Yeluka Vacche Illu Bhadram 38

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 38

ఇలపావులూరి మురళీమోహనరావు

" ఆహా హా...చచ్చి ఏ లాకానుందో కానీ మా బామ్మ కూడా ఇలానే కాఫీ పెట్టేది. చూడండి వెంకట్రావు వెంకట్రావు గారు మన పురాణాలలో శాస్త్రాలలో మనం చేసే ప్రతి పాపానికి ఓ పరిస్కారం ఉన్నది. మానవ సహజ గుణాలను దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆలోచింది ఇలాంటి ఏర్పాట్లు చేశారు.

మన రాజకీయ నాయకులు ఎన్ని హత్యలు, దోపీడీలు, కుంభకోణాలు చేసి చట్టాల్లో ఉండే ఏవేవో లొసుగులను అడ్డ పెట్టుకుని పులుగడిగిన ముత్యాల్లా తిరిగి ప్రకాశిస్తున్నట్టే మనిషి తెలిసో తెలియకో చేసే అపరాధాలకు కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుని మళ్ళీ పునీతులవడానికి మార్గాలు అనేకం సూచించారు. విన్నారా " అని చెప్తూ వాళ్ళు వింటున్నారో లేదో అని తెలుసుకోవడానికి వాలని అడిగాడు శాస్త్రిగారు.

" వింటున్నాం. ముందు దీనికి పరిస్కారం చెప్పండి "

" ఈ పాపాలకు పరిష్కారాలు ఉంటాయి కానీ కొంచెం ఖరీదుగా ఉంటాయి. అయినా చర్మం వలిపించుకుని మరిగే నూనెలో వేగడమంత కఠినంగా ఉండవనుకో " అన్నారు శాస్త్రిగారు నష్యాన్ని పీల్చి.

" అవేంటో తొందరగా చెప్పండి శాస్త్రిగారు " అన్నారు ఇద్దరు.

రెండుసార్లు పొడి దగ్గులు దగ్గి బలిపశువులు దొరికారన్న ఆనందం మనసులో తాండవిస్తుండగా ఇద్దరి వంకా చూసి మొదలు పెట్టాడు శాస్త్రిగారు.

" మనం ఏ జంతువునైతే చంపామో ఆ జంతువెత్తు బంగారంతో ఆ జంతువు ఆకారాన్ని తయారు చేయించి ఓ మంచి బ్రాహ్మణుడికి సూర్యోదయ కాలంలో దానమివ్వాలి. ఇది మొదటి పరిష్కారం. అనగా మీరు పిలిని చంపారు కాబట్టి ఆ పిల్లి బరువుకు సరితూగే బంగారంతో ఒక పిల్లిని తయారు చేయించి నా వంటి పురోహితుడికి దానం ఇవ్వాలి. దీన్ని శ్రేష్ఠ, ఉత్క్రుష్ట పరిస్కారం అంటారు " అని చెప్పాడు శాస్త్రిగారు.

" మైగాడ్...బంగారు పిల్లే! మా వల్ల కాదు " అన్నాడు వెంకట్రావు.

నవ్వారు శాస్త్రిగారు.

" ఫరువాలేదు వెంకట్రావు గారూ శాస్త్రకారులు దీనికీ పరిస్కారం చెప్పారు. అందరికీ బంగారు దానాలు చేసే శక్తి ఉండదు. కనుక అటువంటివారు వెండితో పిల్లిని చేయించి ఇంటి పురోహితుడికి దానం ఇవ్వచ్చు.దీనికి మధ్యస్థ పరిస్కారం అంటారు " అని శాస్త్రిగారు చెప్పారు.

ఎక్కిళ్ళు ఆరంభమయ్యాయి వెంకట్రావుకు.

" శాస్త్రిగారూ...పుచ్చుకోవడానికి మీరూ సిద్ధంగానే ఉన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఇటీవలే ఇల్లు కట్టుకుని పీకలలోతు అప్పులో ఉన్నాం. గృహప్రవేశానికి సువర్ణదానం అని బంగారపు ఉంగరం పెట్టించుకున్నారు. దాని తాలుకూ అప్పే ఇంకా తీరలేదు. " ముఖం మాడ్చుకుని అన్నాడు వెంకట్రావు.

