Yeluka Vacche Illu Bhadram 41
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 41
ఇలపావులూరి మురళీమోహనరావు
" యమభటులు వందమందిని పురాణాలు ఘోషిస్తున్నాయి. తలా అయిదు రూపాయలైనా దక్షిణ ఇవ్వకపోతే ఆ కోపం మనస్సులో పెట్టుకుని ఏ రాత్రి సమయంలో వచ్చి ఓ కొరడా దెబ్బవేస్తారు. ఆ మేరకు తోలు లేచిపోతుంది " అని చెప్పాడు శాస్త్రిగారు.
" వద్దులెండి. ఇంత చేసి ఐదు రూపాయల దగ్గర కక్కుర్తిపడటం దేనికి అలాగే చేద్దాం " అన్నాడు వెంకట్రావు.
" శుభం...ఇక చిత్రగుప్తుల వారిని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకిష్టమైనవి మంచి జరీ అంచు పంచెల చావులు, బంగారు జరీ ఉత్తరీయాలు. అవి పట్రండి " అని చెప్పాడు శాస్త్రిగారు.
" అబ్బో...మాములువు సరిపోవా ?" అన్నాడు వెంకట్రావు.
" అమ్మో...ఆయన ఒక కూడిక, తీసివేత తప్పువేసినా మీరు కొన్ని వందల సంవత్సరాలు నరకంలోనే ఉండవలసి వస్తుంది. చిత్రగుప్తు ప్రసన్నం చాలా ముఖ్యం. ఆయన చితా విప్పితే యముడు కూడా నోరెత్తడు " అని చెప్పాడు శాస్త్రిగారు.
" మొత్తానికి కిరాణాషాపు, రైతుబజార్, బట్టల షాపు మా యింట్లోనే పెట్టేస్తున్నారు "
" నరకబాధ అలాంటిది. ఆ బాధలు తప్పించుకోవడానికి తపస్సులు వేల సంవత్సరాలు ఒంటికాలు మీద తపస్సులు చేసేవారని వేదాలు ముఖం మీద కొట్టినట్లు చెబుతున్నాయి "
" ఆ నరక బాధ సంగతి దేవుడెరుగు. ఇదే పెద్ద నరకబాధగా ఉంది. అసలు ఈ తతంగాలు చెయ్యకపోతే ఏమౌతుందట "
" సుందరి నువ్వెళ్ళి కాఫీ పట్రమ్మా " అన్నారుశాస్త్రిగారు.
సుందరి లోపలకి వెళ్ళింది.
" వెంకట్రావు గారు... అమ్మాయి ముందు చెప్పడం బాగుండదని ఊరుకున్నాను. మీరు చేసిన పాపం ఫలం అప్పుడే ఎలా కొట్టిందో అర్థం కాలేదా " నెమ్మదిగా అన్నాడు శాస్త్రిగారు.
" ఏమైంది ?" అన్నాడు వెంకట్రావు.
" నిన్నరాత్రి ఏం జరిగింది ? ఉత్తి పుణ్యానికి పోలీసువారి చేత చావుదెబ్బలు తిన్నారే! మీ తప్పేమిలేకపోయినా పోలీసువాడు డొక్కలు ముక్కలు చేశాడే..నిజానికి వాడు పోలీసువాడు కాదు. పోలీసు రూపంలో వచ్చిన యమభటుడు! మీ పాపం అప్పుడే చిత్రగుప్తుడి చిట్టాలోకి ఎక్కి ఆ పాపఫలం శాంపిల్ చూపించడానికి తన భటుడిని రక్షక భటుడి రూపంలో పంపాడు. శాంతి చేయించాలని మనసులో ఉద్దేశం ఉంది కాబట్టి ఆ సమయంలో మేమంతా వచ్చాం " అన్నారు శాస్త్రిగారు.
అది వినగానే వెంకట్రావు వళ్ళంతా చెమటతో తడిసిపోయింది.
****************
" ఎంతైనాయి సరుకులు ?" అడిగింది సుందరి.
" ఐదువేలయ్యాయి. ఏడుస్తూ ఇచ్చాడు షాపువాడు " చెప్పాడు వెంకట్రావు.
" దేనికి! అన్నీ సరుకులు వాడి దగ్గర కొంటున్నందుకు సంతోషించాలి గానీ " అన్నది సుందరి.
" అప్పుకదా..అందుకు...ఇంతకూ ఈ శాస్త్రిగారు రాలేదేంటి "
" ఫోన్ చెయ్యండి " శాస్త్రిగారికి రింగ్ చేశాడు వెంకట్రావు.
" హలో..శాస్త్రిగారూ ఉన్నారా ?
" లేరండి..గవర్నర్ గారింట్లో వరలక్ష్మీ వ్రతం ఉంది. అక్కడికి వెళ్లారు "
" అరె...ఈరోజు మాయింట్లో శాంతి పూజలు చేయిస్తానన్నారు "
" ఎవరండి మీరు ?"
" నేను వెంకట్రావును "
" మీరా అంకుల్...అయితే తప్పకుండా వస్తారు "
" ఎప్పుడు ?"
" గవర్నర్ గారి బంగాళా నుంచి నేరుగా మీ ఇంటికే వస్తానన్నారు "
" ఎన్నిగంటలకి ?"
" పన్నెండింటికల్లా వస్తారు. ఈ లోపల మీరేమి తినకండి "
" నేను ఆకలికి అసలు ఉండలేను తల్లీ "
" అందరూ అంతే అంకుల్...ఈ లోపల మీరు స్నానం చేసి ఆంటీతో కలిసి విష్ణుసహస్రనామాలు చదువుతుందండి. డాడీకి కొంచం పని తగ్గుతుంది "
" మంచిది తల్లీ...గవర్నర్ గారిల్లేనా...ఇంకా అట్నుంచి వెళ్ళే ఇల్లు ఇంకేమైనా ఉన్నాయా ?"
" లేదంకుల్..ఒకటే "
" మంచిది " అని ఫోన్ పెట్టేశాడు వెంకట్రావు.
సుందరికి విషయం మొత్తం చెప్పాడు.
" ఆ నామాలు నాకు నోరు తిరగవు. నువ్వు చదువుతుండు నేను వింటుంటాను " అన్నాడు వెంకట్రావు.
విష్ణుసహస్రనామాలు చదవటం మొదలు పెట్టింది సుందరి. వెంకట్రావు ''మమ'' అనసాగాడు.
శాస్త్రిగారింట్లో.
" ఏమంటాడమ్మా వాడు ?" అడిగాడు శాస్త్రిగారు.
" నమ్మేశాడు నాన్నా " పకపక నవ్వింది రంగవల్లి.
" నిన్న సమయానికి ఫోన్ చేశావు. లేకపోతే ఇరవైవేలు నష్టపోయేవాళ్ళం " పెద్దగా నవ్వారు శాస్త్రిగారు.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)