Yeluka Vacche Illu Bhadram 46
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
Yeluka Vacche Illu Bhadram 46
ఇలపావులూరి మురళీ మోహనరావు
ఓ ఆదివారం ఉదయం వాస్తు భూషణాన్ని కలవడానికి వెళ్ళాడు వెంకట్రావు.
అది మామూలు ఇల్లుకాదు. జూబ్లీహిల్స్ లో పెద్ద పెద్ద బంగళాలను తలదన్నేట్లుంది. కాపౌండ్ వాల్ మీద వాస్తు శిరోమణి, వాస్తు చింతామణి, వాస్తు పురుషోత్తమా, వాస్తు రత్న, వాస్తు వజ్ర, వాస్తు పురుషోత్తమా, వాస్తు భయంకర, వాస్తు భూషణరావు, అని పాలరాతి అక్షరాలూ అందంగా చెక్కబడున్నాయి. ఇంటి ముందు దాదాపు రెండువందల కార్లు, నాలుగొందల స్కూటర్లు ఆగి ఉన్నాయి.
వెంకట్రావు తికమక పడ్డాడు. రెండు నిమిషాలు అటుఇటు చూశాడు. మళ్ళీ రోడ్డుమీద కెళ్ళి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపాడు.
"సార్...ఇక్కడ వాస్తుభూషణరావని వాస్తు పందితుడుండాలి. ఆయన ఇల్లెక్కడ?" అడిగాడు.
"ఆయన ఇంటి ముందు నిలుచుని ఆయన ఇల్లెక్కడ అని అడుగుతున్నారు. పాగల్ లెక్కన కనపడుతున్నానా?" కోపంగా అన్నాడతను.
"అబ్బే...అదికాదండీ. అర్థం కాకడిగాను. మరి ఈ వాస్తు చింతామణి, వాస్తు శిరోమణి...వారంతా ఎవరు? అందరూ కలిసి ఈ కంపెనీ పెట్టారా?"
"భలేవారు సార్ మీరు...ఒకడిచ్చేదేంటి? ఎవడికి వాడే ఇచ్చుకుంటాడు. ఒక కవి ఉంటాడు. నాలుగు పద్యాలు రాయగానే నన్నయ్యకు అన్నయ్యననుకుంటాడు. ఎవడూ సన్మానం చేయడం లేదని ఉడికిపోతుంటాడు.
చివరకు ఏ సాంస్కృతిక సంస్థ వాడినో పట్టుకుని నాలుగు వేలిచ్చి నలుగురి ముందు సన్మానం చేయించుకుంటాడు. వేదిక మీదుండే వాగుడు కాయల్లో ఎవడో ఒకడు ఈ కవిని మహాకవానో, కవి పుంగవుడనో వాగుతాడు. మర్నాటి నుండీ ఆ పదాలను వీడు బిరుదులుగా వాడుకుంటాడు."
"ఇంత వివరంగా చెబుతున్నారు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా?"
"నేను శివం ఆర్ట్స్ కల్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను. గత పదేళ్ళుగా ఇటువంటి బిరుదులు కొన్ని వేలమందికిచ్చాను. ఈయనకిచ్చిన బిరుదుల్లో నాలుగు నేనిచ్చినవే. ఇలాంటి వారి దయవల్ల ఇక్కడే రెండు కోట్లు పెట్టి బంగళా కట్టుకున్నాను. మార్నింగ్ వాక్ లో మంచి కాలక్షేపం కలిగించారు. థాంక్స్..." వెళ్ళిపోయాడాయన.
"గేటు తెరిచి లోపలకు వెళ్ళబోతుండగా 'రుక్ జావ్' అని వినబడింది. ఆగాడు వెంకట్రావు. ఆరడుగుల పొడవున్న ఆజానుబాహు గూర్ఖా వచ్చాడు. "క్యా చాహియే అడిగాడు.
"వాస్తు భూషణం గారి కోసం" చెప్పాడు వెంకట్రావు.