" వెంకట్రావు గారూ... తరాల నుంచీ మీ ఇంటి పూరోహితుడిని. మీ కుంటుంబహితుడిని. మీకు మంచి సన్నిహితుడిని.మిమ్ముల్ని ఇబ్బంది పెట్టి అప్పుల పాలు జేస్తానా ? దీనికీ ఒక పరిస్కారం ఉంది. బంగారు వెండి పిల్లులను దానం చెయ్యలేనివారు రాగిపిల్లిని దానం ఇవచ్చు.

దీనిని అధమనికృష్ట పరిస్కారం అంటారు. కానీ రాగి పిల్లిని దానం పుచ్చుకోకూడదని మా తాతగారు శాసనం చెయ్యడం వలన రాగి పిల్లికి బదులుగా ఇరవై వేలు రొఖ్ఖం దానంగా ఇవ్వచ్చు. ఇక నాకు తప్పేదేముంది. సర్దుకుంటాను " కంటి కొసల్తో చూస్తూ అన్నాడు శాస్త్రిగారు.

అరికాలి మంట నెత్తికెక్కింది వెంకట్రావుకు.

" శాస్త్రిగారూ, ఆశకు హద్దుండాలి. మేమేమీ రాజులం, జమిందార్లం కాదు. రాగిది కాదుకదా ప్లాస్టిక్ పిల్లిని కూడా ఇవ్వలేము " ఖరాఖండీగా అన్నాడు.

" పౌరోహిత్యం పాడి బర్రెలాంటిదంటారు.ఇందువల్లనే కాబోలు " అన్నది సుందరి.

నవ్వారు శాస్త్రిగారు.

" చూడమ్మా అది ఒకప్పటి మాట. నేడు ఈ వృత్తి వట్టిపోయిన గెదెల తయారయింది. వెనుకటి రోజుల్లో బ్రహ్మణులకు అగ్రహారాలు ఎకరాలకొద్దీ భూములు మందలు మందలు గోదానాలు, కిలోలు కిలోలు సువర్ణదానాలు ఇచ్చేవారు.

ఈ రోజుల్లో సకల దానాలు అని ఓ వెయ్యి నూటపదహార్లు మోహన కొడుతున్నారు. పెళ్ళిళ్ళకు, సత్యనారాయణ వ్రతాలకు మంత్రాల క్యాసెట్లు తెచ్చుకుంటున్నారు. అన్ని మఠాలలో పెట్టేస్తున్నారు. రానురాను మాకసలు విలువ, గౌరవం లేకుండా పోతున్నాయి." అన్నాడు శాస్త్రిగారు.

" ఈ అత్యాశలు భరించలేకనే అయ్యి ఉంటుంది" అన్నది సుందరి.

" ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడే కదా..మాకింత గిట్టుబాటు అయ్యేది " అని బదులిచ్చాడు శాస్త్రిగారు.

" సర్లెండి. ముందు దానాల విషయాల తేల్చండి " అసహనంగా అన్నాడు వెంకట్రావు.

" చూడండి వెంకట్రావు గారూ...దానం పుచ్చుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎవరూ ఊరికే దానధర్మాలు చెయ్యరు. తిరుపతి హుండిలో లక్షల రూపాయలు వేస్తుంటారు. దేనికి? వాళ్ళు చేసిన పాపాలు కోట్లలో ఉంటాయి. నరక బాధనుండి తప్పించుకోవడానికి మాకు దానాలు చేస్తుంటారు. అంటే అర్థం ఏంటి చెప్పండి " అన్నాడు శాస్త్రిగారు.

" మిరే చెప్పండి " అన్నాడు వెంకట్రావు.

" అంటే...మీ పాపాలను మాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారన్నమాట! అంటే...మీకు బదులుగా కొరడా దెబ్బలు మేము తినాలి. నిప్పుల్లో మేము పోర్లాడాలి. మీ బదులు ఇనుప ముక్కుల కాకులతో మేము మ కళ్ళలో పోడిపించుకోవాలి.

మీ బదులు మేము చర్మం వలిపించుకోవాలి. మీ దానాలు పుచ్చుకున్న నేరానికి మీ బదులు మేము నూనెలో వేగాలి. చీము నెత్తురు గుంటల్లో మేము మునిగి భరించాలి. మీకు లక్ష రూపాయలిస్తాను ఈ శిక్షల్ని మీరు భరించగలరా ? " అని ఉద్రేకంగా అన్నాడు శాస్త్రిగారు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)