Yeluka Vacche Illu Bhadram 39
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 39
ఇలపావులూరి మురళీమోహనరావు
వెంకట్రావు, సుందరి ఏమి మాట్లాడకపోయే సరికి ఏమి చేయాలో తెలియక శాస్త్రిగారు లేచి వెళ్లిపోతుంటాడు.
" ఆయన మాటలు వింటుంటే వళ్ళు జలదరిస్తుంది. వెధవ డబ్బు పొతే పోయింది. ముందు ఆయన్ని పిలవండి " అన్నది సుందరి.
" పిచ్చిపట్టిందా ఏం ? ఇరవై వేలు ఎక్కడి నుంచి తెస్తాం ?" కోపంగా అన్నాడు వెంకట్రావు.
" కావాలంటే నా మంగళ సూత్రాలు అమ్మేద్దాం! శరీరాన్ని చీల్చి ముక్కలు చేసి శనగపిండిలో కలిపి అయ్యబాబాయ్ తలుచుకుంటేనే నరాలు చచ్చుబడుతున్నాయి." ఏడుపు గొంతుతో అన్నది సుందరి.
" ఏవండోయ్ శాస్త్రిగారూ " అని కేక పెడుతూ బయటికి వచ్చాడు వెంకట్రావు.
సైకిల్ పట్టుకుని వెళ్తున్నట్టు నాటకమాడుతున్న శాస్త్రిగారు వెంకట్రావు పిలుపు వినబడగానే సైకిల్ ఎక్కుతున్నట్లు నటించసాగాడు. వెంకట్రావు బయటకు పరుగెత్తుకుని వచ్చాడు.
" ఒకసారి లోపలికి రండి శాస్త్రిగారు " అన్నాడు వెంకట్రావు.
" అబ్బా ఏమిటి వెంకట్రావు గారూ. అవతల ఆలస్యమైతే బంగారపు బల్లి పోతుంది. అటు బల్లికి చెడి ఇటు పిల్లికి చెడితే పిల్లలు గలవాణ్ణి ఏమైపోవాలి ?" విసుగు నటిస్తూ అన్నాడు శాస్త్రిగారు.
" ఒకసారి లోపలికి రండి. మళ్ళీ మాట్లాడుకుందాం " అన్నాడు వెంకట్రావు.
" మళ్ళీ ఇంకేం మాటాలండీ. మీకేం ప్రభుత్వ ఉద్యోగులు. మహా ప్రభువులు. మేము తెల్లవారితే నలుగురి మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఇలా మా సమయం వృధా చేస్తే ఎలా చెప్పండి. మీరు ఆఫీసుకు వెళ్ళినా, వెళ్ళకపోయినా పని చేసినా, చేయకపోయినా ప్రభుత్వం వారు పువ్వుల్లో పెట్టి మీకు జీతబత్తలు అందిస్తారు. మాకు అలా కాదే " అన్నాడు శాస్త్రిగారు.
" సరే మీరు రెండోసారి "
" అమ్మమ్మా ఇక నా వల్లకాదు బాబూ! ఆకలితో జీర్ణకోశం దహించుకుపోతున్నది. నాలుగు మెతుకులు గతికి పెళ్ళిళ్ళు ఆబ్దికాలు చూసుకోవాలి. నన్ను వదిలిలేయండి మహాప్రభో " అన్నాడు శాస్త్రిగారు.
" మాలీ టిఫిన్ చేసి పెడుతాం.మీరు లోపలికి రండి " అన్నాడు వెంకట్రావు.
విసుగు నటిస్తూ సైకిల్ స్టాండు వేసి లోపలకు వచ్చారు శాస్త్రిగారు.
" అమ్మాయ్..నువ్వు ముందు దిబ్బరొట్టేల్లాగా ఉండే ఇరవై ఇడ్డీలను బాగా నేతిలో ముంచి పట్రా. వెంకట్రావు గారూ ఇవాళ నన్ను వదిలిపెట్టరు. ఎంతైనా ఇంటి పురోహితుడిని కదా మరి భరించక తప్పదు " అంటూ వెళ్లి లోపల కూర్చున్నాడు.
మెటికలు విరిచి లోపలికి వెళ్ళింది సుందరి.
" అయ్యా శాస్త్రిగారు మరో మార్గమదైనా చూడండి " అని చేతులు నలుపుకుంటూ అన్నాడు వెంకట్రావు.
మళ్ళీ గొంతు సవరించుకున్నాడు శాస్త్రిగారు.
" పిల్లిని మించిన దైవము ముల్లోకములనెచటైన ముర్కొన గలవా ? పిల్లికి సరిసాటిది జా బిల్లి యొకటియే విశ్వమందు వినుమా పార్థా ! అని అఖుబుక్కు మహర్షి అర్జునుడితో అన్నాడు తెలుసా " అని అన్నాడు శాస్త్రిగారు.
" అబ్బా ఈ అఖుబుక్కు మహర్షి ఎవరండీ పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్లు పిల్లిమీద ఇన్ని పద్యాలు చెప్పాడు. మేమసలు ఇలాంటి పద్యాలు వినలేదు. ఆ మహర్షి పేరు అంతకంటే వినలేదు " అన్నాడు వెంకట్రావు.
" అవునులేండి సర్కారీ కొలువు. మీకు అంత అవసరం ఏముంది. మాది వృత్తి గాబట్టి మేము ప్రతి రోజూ శాస్త్రాలు, పురాణాలు వేదాలు వల్లెవేయాలి కాబట్టి అవి నిరంతరం మానోళ్ళలో నానుతుంటాయి. ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా పిల్లిని ప్రస్తుతించారు. అవన్నీ చెప్పాలంటే మీ సమయం వృధా చెయ్యడమే " అన్నాడు శాస్త్రిగారు.
" కానీ శాస్త్రిగారు కొంచెం డిస్కౌంట్ ఇవ్వడానికి వీలవుతుందేమో చూడండి "
" వెంకట్రావు గారూ మీరు చేసిన పాపం సామాన్యమైంది కాదు హత్య! ఒక మనిషి హత్య చేస్తే పోలీసులకు నాలుగు రూపాయలు ఆశ చూపించి మాఫీ చేయించుకోవచ్చు. మహా అయితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఈ లోపల ఏ గాంధీ జయంతో నెహ్రు వర్దంతో వస్తుంది ఆ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో బయటపడవచ్చు.
కానీ ఇది అలా కాదు. దైవ సమానమైన అందమైన జంతు హత్య! లంచాలు ఇచ్చి యమలోకంలో శిక్షలు మాఫీ చేయించుకోవడం జరగని పని, చచ్చిన తరువాత చచ్చినట్లు అనుభవించాలి అటువంటి శిక్షలను ముష్టి ఇరవైవేలతో మాఫీ చేస్తానంటే మీరేదో గొణుగుతున్నారు " నిష్ఠూరంగా అన్నారు శాస్త్రిగారు.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో