Yeluka Vacche Illu Bhadram 40
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 40
ఇలపావులూరి మురళీమోహనరావు
వెంకట్రావు, సుందరి కళ్ళతోనే సంప్రదించుకున్నారు. మంగళ సూత్రాలు చూపించింది సుందరి. శాస్త్రిగారు అది గమనించి కూడా ఏమీ ఎరగనట్లు కూర్చున్నాడు.
" సరే అలాగే కానివ్వండి రేపోద్దున్నే వచ్చి ఆ శాంతేదో కానిచ్చేయ్యండి " అన్నాడు వెంకట్రావు.
" రేపోద్దునా ? అన్నన్నన్న. నాలుగు మాసాల దాకా నా డైరీలో అస్సలు ఖాళీ లేదు. ఇది ఏప్రిల్ కదా. ఆగస్టులో మొదలు బెడతాం " కంగారు నటిస్తూ అన్నాడు శాస్త్రిగారు.
" అమ్మో...అంతాలస్యమా ? మరి పాపం పెరిగిపోదూ " అన్నది సుందరి.
" ఏం చెయ్యమంటావమ్మా .రేపు కలెక్టర్ గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. అడ్వాన్సు కూడా పుచ్చుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళల్లో చాలా కార్యాలున్నాయి " అన్నాడు శాస్త్రిగారు డైరీలో పేజీలు తిరగేస్తూ.
" సరే కానివ్వు. శాస్త్రిగారు అంత బిజీ మరి! అప్పుడే చేయిద్దాం " అన్నాడు వెంకట్రావు అప్పటిదాకనైనా సుందరి మెడలో మంగళసూత్రాలు ఉంటాయి కదా అని.
ఇంతలో శాస్త్రిగారి సెల్ మోగింది.
" అయ్యా కలెక్టర్ గారు నమస్కారం..దీర్ఘాయుష్మాన్ భవ. రేపు ఉదయం ఎనిమది గంటల కల్లా ఉంటాను. ఏంటీ మీ శ్రీమతిగారికి ఒంట్లో బాగాలేదా "
" ..............................."
" అయ్యో..అంత పని జరిగిందా? మరి..."
" ............................"
" మీ యింట్లో వ్రతం అని ఇక్కడో శాంతి పూజకు రాలేనని చెప్పానే "
" ......................"
" ఫరువాలేదా..అయ్యయ్యో ఎంతమాట! అడ్వాన్సుదేవుందిలే. ఓ...హిహిహి...ధర్మమూర్తులు. అలాగే ఉంచుతాలెండి.తరువాత పెట్టుకుందాం.ఓ వచ్చే నెలలో దివ్వమైన మూహుర్తాలున్నాయి సరే ఉంటాను శుభం " అని సెల్ ఆఫ్ చేశాడు శాస్త్రిగారు.
" వెంకట్రావుగారూ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డ పుట్టడం అంటే ఇదే! మీ పాపం ఏ మాత్రం పెరక్కుండా యమధర్మరాజు చక్రం అడ్డం వేశాడు కలెక్టర్ గారి భార్యను పంచం ఎక్కించాడు.రేపు మీ శాంతి పూజకు ఏ మాత్రం అడ్డంకులు లేవు అదృష్టవంతులు " అన్నాడు శాస్త్రిగారు.
సుందరి, వెంకట్రావు మొఖాలు వికసించాయి.
" వెంకట్రావుగారూ...పూజకు కావల్సిన సామాగ్రి చెబుతాను రాసుకోండి " అన్నాడు శాస్త్రిగారు.
వెంకట్రావు పేపరు పెన్ను తీసుకున్నాడు.
" ప్రసాదాల కోసం రెండు కిలోల జీడిపప్పు, కిలో ఖర్జూరాలు " అని చెప్పాడు శాస్త్రిగారు.
" రెండు కిలోల జీడుపప్పా..మేము సంవత్సరానికి కూడా అన్ని కొనమండి "
" అయ్యె...యమధర్మరాజుకు జీడిపప్పు అత్యంత ప్రీతిపాత్రమైనది ఆయన దేవేరికి ఖర్జూరాలు ఎంతో ప్రియమైనవి. అవి దండిగా ఉండకపోతే వారికి ఆగ్రహం కలుగుతుంది. వారికి కోపం వస్తే మీ తోలు చెక్కుతారు " అని అన్నాడు శాస్త్రిగారు.
" వద్దులెండి అలాగే కానిద్దాం ఇంకా..."
" యాలకులు పావుకిలో. నెయ్యి రెండు కిలోలు. పంచదార పది కిలోలు, కర్పూరం వందగ్రాములు, ఎండుకొబ్బరి రెండుకిలోలు, బెల్లం నాలుగు కిలోలు. ఇవి ప్రసాదాలకు, ఇక వంటలకు, ఎన్ని కూరలు చెయ్యలనుకుంటున్నారు ?" అని వాళ్ళని అడిగాడు శాస్త్రిగారు.
" మీ ఇష్టం చెప్పండి "
" బాగా గట్టిగా నీలం రంగులో నిగనిగలాడే గుత్తి వంకాయలు నాలుగు కిలోలు.లేతగా ఉండే బెండకాయలు రెండు కిలోలు, రాళ్ళలా ఉండే బంగాళాదుంపలు మూడు కిలోలు, నవనవలాడే పచ్చ అరటికాయలు డజను. నాలుగు కూరలు చేద్దాం " అని చెప్పాడు శాస్త్రిగారు.
" ఎంతమందికి ఎస్టిమేట్ వేశారు " అని అడిగాడు వెంకట్రావు.
" చెబుతాను మీరు రాసుకోండి. కందిపప్పు రెండు కిలోలు, పెసరపప్పు కిలో, గారేలకు మినపప్పు మూడుకిలోలు, శనగపిండి రెండు కిలోలు బజ్జీలకు, ఇక పులుసులోకి ముక్కలకు మంచి లేత సొరకాయలు రెండు, కేరెట్లు కిలో, చిలగడ సుంపలు రెండు కిలోలు పట్రండి " అని చెప్పాడు శాస్త్రిగారు.
" ఇక పులిహోరకు మంచి రిఫైన్డ్ వేరుశనగ నూనె కిలో, పచ్చళ్ళు అల్లం పచ్చడి, టమాట పచ్చడి, గోంగూర పచ్చడి, తెల్లవంకాయ పచ్చడి, కందిపొడి, నువ్వులపొడి ఇవి వంటలకు " అని మళ్ళీ చెప్పాడు శాస్త్రిగారు.
" ఇంతేనా ఏమైనా ఇంకా చెబుతారా ?"
" రాసుకోండి పూజకు మంచి రాగి కలశం, ఎనిమిది జాకెట్ ముక్కలు, వందగ్రాముల కుంకుమ, వంద గ్రాముల పసుపు, తమలపాకులు నాలుగు కట్టలు, అరకిలో పూలు, దేవుడి నైవేద్యానికి క్షీరాన్నం కోసం నాలుగు లీటర్ల పాలు, దక్షిణల కోసం ఐదు రూపాయల బిళ్ళలు ఓ వంద "
" వందా...వంద దేనికి " అని ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.
ఇంకావుంది
హాసం సౌజన్యంతో