Yeluka Vacche Illu Bhadram 48

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 48

టైం పది గంటలయింది బండివాళ్ళు అక్కడే అటూ ఇటూ బండిని తిప్పుతున్నారు “బాబూ రేట్లేమైనా తగ్గించగలరా?” అడిగాడొకాయన ధ్యైర్యం చేసి.

“సారీ సర్ అది మా చేతుల్లో లేదు ఈ రోజు ఈ రేట్లకే అమ్మాలని జర్మనీ నుంచి ఆదేశాలు అందాయి” ఆరేట్లకు భయపడి ఎవ్వరూ కొనకపోతే?”

“కంపెనీకి లాస్ దాన్ని ఎలా పూడ్చుకోవాలో వాళ్ళే చూసుకుంటారు”

“అంత రెట్లు చెబితే ఎవరూ పట్టుకోరా?”

“ఎందుకు పట్టుకుంటారు? మా ఉత్పత్తులు మావి ఇష్టమొచ్చినట్లు అమ్ముకుంటాం కొని తీరాలని ఎవరినీ బలవంతం చెయ్యడం లేదు కదా” పది నిమిషాలు గడిచాయి ఆకలికి తట్టుకోలేక కొంతమంది సందిగ్ధంలో పడ్డారు దానికి తోడు క్యాంటీన్ కుర్రాళ్ళు వీరి ముందే చట్నీలో తిరగమోతలు వేస్తున్నారు.

వేసినప్పుడల్లా కమ్మని వాసన ‘గుప్పు’ మణి కొడుతున్నది సాంబారు కలియబెడుతుంటే పప్పు వాసన ముక్కుల్లోకి దూరుతూ పేగుల్ని మెలిబెడుతున్నది ఇడ్లీ పాత్ర మూతను రెండు నిముషాలకోసారి ఎత్తి పెడుతుంటే ఇడ్లీ ఆవిర్లు లాలాజలాన్ని ఊరిస్తున్నాయి కాలుతున్న పెన్నంమీద వేళ్ళతో చిలకరిస్తుంటే ‘సుయ్ సుయ్’ మణి శబ్దం వస్తూ నాలుకను రెచ్చ గొడుతున్నది ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి కసకస శబ్దం చేస్తూ సన్నగా తరుగుతుంటే ఆ వాసనకు అందరూ గుటకలు మింగుతున్నారు చిక్కని డికాక్షన్ ను వీరి ముందే గ్లాసులతో నురగలొచ్చేట్లు తిరగబోస్తున్నారు.

జనాన్ని రెచ్చగొట్టడానికి కావాలనే వారు అలా చేస్తున్నారని అందరూ గ్రహించారు వాటికి లొంగిపోవడానికి ఎవరికీ మనస్కరించడం లేదు. పదిన్నరయింది కుర్రాళ్ళు అక్కడ్నుంచి వెళ్ళలేదు తమ పనులను ఆపలేదు “

"దూరం నుంచి వడలను చూడగానే నోరూరింది రేటు వినగానే గుండె దడదడ లాడింది ణా తరంలో ఇంతింత రెట్లు వింటానని కలలో కూడా అనుకోలేదు “నీరసంగా అన్నాడు టైపిస్టు.

“నిన్ననే మా ఆవిడ పూరీలు చేసి ప్లేటులో డజను పెట్టిస్తే పూరీలు పొంగలేదని మా ఆవిడ చెంపలు పగలగోట్టాను ఇప్పుడు తెలుస్తున్నది వాటి విలువ” ఓ నడివయస్కుడు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

“పావుకిలో ఉల్లిపాయలు తరిగి మా ఆవిడ ఊతప్పం వేసిస్తే ఉల్లిముక్కలు చాలలేదని విసిరి నేలకేసి కొట్టాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” ఘోల్లుమన్నాడు మరొకాయన.

కనీసం కాఫీ తాగుదామనిపించింది వెంకట్రావుకు “కప్పు కాఫీ ఎంత?” అడిగాడు.

“సింగిల్ కాఫీ ముప్పై రూపాయలు పుల్లయితే ఏభై రూపాయలే టీ సింగిల్ ఇరవై, ఫుల్ నలభై బ్రూ కాఫీ తొంభై, హార్లిక్స్ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండీ” జవాబిచ్చాడు బండివాడు.

గుండెలు బాదుకున్నారంతా “ముప్పై రూపాయలకు పావుకిలో కాఫీ పొడి వస్తుంది”

“నలభై రూపాయలకు అరకిలో టీ పొడి వస్తుంది”

“తొంభై రూపాయలకు నూటాయాభై గ్రాముల బ్రూ వస్తుంది గదయ్యా”

“నూటరవై రూపాయలకు ముప్పావు కిలో హార్లిక్స్ కొనొచ్చు” అందరూ కామెంట్లు చేశారు .

