Yeluka Vacche Illu Bhadram 42
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 42
ఇలపావులూరి మురళీమోహనరావు
" నువ్వు అంతసేపు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. అందుకే చేశాను "
" నా బంగారు తల్లి...ఏభై తులాల బంగారం. పది లక్షల కట్నంతో నీ వివాహం రంగరంగ వైభవంగా జరిపిస్తాను " అన్నాడు శాస్త్రిగారు.
" పొ నాన్నా....నీకంతా తొందరే "
" నా తల్లే...నా తల్లే..." కూతురి బుగ్గలు ప్రేమగా నిమిరాడు శాస్త్రిగారు.
" ఏమిటి ఏదో బంగారం అంటున్నారు " నవ్వుతూ కాఫీ తో వచ్చింది శాస్త్రిగారి భార్య సోమిదమ్మ.
" ఆహా...ఏమిలేదు. నా కూతురును బంగారం అంటున్నాను " అని చెప్పాడు శాస్త్రిగారు.
" ఏం కాదులెండి నాకు వినబడుతూనే వుంది. కలెక్టర్ చేసినట్టు ఫోన్ చేస్తేనే ఏభై తులాల బంగారం అంటున్నారే. మరి చీఫ్ మినిస్టర్ చేసినట్లు చేసినందుకు నాకేంతిస్తారో " అని అంది శాస్త్రిగారి భార్య సోమిదమ్మ.
" నీకేమే...ఇప్పటికే నిలువెత్తు బంగారం వుంది. కొత్తగా చేయించినా పెట్టడానికి నీ వంటిమీద చోటేది ?"
" అయితే ఇవాళ్టి నుండి వళ్ళు పెంచుకుంటాన్లెండి "
విరగబడి నవ్వుకున్నారు ముగ్గురూ.
" భోజనం చేసి వెళ్తారా " అని భర్తను అడిగింది సోమిదమ్మ.
" ఈ పూట వద్దులే. అక్కడ బారీగా చేయిస్తున్నాను. సాయంకాలం వంట చెయ్యకు. ఆ పదార్థాలను తెస్తాను. నాలుగు రోజులకు సరిపడా తినవచ్చు "
" అలాగే...పరమాన్నంలో దండిగా జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు వెయ్యమని చెప్పండి "
" అరెరెరె....బాదం పప్పు చెప్పడం మరిచానే "
" ఫరువాలేదు..సూర్యుడికి ఇష్టమని చెప్పి తెప్పించండి "
" ఓ..అలాగే "
" ఓ యాభై తమలపాకులు బియ్యం మీద పెట్టి ప్రతిదాంట్లో పది జీడిపప్పులు, నాలుగు ఖర్జూరాలు పెట్టించండి. యాభై ఎండు కొబ్బరి చిప్పలు పట్రండి షాపువాడు అడుగుతున్నాడు"
" అలాగే తెస్తాను "
" మరి వక్కలు చెప్పారా ?"
" అయ్యో మర్చేపోయాను "
" మండినట్టే ఉంది. సాయంత్రానికి కిలో వక్కలైన ఇస్తానని చెప్పి షాపువాడి దగ్గర డబ్బులు కూడా పుచ్చుకున్నాను. ఇంట్లో అరకిలో కూడా లేవు. అవి గూడా తెప్పించండి " అంది భార్య సోమిదమ్మ.
" మరి ఊరుకుంటానా ? బాగా గుర్తుచేశావు. ఇక నాకు టిఫిన్ వడ్డించు. వెళ్తాను.ఇప్పటికే పదకొండు అయింది " అన్నాడు శాస్త్రిగారు.
" రండి రండి...నిమిషంలో వడ్డిస్తాను " అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది సోమిదమ్మ.
" నాన్నా...నీ పంచెలు మరీ మురికి పట్టి ఉన్నాయి. మంచి జరీదోవతులు కొనుక్కోరాదూ " అన్నది రంగవల్లి.
నవ్వారు శాస్త్రిగారు.
" కావాలంటే నేను ఇప్పుడు రెండు కార్లు మెయిన్ టెయిన్ చెయ్యగలను. కానీ పురోహితులు ఎప్పుడు పెదవారుగానే కనిపించాలి. పాతడొక్కు సైకిల్ మీదనే తిరగాలి. తాంబూలంలో మనం అనుకున్నదానికంటే దక్షణ ఎక్కువ కనిపించినా ముఖం అసంతృప్తిగానే పెట్టాలి. మూడుపూట్ల భోజనం చేసినా ఒంటి భోజనమే అనిపించాలి. పార్టీ ఎన్ని కానుకలిచ్చినా చాలదనే చెప్పాలి. అప్పుడే మేమంటే గౌరవం పెరుగుతుంది " అని చెప్పాడు శాస్త్రిగారు.
" మరి నువ్వు అనుభవించేది ఎప్పుడు నాన్న " అమాయకంగా అడిగింది రంగవల్లి.
" నా పిచ్చితల్లీ...మీరంతా రోజూ పట్టుబట్టలు కట్టుకుని వంటినిండా నగలు పెట్టుకుని తిరుగుతుంటే నేను అనిభవిస్తున్నట్టే..ఉండటం ముఖ్యం కానీ ప్రదర్శించడం కాదమ్మా.. పద టిఫిన్ చేద్దాం " అని చెప్పాడు శాస్త్రిగారు.
ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)