Yeluka Vacche Illu Bhadram 44
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 44
ఇలపావులూరి మురళీమోహన్ రావు
" ఏవండోయ్, స్టౌ ఆరిపోయింది. గ్యాస్ అయిపోయినట్లుంది. ఇంకా వారం రోజులు రావల్సింది అప్పుడే ఎలా అయిపోయింది ? " అన్నది సుందరి.
" చూశారా, నిదర్శనం వెంటనే కనబడింది! అగ్నిదేవుడికి కోపం వచ్చింది " అని వెంటనే చెంపలను భక్తితో పటపట వాయించేసుకున్నారు శాస్త్రిగారు.
వెంకట్రావుకు భయం వేసింది.
" ఉండండి సిలెండర్ మార్చి షాపుకు వెళ్తాను " అన్నాడు వెంకట్రావు.
ఇంతలో యాదృచ్చికంగా కరెంట్ పోయింది.
" అయ్యయ్యో పాపం శమించుగాక! పాపం శమించుగాక ! అయ్యా వెంకట్రావు గారూ చంద్రుడు కూడా తన ప్రతాపం చూపించాడు. వాళ్ళ ఆగ్రహం మరింత పెరగక ముందే వెంటనే వెళ్లి రెండు కిలోల వక్కలు, రెండు కిలోల బాదంపప్పు పట్రండి " అని ఆతృత అభినయించాడు శాస్త్రిగారు.
" ఇది పవర్ కట్ టైమండీ రోజూ ఇదే టైముకు పోతుంది. మళ్ళీ గంటలో వస్తుంది " నవ్వుతూ అన్నాడు వెంకట్రావు.
" వాదనలు పెట్టుకోకండి ఏదైనా అయితే ముందు మన పవరు కట్ అవుతుంది " కోపంగా అన్నది సుందరి.
వెంకట్రావు సంచి తీసుకుని బయటకు పరుగెత్తాడు. శాస్త్రిగారు కాఫీ సేవిస్తున్నారు.
" అమ్మాయ్ వంటలన్నీ అయిపోయాయా ?" అడిగారు శాస్త్రిగారు.
" కూరలన్నీ అయ్యాయండీ. ఇక గారెలు, పరమాన్నం చేయాలి " అని చెప్పింది సుందరి.
" పరమాన్నంలో జీడిపప్పులు మాత్రం దండిగా వెయ్యి. శుక్రునికి జీడిపప్పంటే చాలా ఇష్టం. ప్రతీసారీ పంటికిందికి పది పప్పులైనా రావాలాయనకు ఆయనకు ఒకటే కన్ను కదా ! నాలుగు పప్పులున్నా రెండుగానే కనిపిస్తాయి " అన్నాడు శాస్త్రిగారు.
" అలాగే శాస్త్రిగారు ముప్పావు కిలో పోస్తాను " అని చెప్పింది సుందరి.
" బాదంపప్పు శనికి చాలా ఇష్టం అందుకని ఎత్తుకేత్తు బాదం కూడా వెయ్యి "
" అలాగేనండీ "
బయటకు వెళ్ళిన వెంకట్రావు వచ్చాడు.
" శాస్త్రిగారు ఇవిగో వక్కలు, బాదంపప్పులు, అబ్బబ్బ రేట్లు మండిపోతున్నాయండీ "
" పోనివ్వండి వెంకట్రావుగారూ! భగవంతుడి దయ ఉండాలే కానీ ఇంతకు పదింతలు సంపాదించుకోవచ్చు పుణ్యకార్యం చేస్తున్నారు.ఊరికే పోదులెండి మీరు మడి ధోవతి కట్టుకుని వచ్చి పీట మీద కూచోండి " అని మంత్రాలు చదవడం ఆరంభించారు శాస్త్రిగారు. మధ్యలో ఆపి " నేను ఎలా చెబితే అలా చెయ్యండి " అన్నాడు మళ్ళీ.
" మంత్రాలు చదవమని మాత్రం అనద్దు నాకు నోరు తిరగదు " అని ముందు జాగ్రత్తగా చెప్పాడు వెంకట్రావు.
" అలాగే కానివ్వండి ''మమ'' అనండి చాలు " అంటూ కొనసాగించారు శాస్త్రిగారు.
రెండు మంత్రాలు చదవగానే " ఒక ఐదు రూపాయలు తాంబూలంలో పెట్టండి " అన్నారు.
ఈవిధంగా రెండు మూడు నిమిషాలకొకసారి తాంబూలంలో ఐదు పది అంటూ ఇరవై సార్లన్నారు గంటలోపలే వెంకట్రావుకు మండిపోతున్నది. వెంకట్రావు ముఖకవళికలు గమనిస్తూనే ఉన్నారు శాస్త్రిగారు.
" అయ్యా ఏది మీ అమ్మాయి గారిని తీసుకురండి నవగ్రహాలకు శాంతి చేయిస్తాను " అన్నారు.
అనూహ్యను తెచ్చింది సుందరి.
" నేను చెయ్యను నేను కూర్చోను మ్యావ్ " అంది అనూహ్య.
" చూశారా పిల్లి ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది. పాపాయిలో ప్రవేశించాలని చూస్తున్నది బలవంతంగా కూర్చోపెట్టారు.శాస్త్రిగారు పెద్దగొంతుతో కళ్ళు పెద్దవి గా ఎర్రగా చేసి అనూహ్య నుదుట కుంకుమ పెట్టి " ఒసేవ్ పిల్లీ...ఇంకెప్పుడైనా మ్యావ్ అన్నావంటే తోలు వలుస్తాను అంటావా ?" అని అరిచాడు.
" అనను " అని ఏడుస్తూ అంది అనూహ్య.
" అలారా దారికి ! అమ్మాయ్ ఇంకా నువ్వు వడ్డించవచ్చు " ఆదేశించారు శాస్త్రిగారు.
సుందరి ఆ ఏర్పాట్లు చేస్తుండగా శాస్త్రిగారు బియ్యం, ఆకులు, వక్కలు, చిల్లర నాణాలు రెండు కండువాలలో మూట గట్టారు. షడసోపెతంగా భోజనలయ్యాయి.
" వెంకట్రావుగారూ శుభకార్యం చేశారు.ఘోర పాపం నుంచి చవకలో బయట పడ్డారు. ఇక మళ్ళీ మళ్ళీ ఇటువంటి పాపాలు చెయ్యకుండా ఉండాలని అందుకు ఆ దైవం మీకు సర్వవేళలా సహకరించాలని ఆశీర్వదిస్తున్నాను ఇక నా దక్షిణ సమర్పించుకున్నారంటే ఆర్ధిక మంత్రిగారింటికి వెళ్లి పుష్పవతీ పూజ చేయిస్తాను " అన్నారు శాస్త్రిగారు.
" గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు మీకు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు తెలుసునండీ.చాలా అదృష్టవంతులు! " అబ్బురంగా అన్నది సుందరి.
" ఆ ఏం లాభం తల్లీ ? ఆ ఆర్ధికమంత్రిగారు మహా పిసినారి ఎప్పుడు వెళ్ళినా ఖజానా ఖాళీ వరల్డ్ బ్యాంకు నుంచి లోన్ రాగానే దక్షిణ ఇస్తా అంటున్నారు. వాళ్ళను మనం గట్టిగా అడగలేం. ఊరుకోలేం మీ బోటి వారే నయం. పదో పరకో అనుకున్న దానికంటే ఎక్కువే చేతిలో పెడతారు " అన్నాడు శాస్త్రిగారు.
ఇంకావుంది
హాసం సౌజన్యంతో