"కార్ పార్కింగ్ వంద రూపాయలివ్వండి" రశీదు పుస్తకం తీశాడు గూర్ఖా.
"నాకు కారు లేదండీ...."
"అయితే స్కూటర్ పార్కింగ్ ఏభై రూపాయలు. చించుతున్నా."
"వద్దొద్దు...నాకు స్కూటర్ లేదు."
"అయితే సకీల్ పార్కింగ్ పాతిక రూపాయలు చించనా?"
"వద్దొద్దు...నాకు సైకిల్ కూడా లేదు."
"అలాగా...అయితే ఇరవై నాలుగో కౌంటర్ దగ్గర అలా క్యూ అని ఉంటుంది. అక్కడ నిలుచోండి." వెంకట్రావును ఓ పనికిమాలిన వెధవను చూసినట్లు చూసి వెళ్ళిపోయాడు గుర్ఖా.
లోపలికి వెళ్ళాడు వెంకట్రావు. సినిమాహాల్లో బుకింగ్ కౌంటర్లున్నట్లు ఓ పెద్ద హాల్లో పాతిక కౌంటర్లున్నాయి. వెంకట్రావు ఆశ్చర్యంగా చూస్తూ నడవసాగాడు. ఉన్నట్లుండి క్యూలో కలకలం మొదలైంది.
"రేయ్...ఆగు...క్యూలోకి రా...మేమంతా వెర్రోళ్ళమనుకున్నావా? రేయ్ బాడ్కావ్...ఫీఛే ఆరే... బేవకూఫ్...ఎవయ్యో వెనక్కు రావయ్యా...లైన్లోనించో...యూ మేనర్లెస్ ఫెలో...వేరార్ యూ గోయింగ్...కమ్ బ్యాక్..." ఇలా రకరకాల భాషలలో దండకం వినిపించింది.
వెంకట్రావుకు భయమేసింది. కొంపదీసి తానేమైనా రౌడీల డెన్ లోకి రాలేదు కదా అని కంగారు పడ్డాడు. ఇంతలోనే ఇద్దరు దృఢకాయులు వెంకట్రావును పెడరెక్కలు విరిచి మేక పిల్లను ఈడ్చినట్టు ఈడ్వసాగారు. వెంకట్రావు భయంతో గావుకేకలు పెట్టాడు. అయినా వారు అదేమీ పట్టించుకోకుండా వెంకట్రావును మామూలుగానే ఈడ్చుకెళ్ళి క్యూ చివర నిలుచోబెట్టి వినయంగా వంగి నమస్కరించారు.
"సార్...క్షమించండి. వారంతా మీకంటే ముందు వచ్చిన వాళ్ళు. వాళ్ళను కాదని మీరు ముందు కెళ్ళడం అన్యాయం కదా! దయచేసి లైన్లో నించోండి. ప్లీజ్..." అన్నారు. వెంకట్రావు ఊపిరి పీల్చుకున్నాడు.
"ఓరి మీ వినయం మండిపోనూ. ఒక్క క్షణం గుండెఆగి గర్భంలోకి జారింది కదయ్యా. ఆ మాట ముందే చెప్పొచ్చు గదా..." అన్నాడు చిరుకోపంగా.
"ముందోసారి వెనకోసారి చెప్పడానికి టైం ఉండదు సార్...రేయ్...ఆగు..."అని మళ్ళీ మరోవైపు పరిగెత్తారిద్దరూ. వెంకత్రావుకీ పద్దతంతా వింతగానూ అయోమయంగానూ తోచింది. గంట గడిచినా క్యూ అంగుళం కూడా కదల్లేదు.
"మాస్టారూ..." ముందు నిలుచున్నతనిని కదిపాడు.
"నేను మాస్టారినీ కాదండీ. టైపిస్టును." అన్నాడతను.
"ఓహ్...సారీ...టైపిస్టుగారూ... "
"చెప్పండి"
"మీరెక్కడనుంచొచ్చారు?
