Yeluka Vacche Illu Bhadram 35
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
Yeluka Vacche Illu Bhadram 35
ఇలపావులూరి మురళీమోహనరావు
**********************
“ మధ్యలో అనడానికి నేనేవర్నండీ! ఇంతకూ పిల్లి విషయం " అన్నది సుందరి.
“ చెబుతాను చెబుతాను. అమ్మాయ్..ఇవాళ టిఫిన్ ఏం చశావు ?”
“ ఇప్పుడే తినేశామండీ " అని చెప్పింది సుందరి. పగలబడి నవ్వాడు శాస్త్రిగారు.
“ అమ్మాయి కూడా చమత్కారాల్లో మిమ్ముల్ని మించిపోతున్నదండి. నా ఉద్దేశ్యం అదికాదు. టిఫిన్ ఏం వండావూ అని " అన్నాడు శాస్త్రిగారు.
“ పెసరట్టు, ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చది, కారప్పొడి "అని చెప్పింది సుందరి.
బాధగా మూలిగారు శాస్త్రిగారు.
“ హతవిధీ...ఒక్క అరగంట ముందుగా రాకపోతిని. దాందేముందిలే ఉప్మా లేకపోతే పోయే. ఓ డజన్ అట్లు వెయ్యడం నీకెంతసేపు పని ?” అన్నారు శాస్త్రిగారు.
తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది సుందరి. శాస్త్రిగారి వాలకం చూస్తుంటే, అట్లుతిని మరో లోటా కాఫీ తాగితినే కానీ ఇహాలోకంలోకి వచ్చేట్లు లేరు.
“ శాస్త్రిగారు...పిల్లి సంగతి ?” అని మళ్ళీ గుర్తు చేశాడు వెంకట్రావూ.
“ వస్తున్నాఅబ్బాయ్... మనం దేనికీ నిదానమే ప్రధానం. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయ్ " అన్నాడు శాస్త్రిగారు.
“ అయ్యబాబాయ్..ఎలుకలా? ఎక్కడ?” అని కెవ్వున కేక పెట్టింది సుందరి ప్లేటుతో వస్తూ.
నవ్వారు శాస్త్రిగారు, వెంకట్రావు.
“ ఒక ఎలుక మిమ్ముల్ని ఇంతగా భయపెట్టిందంటే విశేషమే. ఎక్కడా కాదమ్మాయ్.నా కడుపులో. ఆ ఎలుకలకు మందు నువ్వు పెట్టె వేడి వేడి పెసరట్లే.రెండు చట్నీలు కలిపి కారంపొడి అద్ది గొంతులోకి తోశానంటే చచ్చూరు కుంటాయ్ " అని మొత్తం అట్టును ఒకే మడతగా చుట్టి చట్నీలలో ముంచి నోట్లో పెట్టుకున్నారు శాస్త్రిగారు.
“ ఆహా...ఈ అల్లం పచ్చడి అమృతం. కొబ్బరి చట్నీ దివ్వం. కారప్పొడి పూల సుగంధాల పుప్పొడి. దీనికితోడు సాంబారు కూడా ఉంటేనా! పదిజన్మల పర్యంతం మర్చిపోలేం " అంటూ శాస్త్రిగారు మధ్య మధ్య ఉదకపానీయంలా కామెంట్లు చేస్తూ ప్లేటు, గిన్నెలు ఖాళీ చేశారు.
“ అమ్మాయ్...కమ్మని టిఫిన్ చేసిన తరువాత కాఫీ తాగకపోవడం శాస్త్ర విరుద్ధం.కాబట్టి శాస్త్రీయంగా మరో లోటా కాఫీ పట్రామ్మా" అన్నారు శాస్త్రిగారు.
శాస్త్రిని బండబూతులు తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సుందరి.కాఫీని సేవించి తృప్తిగా తాగి రెండు సార్లు గొంతు సవరించుకున్నారు శాస్త్రిగారు.
“ హమ్మయ్య..మరో గంటపాటు దిగుల్లేదు. ఇప్పుడు చెప్పండి వెంకట్రావుగారూ.. ఎన్ని పిల్లులను చంపారు ?” అని అడిగాడు శాస్త్రిగారు.
“ అయ్యయ్యో..మేమేమి పిల్లులను పనిగట్టుకుని చంపలేదండీ.పిల్లులు కాదు. పిల్లి...పిల్లి...ఒక్క పిల్లికూన చచ్చింది " అని కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ ఆ...ఏదైతే ఏం లెండి ?చచ్చాడన్న ప్రాణం పోయిందన్నా ఒక్కటే.మీరు చంపినా తాను చచ్చినా పిల్లి ప్రాణం పోయింది మాత్రం మీ ఇంట్లోనే. అవునా!” అని నవ్వుతూ అన్నారు శాస్త్రిగారు.
“ అవుననుకోండి " అంటూ నసిగాడు వెంకట్రావు.
“ అది సరేనండి. ఇప్పుడు మేమేం చెయ్యాలో సెలవివ్వండి " అని మధ్యలో కలిపించుకుని సుందరి అన్నది.
“ అందుకే కదా మేమున్నది. మేముండగా మీరు భయపడటం దేనికీ? జాగ్రత్తగా వినండి ఇద్దరూ.వెయ్యి మేకలను, ఐదొందల కుక్కలను చంపడం వంద ఆవులను చంపడంతో సమానం. అటువంటి పదివేల ఆవులను చంపడం కంటే ఒక్క పిల్లిని చంపడం మహాపాపమనీ, లక్షమంది బ్రాహ్మల్ని హత్య చేసినంత పాతకం చుట్టుకుంటుందని, మార్జాల పర్వం నాలుగో ఆశ్వాసంలో బిడాల మహర్షికి నారదుల వారు సెలవిచ్చారు.దీన్నిబట్టి పిల్లిని చంపడం ఎంత మహాపాతకమో మానవుడి ఊహకు అందదు " అని ఆపారు శాస్త్రిగారు.
సుందరి వెంకట్రావులో సన్నగా వణుకు ప్రారంభమైంది. వారి స్పందన తృప్తి కలిగించింది శాస్త్రిగారికి.
“ వందమంది బ్రాహ్మల్ని హత్య చేసినవాడిని వెల్లికిలా పడుకోబెట్టి కదలకుండా కట్టేసి ఇనుపముక్కుల కాకులతో కళ్ళలో పోడిపించమన్న యమధర్మరాజు, వెయ్యిగోవులను చంపినవాడి కాళ్ళు గాడిపోయ్యిలో పెట్టి కాలబెడుతూ నూనె కాగబెట్టమన్న ఆ సమవర్తి ఒక్క పిలిని చంపినవాడిని మాత్రం తోలు వలిచి ముక్కలు ముక్కలు చేసి శనగపిండిలో కలిపి పకోడిలను వేయించమని చెప్పాడని యమ పురాణంలో తొంభై ఆరో పర్వంలో స్పష్టంగా చెప్పబడి ఉంది " అని నశ్యం పట్టు బిగించి చెప్పారు శాస్త్రిగారు.
చెమటలు కారిపోయాయి ఆ దంపతులకు.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో