Yeluka Vacche Illu Bhadram 47

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

Eluka vacche illu badram 47

ఇలపావులూరి మురళీ మోహనరావు

"మరి వాస్తు భూషణం గారి డిమాండ్ ఏమనుకున్నారు? ప్రపంచంలోని అన్ని పెద్ద పెద్ద హోటల్ గ్రూపులు ఇక్కడ క్యాంటీన్ పెట్టడానికి టెండర్స్ వేశారు. చివరకు వీరి 'టెండర్ 'ది లోయస్ట్' అయ్యింది. నైన్టీనైన్ ఇయర్స్ కాంట్రాక్టిచ్చారు." చెప్పాడొక గార్డు.

తోపుడు బండి వాళ్ళు క్యూలను సమీపించారు. బేసిన్లలోని పదార్థాలను దగ్గరగా చూస్తే - ఇడ్లీలు రూపాయి బిళ్ళ మందం, సైజులో ఉన్నాయి. దోసెలు తమలపాకు కంటే సన్నాగా ఉన్నాయి. వడలు ఐదు రూపాయల బిళ్ళంత ఉన్నాయి. పూరీ అరచెయ్యి సైజులో ఉన్నాయి.

"అదేంటయ్యా బాబూ....ఇడ్లీలు మరీ అంత చిన్నవిగా ఉన్నాయి. వంద తిన్నా కూడా పంటి కిందకు రావు." అన్నాడొకాయన.

"ఆ దోసె లేంటి నాయనా...ఆకుల కంటే సన్నవిగా ఉన్నాయి. ఒకేసారి యాభై మడత పెట్టి నోట్లో పెట్టుకోవచ్చు." అన్నాడు మరొకాయన.

"ఇవేం వడలు స్వామీ..రేగుపళ్ళంతున్నాయి? రూపాయికి ఎన్నేమిటి?" అడిగాడు ఇంకొకాయన.

"పది ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు..."

"ఇరవై దోసెలివ్వు..."

"పాతిక వడలు పాతిక ఇడ్లీలివ్వు"

"పది పూరీలు" అందరూ కేకలు పెట్టసాగారు.

వెంకట్రావు దగ్గర బండి ఆగింది. "ప్లేటిడ్లీ ఎంత నాయనా" అడిగాడు వెంకట్రావు.

"నలభై రూపాయలు సార్" అన్నాడు బండివాడు.

"నేనడిగింది ప్లేటుతో పాటు కాదు నాయనా."

"నేను చెబుతుంది అదేనండి." అదిరి పడ్డాడు వెంకట్రావు.

"ప్లేటుకు ఎన్నిస్తారు?"

"రెండు"

"అంటే...రెండిడ్లీ నలభై రూపాయలా? అంటే ఒక్కోటి ఇరవై రూపాయలా?"

"మరి అంతే గదండి. ఒకటి ఇరవై అయితేనే రెండు నలభై. మూడు అరవై.నాలుగు ఎనభై. ఐదు వంద, ఆరు నూటిరవై..."

"అబ్బ ఆపవయ్యా...ఎక్కాలు మాకూ వచ్చులే. మరి మిగిలిన వాటి రేట్లు?..."

"ఇడ్లీ విత్ సాంబార్ ఏభై రూపాయలు. రెండు వడ ఎనభై రూపాయలు. ఒక ఇడ్లీ వడ ఏభై చట్నీతో ఇడ్లీ వందరూపాయలు. ఒక వడ ఒక ఇడ్లీ చట్నీతో అరవై, సాంబార్ తో డెబ్భై, చట్నీ సాంబార్ తో ఎనభై. చట్నీ, కారప్పొడితో ఏభై నాలుగు రూపాయలు. నెయ్యి కావాలంటే స్పూనుకు పదిహేను రూపాయలు. సింగిల్ పూరీ ఇరవై ఆరు రూపాయలు.

రెండు పూరీలైతే ఏభై నాలుగు రూపాయలు మాత్రమే. ప్లెయిన్ మినపదోసె అరవై రూపాయలు. ఆనియన్ దోసె ఎనభై రూపాయలు. రవ్వ దోసె నూట ఇరవై రూపాయలు. పెసరట్టు నూట ఏభై రూపాయలు. ఎక్సట్రా చట్నీ ఇరవై రూపాయలు. ఎక్సట్రా కుర్మా నలభై రూపాయలు ఇడ్లీ, వడ ప్లేట్ తిన్నవారికి ఒక స్పూన్ చట్నీ ఉచితం." మైకులో చెప్పారు వారు.

ఆ రేట్లు వినగానే క్యూలో ఉన్న సగం మంది మూర్చపోయారు. మరో సగం మంది గుండెపోటు రాకుండా గుండెను అదిమిపట్టుకున్నారు.

వెంకట్రావు స్వరపేటిక చలన రహితమైంది.

"ఏమిటింత రేట్లా?" అతి కష్టం మీద అడిగాడు.

"అవునండీ మా స్టాండర్డ్స్ అలా ఉంటాయి. మేము తయారు చేసే ప్రతి పదార్థంలోనూ ఇరవై శాతం మాంసకృతులు, ఇరవై శాతం విటమిన్స్, ఇరవై శాతం ఖనిజ లవణాలు, ఇరవై శాతం ప్రోటిన్స్, ఇరవై శాతం పోషకాహార విలువలు ఉంటాయి. ఇవి జర్మన్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి."

"రామ రామ! ఇడ్లీ వడలు కూడా జర్మన్ టెక్నాలజీతోనా! ఇటువంటి మాటలు ఈ జీవితంలో వింటానని కలకూడా కనలేదు." అన్నాడో వృద్ధుడు.

"కానీ ఈ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఇండియాలో ఏ ఫైవ్ స్టార్ల హోటల్లోనూ ఇంత రేట్లుండవే" అన్నాడు వెంకట్రావు.

"అవునండీ. ఇండియాలో ఉండకపోవచ్చు. కానీ జర్మనీలో టూ స్టార్ హోటల్లో ఉంటాయి. మాది సెవెన్ స్టార్ హోటల్. కానీ టూ స్టార్ రేట్లకే అమ్ముతున్నాం. వీటిలో వాడే ప్రతి ఇంగ్రేడియంటూ ఉప్పుతో సహా అన్నీ జర్మనీ నుంచే వస్తాయి. అంతా ఇంపోర్టెడ్." చెప్పాడు బండివాడు.

"ఓరినీ ఇల్లు దొంగలు దోలా...ఇండియాకు మూడు సముద్రాలున్నాయి. ఉప్పు దొరకదా?" అన్నాడో వ్యక్తి.

"దొరికితే మాత్రం వేస్తామా సార్? మాది ఇంటర్నేషనల్ గ్రూప్. ప్రపంచంలో ఎక్కడున్నా ఆ స్టాండర్డ్స్ మెయిన్ టెయిన్ చెయ్యాలి. నడి సముద్రంలో క్యాంటీన్ పెట్టినా పెసర్దోస్ వారి రూల్స్ ఒకటే." చెప్పాడు బండివాడు.

ఆకలితో కేకలు పెట్టిన వారెవ్వరూ కొనడానికి సాహించలేదు. అందరికీ కడుపులు దాహించుకుపోతున్నాయి. కానీ రేట్లు విన్న తరువాత అందరి మనసులు మరింత దహించుకుపోతున్నాయి.

(ఇంకా వుంది )

(హాసం సౌజన్యంతో)