" "ఇంటి నుంచి"
"హి..హి..అది సరే..ఏ ఊర్నుంచి వచ్చారని...?"
"వేరెవరి ఊరినుంచో ఎందుకోస్తాను? మా ఊర్నించే."
"హి..హి..హి...అఫ్ కోర్స్..ఎందు కొచ్చారూ అని."
"అరికాళ్ళు జిల పుడుతున్నాయి. నించుంటే దురద తీరుతుందని."
"హి...హి...భలేవారే...అదికాదు. మీ సమస్య ఏమిటని?"
"అది మీతో చెప్పడానికి కాదు మా ఊర్నోంచి వచ్చింది."
"హ...హ...భలే జోక్ వేశారు. ఊరికే తెలుసుకుందామని..."
"ఏమండోయ్...మీకేమీ పనిలేకపోతే రామ రామ రామ అనుకోండి. ఊరికే నన్ను విసిగించొద్దు" కోపంగా అన్నాడతను.
ఇక అతనితో మాట్లాడటం అనవసరం అనిపించింది వెంకట్రావుకు. వెనక్కు తిరిగి చూశాడు. మరో ఇరవై మంది ఉన్నారు. క్యూ మెల్లగా కదులుతున్నది.
"జనం చాలా మందున్నారు. అసలిక్కడి ప్రాసీజరేంటో?" అనుకున్నాడు.
"ఒక్కసారి ముగ్గుర్ని లోపలకు పంపుతారు. ముగ్గురి సమస్యలు విని ఐదునిమిషాల్లోబయటకు పంపేస్తారు అంతే." వెనక నిలుచున్న ముసలాయన చెప్పాడు.
"ఫీజెంత పుచ్చుకుంటారు?" "ప్రశ్నకు రెండు వేలు. స్పెషల్ గా ఇంటికి పిలిపించుకోవాలంటే వేరే ఛార్జీ ఇచ్చుకోవాలి."
"ఆయన బాగా చెప్పగలడంటారా?"
"చిన్నగా అంటారేంటి? గత జన్మలో విశ్వకర్మే ఈ జన్మలో వాస్తు భూషణరావుగా జన్మించారు. ఆయన ఏదైనా సలహా ఇచ్చారంటే సాక్షాత్తూ మయ సభ నిర్మించిన మయుడు కూడా మాట్లాడడు."
"అందుకే కాబోలు ఇంతమంది క్లయింట్లు. ఈ లెక్కన మనవంతు వచ్చేసరికి చాలాసేపయ్యేటట్లుంది." అనుకుని ఓ దృఢకాయుడిని చప్పట్లు కొట్టి పిలిచాడు వెంకట్రావు.
"చిత్తం...చెప్పండి సార్... మిమ్మల్నెవరైనా నెట్టి ముందుకు వెళ్ళారా? చెప్పండి కీళ్ళు విరిచి లాక్కొస్తాం. అన్నాడు గార్డు.
"అదేం కాదు కానీ నా వంతు వచ్చేసరికి ఎంతౌతుంది?"
"మీరు నూట ఆరవ వారు సార్...మనిషికి రెండు నిముషాలు కేటాయిస్తారు మా సారూ. వి.ఐ.పీ క్యూ వాళ్ళకు పది నిమిషాలు కేటాయిస్తారు. వాళ్ళు దాదాపు వంద మంది ఉన్నారు. మినిస్టర్ల రెకమెండేషన్ తెచ్చిన వాళ్ళు దాదాపు ఏభై మంది ఉన్నారు. వాళ్ళకు కొంత వీళ్ళకు కొంత సమయం అడ్జెస్టు చెయ్యాలి. ఏవైనా మీ వంతోచ్చేసరికి దాదాపు ఇరవై గంటలు పడుతుంది. ఇప్పుడు ఏడున్నరయింది. సారుకు మధ్యాహ్నం గంట సేపూ లంచ్ బ్రేక్. రాత్రి పన్నెండు నుండి రెండున్నర వరకూ నిద్ర టైమ్. మూడింటికి మళ్ళీ మొదలు పెడతారు. మీకు పిలుపోచ్చేసరికి రేపు తెల్లవారు జామున నాలుగు కావచ్చు."
