Yeluka Vacche Illu Bhadram 37
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 37
ఇలపావులూరి మురళీమోహనరావు
" చెప్పండి. సందేహాలను నివృత్తి చేయడం మా వృత్తి ధర్మం. పురహితం కోరేవారిగా అది మా కర్తవ్యం " అని నవ్వారు శాస్త్రిగారు.
" పిల్లిని మహా నీచ జంతువంటారు గదా! పిల్లి ఎదురొస్తే చెడ్డ శకునమంటారు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకనబెట్టుక పోయినట్లు అంటారు. దొంగతనానికి వచ్చిన వాడిని పిల్లిలా వచ్చాడంటారు. పిలి గురించి ఇంత హీనంగా మాట్లాడుతారు. అటువంటి పిల్లిని చంపితే..అహ..చస్తే పాపం ఏంటి ?" అన్నాడు వెంకట్రావు.
శాస్త్రిగారు మరో పట్టు నషాలానికి అంటేలా పిల్చారు.
" వెంకట్రావు గారూ...నరుడి నాలికకు నరం లేదంటారు. పామును విషజంతువని చంపుతారు. మళ్ళీ అదే పామును నాగదేవత అని పూజిస్తారు. సాలెపురుగును చూసి మనిషి జడుసుకుంటాడు. శ్రీకాళహస్తి వెళ్లి ఆ సాలెపురుగుకు దణ్ణం పెడతాడు. సమయానుకూలంగా మాటలు మారుస్తాడు. కనుకనే మనిషిని గుంటనక్కతో పోలుస్తారు.
ఈ సకల చరాచర సృష్టిలో ఇంట్లో తిరిగే ప్రాణుల్లో అత్యంత అందమైన ప్రశస్థమైన జంతువు పిల్లి మాత్రమే అని అఖుభుక్కు పురాణంలో వ్యాఘ్రాస మహర్షి విడాలక మహారాజుకు చెప్పినట్లు పటిష్టమైన సాక్షాలున్నాయి. అట్టి పిల్లిని చంపుట కోటి బ్రాహ్మల హత్యలతో సమానమని చెప్పారు " అని వివరించాడు శాస్త్రిగారు.
" ఇందాక లక్ష అన్నారు " అని ఆశ్చర్యంగా అంది సుందరి.
" అమ్మాయీ... పుణ్యఫలం దినదినానికీ తరుగుతుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకుంటూ బ్యాలెన్స్ తగ్గకుండా చూసుకోవాలి. పాపం ఫిక్సిడ్ డిపాజిట్ లాంటిది. మనం దాన్ని ముట్టుకోకపోయినా రోజురోజుకూ పెరుగుతుంటుంది " అని చెప్పాడు శాస్త్రిగారు.
" ఇహ పెరక్కుండా చూడండి శాస్త్రిగారు. దీనికేం చెయ్యాలో వెంటనే చెప్పండి. ముష్టి ఎలుకను చంపాలనుకుని ఏలినాటి శనిని నెత్తిన తెచ్చి పెట్టుకున్నాం " అని ఏడుపు ముఖంతో అన్నది సుందరి.
" కంగారు పడకమ్మా మేమున్నదే అందుకే కదా! నువ్వెళ్ళి ఆ లోపల ఇందాక తెచ్చినట్లు ఈసారి చెంబుతో చిక్కని కాఫీ పట్రా " అని సంచిలోంచి పాత పుస్తకాల కట్టలు తీశాడు శాస్త్రిగారు పుస్తకలన్నీ చెదలుపట్టి పట్టుకుంటే చినిగిపోయేట్లు ముట్టుకుని కొన్ని శతాబ్దాలు గడిచిట్లున్నాయి. ఆ కట్టను కళ్ళు కద్దుకున్నారు.
ఇంతలో సెల్ మోగింది.
" హలో...చీఫ్ మినిస్టరు గారా. నమస్కారం సార్... పిల్లి చచ్చిందా.... కాదా కుక్క కారుకింద పడిందా! ఫర్వులేదులే సార్ మరో రెండు మూడు గంటల్లో వస్తాను. ఉంటాను " అని ఆఫ్ చేశాడు శాస్త్రిగారు.
" ఏంటి సీయమ్ గారే " అని ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావు.
" ఆయన ఇల్లు కదలాలంటే నేను వర్జ్యం చూసి చెప్పాలి. నేనంటే అంతగురి ఆయనకు. అ...వెంకట్రావుగారూ ఈ గ్రంథాలు ఏమంటున్నాయో తెలుసా?" అని అన్నాడు శాస్త్రిగారు.
" ఏమో మరి? మాకేం అర్థమౌతాయి ?"
" అవునవును ఇవి ప్రాకృత పైశాచీ భాషల్లో ఉంటాయి. కాళిదాసుకు తప్ప అన్యులకు గ్రాహ్యం కావు. ఆ...అబ్బో ఔనా...చూద్దాం. అబ్బబ్బబ్బ..ష్ష్...ష్చ్.." అని మధ్య మధ్యలో కామెంట్లు చేస్తూ పుస్తకాలను మళ్ళీ కట్టగట్టి సంచిలో పెట్టారు శాస్త్రిగారు.
ఆతృతగా చూస్తున్న వెంకట్రావును చూసి చిరునవ్వు నవ్వి రెండు మూడుసార్లు గొంతు సవరించుకున్నారు.
ఇంతలో సుందరి కాఫీతో వచ్చింది.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో