Yeluka Vacche Illu Bhadram 43
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 43
ఇలపావులూరి మురళీమోహనరావు
" టైం పన్నెండు అయింది. ఇంకా రాలేదు శాస్త్రిగారు. విష్ణు సహస్రనామాలు మూడుసార్లు చదవడం పూర్తయింది. ఒకసారి ఇంటికి వెళ్లి రాకూడదూ " విసుగ్గా అన్నది సుందరి.
" అబ్బబ్బబ్బ...వీళ్ళతో పెద్ద తలనొప్పైపోయింది. ఒకే రోజు నాలుగైదు ఒప్పుకుంటారు. అవతలివాళ్ళు విసిగిస్తారు. సరే నేను వెళ్ళొస్తా! " అని బయటికి వచ్చి స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు వెంకట్రావు.
ఇంతలో శాస్త్రిగారు శరవేగంతో సైకిల్ మీద వచ్చారు.
శాస్త్రిగారు కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాడు వెంకట్రావు.
" మీకోసమే బయలుదేరుతున్నా శాస్త్రిగారు " అన్నాడు వెంకట్రావు.
" మీరు ఎదురు చూస్తుంటారనే ఆశీర్వచనాలు చదవమని గవర్నర్ గారి భార్య ఎంతగా మొత్తుకున్నా కనీసం కాఫీ అయినా తాగకుండా ఉరుకులు పరుగులతో వస్తున్నా. ఆలస్యానికి క్షమించాలి " అన్నాడు శాస్త్రిగారు.
" ఇంత బిజిగా ఉంటారు. కనీసం ఒక మోటార్ సైకిల్ కొనుకకోవచ్చుకదా శాస్త్రిగారు " అన్నాడు వెంకట్రావు.
" అయ్యో రామ! నా బతుక్కి అదొకటే తక్కువ! సైకిలుకు పంచర్ పడితేనే బాగుచేయించే ఠికానా లేనివాడిని. ఇక మోటార్ వాహనం నడపడం నా వల్ల ఏమవుతుంది. పైగా దానికి ఇంధనం కొనాలయే. మీరంటే సర్కారీ కొలువు కాబట్టి కారైనా కొనగలరు " అన్నాడు శాస్త్రిగారు.
" పేరుకు సర్కారీ కొలువు. సర్కారు దగ్గర ఖజానా ఎప్పుడు ఖాళీగా ఉన్నట్లే మాజేబులు కూడా ఎప్పుడు ఖాళీయే రండి రండి...మొదలు పెడదాం " అన్నాడు వెంకట్రావు.
ఇద్దరూ లోపలికి నడిచారు.
" అమ్మాయ్...విష్ణు సహస్రనామాలు నిష్టగా చదివావా ?" అని సుందరిని అడిగాడు శాస్త్రిగారు.
" మూడుసార్లు చదివానండి " అని సుందరి చెప్పింది.
" అరెరె..ఒక్కసారే చదవమని చెప్పానే "
" టైముంది కదా అని కాలక్షేపం కోసం ఇంకో రెండుసార్లు చదివాను. మంచిదే కదా శాస్త్రిగారు " అని చెప్పి అడిగింది సుందరి.
" ఏం మంచిది ? మూడు సార్లంటే మూడువేల నామాలు. వాటిని త్రిమూర్తుల చేత భాగిస్తే వెయ్యి...వెయ్యిని దిక్పాలకులతో భాగిస్తే ఒక్కొక్కరికి నూట పాతిక. అంటే ఇప్పుడు నూటపాతిక తాంబూలాలు పళ్ళెంలో పెట్టాలి. అదే ఒక్కసారి చదివి ఉంటే నలభై రెండు తాంబూలాలతో సరిపోయేది " అన్నాడు శాస్త్రిగారు.
" అప్పటికి ఇహచాలులే అని నోరు నెప్పి పుడుతున్నదని విసుకున్నాను. అయినా వింటేగా...ఏదో గొప్పభక్తురాలి మాదిరిగా స్కూలు పిల్లాడు పాఠం అప్పజెప్పినట్లు టకటక చదివేసింది." అని కోపంగా అన్నాడు వెంకట్రావు.
" దీంట్లో ఇంత తిరకాసు ఉందని నాకేం తెలుసు ? దేవుడి పేర్లే కదా అని చదివాను " అని ముఖం ముడుచుకుంది సుందరి.
" సరే పోనివ్వమ్మా! దేవతల ప్రీత్యర్థం ఎంతపెడితే అంత మంచిది వెంకట్రావు గారు. మీరు టిఫినేం చెయ్యలేదు కదా! " అన్నాడు శాస్త్రిగారు.
" లేదండి. కడుపు దహించుకుపోతున్నది " అని చెప్పాడు వెంకట్రావు.
" కావాలంటే పాలు పుచ్చుకోండి. మనం పూజకు కూర్చుంటే ఇహ మూలశంకకు కూడా లేవరాదు. కనుక అలాంటి పనులేమైనా ఉంటే ముగించుకుని పొగ తాగాలనుకుంటే ఒకేసారి నాలుగైదు సిగరెట్లు కాల్చేసి స్నానం చేసిరండి " అని చెప్పాడు శాస్త్రిగారు.
" మీరు మాత్రం నశ్యం పీల్చచ్చు పూజ జరుగుతున్నప్పుడు "
" నశ్యం మాకు ఔషదం లాంటిది. దాని మీద నిషేదం లేదు. శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసా ?" అన్నాడు శాస్త్రిగారు.
వేశ్యల కౌగిలికంటెను
సశ్యశ్యామలం సిరుల విషయముల కంటెన్
నశ్యము జనులకు కడు
ఆ వశ్యము శారీర రుజల నివారణ కొరకై
అంటే శరీరంలోని అన్ని రోగాలా నివృత్తి కొరకు నశ్యం పీల్చడం అవసరం అన్నారు. కావాలంటే మీరు ఒక పట్టు పట్టవచ్చు " అని చెప్పాడు శాస్త్రిగారు.
" వద్దులెండి. నశ్యం డబ్బా చూస్తేనే నాకు తుమ్ములోస్తాయి. నేను వెళ్లి స్నానం చేసి వస్తా! మీరు ఈ లోపల కాఫీ తాగండి " అని బాతురూం లోకి వెళ్లాడు వెంకట్రావు.
" అమ్మాయ్...జీడిపప్పు, వక్కలు, బాదంపప్పు, మూడు కట్టల ఆకులు, నూట పాతిక ఐదు రూపాయల బిళ్ళలు, ఒక వెండి పళ్ళెంలో పడి కిలోల బియ్యం తెచ్చి నా ముందు పెట్టు. నేను దేవతలకు సంభావనలు పంచుతాను " అన్నారు శాస్త్రిగారు.
" వక్కలు, బాదం పప్పు తేలేదండి...నిన్న మీరు చెప్పారా ?" అని అడిగింది సుందరి.
" పోకలు పిస్తారు అని చెప్పాను కదమ్మా...వెంకట్రావుగారికి అర్థంకాలేదేమో "
ఇంతలో వెంకట్రావు తల తుడుచుకుంటూ అక్కడికి వచ్చాడు.
" ఏవండీ...నిన్న తెచ్చిన సరుకుల్లో వక్కలు, బాదంపప్పు లేవట. మర్చిపోయారా ?" అని అడిగింది సుందరి.
" నిన్న అవి చెప్పలేదే " భ్రుకుటి ముడిచి అన్నాడు వెంకట్రావు.
" పోకలు, పిస్తాలు అని చెప్పారట. మీకు వినపడి ఉండదు. తొందరగా వెళ్లి పట్రండి " అన్నది సుందరి.
" ఇంట్లో వక్కపొడి ఉంది. అది పెట్టండి తాంబూలల్లో " అని చెప్పాడు వెంకట్రావు.
" అన్నన్న...ఎంతమాట? అవి పనికి రావండీ. వక్కలు అగ్ని దేవుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. బాదం పప్పు చంద్రుడు ఇష్టపడే ఆహరం వారిద్దరిని తృప్తి పరచకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. వెలుగు ఉండదు " అన్నారు శాస్త్రిగారు.
" అబ్బా...పోనివ్వండి. ఎలాగోలా సర్దండి " విసుగ్గా అన్నాడు వెంకట్రావు.
ఇంతలో సుందరి లోపలి నుండి కేక పెట్టింది.
ఇంకావుంది
హాసం సౌజన్యంతో