“మాట్లాడరేవయ్యా” అరిచాడు వెంకట్రావు .

“సారీ సారీ వాదనలు చెయ్యడం పెసర్దోస్ గ్రూపు రూల్సుకు విరుద్ధం మేము ఎంతో వినయ విధేయతలతో మెలగాలని మాకు ట్రెయినింగిస్తారు ఒక వేళ భూమి గుండ్రంగా కాదు నలుచదరంగా ఉంటుంది అని మీలో ఎవరైనా అంటే మేము సరే అంటాం తప్ప ఆయా ధరలకు వస్తే రావచ్చు దానికి మేము బాధ్యులం కాము” చెప్పాడు బండి మేనేజర్ .

“రోజుకు పదిసార్లు కాఫీ తాగేవాడిని నిన్న మా ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడు డికాక్షన్ పల్చగా ఉందని చావగొట్టి కాఫీని మోరీలో పారబోశాను హయ్యూ దాని విలువ ఎభై రూపాయలా? ఘోల్లుమన్నాడో యువకుడు క్యూ చాలా మందకొడిగా జరుగుతున్నది అందరి చూపులూ టిఫిన్ల వైపే ఉన్నాయి కానీ ఎవ్వరూ సాహసించి ఆర్డరివ్వలేకపోతున్నారు బండి వాళ్ళు కొత్తిమీర కట్టలు సన్నగా తరుగుతున్నారు దాంతో వాసన ఘుమాయించి కొడుతున్నది వెంకట్రావు అసలే భోజన ప్రియుడు ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు కాసేపు లెక్కలు వేసుకున్నాడు జేబులోంచి డబ్బులు జారిపోయాయని, పర్సు కొట్టేశారని, ఎవరికైనా దానం చేశానని, దేవుడి హుండీలో వేశానని ఇలా రకరకాలుగా అనుకుని మనస్సును సమాధాన పరుచుకున్నాడు .

‘బాబూ అర ఇడ్లీ, ఒక స్పూను సాంబారు ఇవ్వగలవా?” అడిగాడు గుటకలు మింగుతూ .

“సారీ సార్ మినిమమ్ ఒక్క ఇడ్లీ విత్ టి స్పూన్ సాంబార్, వన్ స్పూన్ ఇడ్లీ ఇంతకు తక్కువ ఆర్డర్లు తీసుకోవడం పెసర్దోస్ గ్రూప్ రూల్సుకు వ్యతిరేకం” చెప్పాడు బండివాడు .

ఆత్మారాముడు లోపల రంకెలు వేస్తుంటే అందరిలోనూ సహనం చచ్చిపోయింది “సింగిల్ పూరీ”

“సింగిల్ ఇడ్లీ”

“ప్లెయిన్ దోసె”

“సింగిల్ ఉప్మా”

అందరూ అరవసాగారు ధృఢకాయలు పరిగెత్తుకుంటూ వచ్చారు .

“సార్ తొందరపడకండి అందరికీ అన్నీ సప్లై అవుతాయి ఎవరికీ ఏ టిఫిన్ అందకపోయినా వీరి టెండర్ క్యాన్సిల్ చేసి జర్మనీకి తరిమేస్తాం” అన్నారు .

ఇంతలో ఒక కుర్రాడొచ్చాడు “సార్ టోకెన్లు తీసుకోండి సరిపడా చిల్లర ఇచ్చిముందు టోకెన్లు కొనుక్కోండి టోకెను ఉన్నవారికి టిఫిన్ గ్యారంటీ” అని పుస్తకం తీశాడు

అందరి దగ్గరా డబ్బులు తీసుకుంటూ టోకెన్లు ఇవ్వసాగాడు “బాబూ ప్లేటిడ్లీ, ప్లేటు వడ, ఒక కాఫీ ఇవ్వు” అన్నాడొక వ్యక్తి అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు

“సార్ టాటా బిర్లాలు తమరికేమైనా దగ్గరి బంధువులా? అడిగాడు వెంకట్రావు .

అతనిని “అదేం అలా అడుగుతున్నారు? నవ్వుతూ అడిగాడా వ్యక్తి .

“లేదు ఒకేసారి అంత ఖరీదైన టిఫిన్ అర్డరిస్తేనూ”

“ ఓహ్ ఆదా అంతకాదులెండి ఏదో తాతగారిచ్చిన ఐదారు ఇళ్ళు , ఓ వెయ్యకరాల పొలం ఉంది ఏదో పది కార్లు, ఏభై లారీలను అద్దెకు తిప్పుతూ అలా అలా నెట్టుకొస్తున్నాను అంతే” అన్నాడాయన.