"మైగాడ్...అంతసేపా? తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కూడా అంతసేపు పట్టదు గదయ్యా." ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావు.
"మరేమనుకున్నారు సార్? వెంకటేశ్వర స్వామి వారైనా వాస్తు చూపించుకోవాలంటే మా సార్ దగ్గరకు రావాల్సిందే. పెద్ద పెద్ద మినిష్టర్లు. గవర్నర్లు ఆయన క్లయింట్లే. ఆయన వాస్తు చెబితే వాస్తు పురుషుడు కూడా ఆయన చెప్పినల్టు రూల్సు మార్చుకోవాల్సిందే." అన్నాడు గార్డు.
"అవునండీ దిక్కులన్నీ ఆయన చెప్పినట్లు వినాల్సిందే. లేకపోతే వాటికే దిక్కుండదు." అన్నాడు వెనుక నిలుచున్నాయన.
"అబ్బో...కానీ అంతసేపు ఎలా నించోవడం? పోనీ మరోసారి వస్తాను." అన్నాడు వెంకట్రావు.
"ఎప్పుడొచ్చినా ఇక్కడ ఇలాగే ఉంటుందండీ. రాబోయేది ఎండాకాలం. ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఎక్కువుంటారు. అప్పుడు మరీ రష్ గా ఉంటుంది." సలహా ఇచ్చాడు మరొకాయన.
"పోనీ...నేనలా ఇంటికెళ్ళి తెల్లవారు జామున మూడింటి కోస్తాను. అంతవరకూ నా ప్లేస్ కాస్త చూస్తుండగలరా? అడిగాడు ధృఢకాయుడిని.
"సారీ సర్...ఇక్కడలాంటిదేమీ ఉండదు. మా సార్ యమధర్మరాజు లాంటోరు. ఆయన కందరూ సమానమే. ఎవరైనా సరే క్యూలో అంతసేపూ నిలుచోవాల్సిందే. రాష్ట్రపతి రెకమెండేషన్ తో వచ్చేవారికి మాత్రమే కొంచెం కన్షెషనుంటుంది. రేయ్... గాడిదకొడకా... ఆగు...లైన్ సే జావ్..."
ఎవరో దిక్కులు చూస్తూ ముందు కెళ్తుంటే అటువైపు పరిగెత్తాడు గార్డు. అంతా కలా నిజమా అనిపించింది వెంకట్రావుకు. ఎక్కడ బట్టినా జనం, గుళ్ళలో జనం, హాస్పటళ్ళ నిండా జనం, షాపుల నిండా జనం, హోటళ్ళ నిండా జనం, రైళ్ళు, బస్సుల నిండా జనం! క్లబ్బుల నిండా జనం! పార్కుల నిండా జనం. ఏమిటీ జనం!
ఎక్కడ కెళ్ళినా వారాలముందే రిజర్వేషన్లు, ముందుగానే అడ్వాన్సులు! ఎవడినడిగినా జేబులో డబ్బుల్లేవంటున్నారు. కానీ బయటకొస్తే ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలదు! ఎక్కడికెళ్ళినా గంటల తరబడి పడిగాపులు! ఇది నాగరికతకు నిదర్శనమా? అసహనగుణానికి అద్దమా? వెంకట్రావు బుర్ర వేడెక్కింది. ముందు నిలుచున్న వ్యక్తి భుజం మీద చెయ్యి వేశాడు.
"మాస్టారూ...సారీ... టైపిస్టు గారూ...ఇంతింత సేపు నిలబడాలంటే కష్టం కదా! మరి అంతవరకూ మనకు ఒకటొచ్చినా రెండొచ్చినా...ఎలా?...వేళ్ళు చూపిస్తూ అడిగాడు.
ముఖం చిట్లిస్తూ వెంకట్రావును చూశాడతను.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో