి పెట్టివస్తే సరిపోయేది. అది కుక్కలా విశ్వాసమున్న జంతువు కాదు కదా తిరిగి రావడానికి!" వదిలేసొద్దామనే అనుకున్నాను. కానీ అది ఈ లోపలే ఆరు కూనలను ఈనింది.

"కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా నాయనా! అందులో వింతేముంది?"

"కంటే కన్నది కానీ వాటిలో ఒక కూన చచ్చింది స్వామీ."

"అదే సృష్టి విలాసం నాయనా. పిల్లులు, కుక్కలు, పందులు ఈనిన పిల్లలన్నీ బతికితే అవి ఉండటానికి ఈ భూగోళం సరిపోదు నాయనా. ఏ ఒకటో రెండో బ్రతుకు తాయంతే."

"పిల్లిని చంపితే లేదా ఇంట్లో చచ్చిపోతే మహాపాపం అని ఇరుగుపొరుగు చెప్పారు స్వామీ."

"జీవహింస మహాపాపమని బుద్ధ భగవానుడు మొదలగు వారు చెప్పింది వినలేదా నాయనా?" ఏదైనా శాంతి చేయిస్తే పోయేది కదా."

"అదే చేయించాం స్వామీ. అదే మా పాలిట పెద్ద అశాంతై పోయింది. మా కొంప గుల్ల చేసింది. శాంతి ఖర్చు ముప్పైవేలు అయింది. ఇలా ఖర్చు మీది ఖర్చు వచ్చి అల్లాడి పోతున్నాను స్వామీ."

"ఏదైనా వాస్తులోపం ఉంటేనే ఇలా ధన నష్టాలు వస్తుంటాయి. ఎవరికైనా వాస్తు చూపిస్తే పోయేది."

"అందుకే మీ దగ్గరకొచ్చాను స్వామీ."

"ఇప్పుడు దార్లోకి వచ్చావు. మనదేశంలో చాలా మందికి ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూపించాలంటే నిర్లక్ష్యం. ఇలా నష్టాలొచ్చినప్పుడు మాత్రమే వాస్తు పండితుల వద్దకు వెళ్తారు.

"రోగం వచ్చినప్పుడే కదా స్వామీ డాక్టరు దగ్గరకు వెళ్ళేది?"

"నిజం నాయనా రోగం వచ్చినప్పుడు డాక్టరు వద్దకు వెళ్ళడానికీ చాలా తేడా ఉంది నాయనా. నువ్వు చెప్పిన దాన్ని విన్న తరువాత రోగం చాలా ముదిరిందని అర్థమౌతున్నది. ఇంటి ప్లాను తెచ్చావా నాయనా?"

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)