“అబ్బా” అనుకున్నారందరూ మరి మీకేం తక్కువని వాస్తుకోసం వచ్చారు?” అన్నాడు వెంకట్రావు .

ఆశ్చర్యంగా “మొన్న రాయల్ భూటాన్ లాటరీ టిక్కెట్లు ఐదు రూపాయలు పెట్టి మూడు కొన్నాను వాటిలో ఒకదానికి మొదటి బహుమతి ఐదుకోట్లు వచ్చింది మిగిలిన రెండింటికి ఏమీ రాలేదు పది రూపాయలు నష్టం వాటిల్లింది అందుకని ఇంట్లో ఏదో వాస్తులోపం ఉందని అనుమానం అది తీర్చుకుందామని వచ్చాను” చెప్పాడతను .

ఆ సమాధానానికి కొందరి బుర్రలు గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో గిర్రున దభీమని పడిపోయారు వెంకట్రావు గుండె నూటిరవై సెకన్ల పాటు ఆగిపోయింగి మళ్ళీ తిరిగి పనిచెయ్యడం మొదలుపెట్టినా కొంచెం సేపటిదాకా మామూలు మనిషి కాలేకపోయాడు పదిహేను నిముషాలలో బండిమీద పదార్థాలన్నీ ఎగిరి ఎగబడి తిన్నారందరూ .

“సార్ అందరూ జాగ్రత్తగా వినండి ఒంటిగంటకు లంచ్ ఉంటుంది మీల్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాలి స్పాట్ ఆర్డర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్” అన్నాడు బండి మేనేజర్.

“చేసుకోక పోతే” అడిగాడు వెంకట్రావు.

"మధ్యాహ్నం పన్నెండు గంటలకు జర్మనీ ఎక్చేంజ్ లో ట్రేడింగ్ మొదలౌతుంది ఇండెక్స్ పెరిగితే రేట్లు తారుమారౌతాయి”

“వాట్! జర్మనీలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కి నీవు పెట్టే భోజనానికి లింకు ఏంటయ్యా?”

“స్టాక్ మార్కెట్ దేశ ఆర్ధిక వ్యవస్థకు దిక్సూచి ఒక దేశ ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయీ అని మార్కెట్ ఇండెక్స్ తెలియజేస్తుంది ఆర్ధిక వ్యవస్థ పతనమైతే అన్ని వస్తువులకు కొరత ఏర్పడుతుంది ఉన్న వస్తువుల ధరలు పెరుగుతాయి డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లయ్ తక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది”

“అబ్బ అది సరేలేవయ్యా ఆర్ధిక మంత్రులకే పారాలు చెప్పేట్లున్నావు ఇపుడీ సోదంతా ఎందుకు?”

“మా విలువైన కస్టమర్స్ క్షేమం కోరే సార్ ఎందుకంటే ఇప్పుడు నాలుగొందలున్న ప్లేటు మీల్స్ ఇండెక్స్ పడిపోతే ఆరొందలు కావచ్చు అందుకని”

“అంటే ఇప్పుడు ప్లేటు మీల్స్ నాలుగొందలంటావా?” గుడ్లు తేలేస్తూ అన్నాడు వెంకట్రావు .

“యస్సర్” వినయంగా అన్నాడు బండివ్యక్తి .

“ప్లేట్ మీల్స్ అంతుంటే మరి మిగతా వాటి మాటేంటి?” అన్నాడొకాయన.

“చెబుతాం సార్ ఫుల్ మీల్స్ ఆరువందలు వెజ్ బిర్యానీ ఏడొందలు, చికెన్ బిర్యాని మూడొందలు, మటన్ బిర్యానీ వెయ్యి రూపాయలు కర్డ్ రైస్ కేవలం మూడొందల నలభై నాలుగు రూపాయలే బాయిల్డ్ ఎగ్ నూట అరవై రూపాయలు ఆమ్లెట్ రెండొందలు నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా ఐదువందలే వెజిటబుల్ కర్రీస్ అయితే మూడొందలే పెసర్దోస్ స్పెషల్ జర్మన్ మీల్స్ రెండు వేలా రెండు వందలే” చెప్పాడు బండివాడు.

"హా కృష్ణా, యదు భూషణా! త్వరగా నీ సుదర్శనాన్ని నా మీద ప్రయోగించి నా తల మొండెం నుంచి వేరు చెయ్యవయ్యా” అరిచి విరుచుకు పడి పోయాడో వృద్ధుడు .

ఇంకావుంది

హాసం వారి సౌజన్యంతో