Yeluka Vacche Illu Bhadram 34
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 34
ఇలపావులూరి మురళీమోహనరావు
**********************
“ వెంకట్రావు గారు ఇప్పుడు చెప్పండి విషయం. నేను చాలా బిజి. అవతల ఆరు పెళ్ళిళ్ళు, రెండు చావులు, నాలుగు గృహప్రవేశాలు ఉన్నాయి " అన్నాడు శాస్త్రిగారు.
“ ఓకే రోజు ఇన్నింటికి ఎలా వెళ్తారండీ ?” అని ఆశ్చర్యంగా అడిగింది సుందరి.
“ ఏం చేస్తామమ్మా? పాడు పొట్టను పోషించడానికి అనేక తిప్పలు తప్పవు " అన్నాడు శాస్త్రిగారు.
“ అయ్యా శాస్త్రిగారూ...మా ఇంట్లో ఎలుక చేరి ఇల్లు గుల్ల చేస్తుంటే దాన్ని చంపడానికి ఒక దిక్కుమాలిన పిల్లిని తెచ్చాం " అని చెప్పాడు వెంకట్రావు.
“ శ్రేష్ఠం" అని అన్నాడు శాస్త్రిగారు.
“ కానీ అది అప్పటికే కడుపుతో ఉన్న పిల్లి "
“ దివ్వం "
“ దానికి ఎక్కడ చోటు లేనట్లు మా ఇంట్లోని అటకమీద ఆరుపిల్లి కూనలను ఈనింది "
“ శుభం "
“ పాపం పసి కూనలు కదా అని జాలిపడి రెండు రోజులు వాటికి పాలు పట్టాం "
“ పుణ్యం "
“ కానీ మర్నాడు చూస్తే వాటిలో ఒక పిల్లికూన చచ్చింది "
అంతే...కుర్చీ కింద భూకంపం వచ్చినట్లు ఎగిరిపడ్డాడు శాస్త్రిగారు.
“ పాపం! పాపం! మహాపాపం!” అంటూ లబలబలాడాడు శాస్త్రిగారు.
“ ఏం చేయాలో తోచక మిమ్ముల్ని పిలిచాం " అని చెప్పాడు వెంకట్రావు.
“ ఏం చేయాలని మెల్లగా అడుగుతారేంటి ? చాలా చెయ్యాలి. అమ్మాయ్ నా బుర్ర మొద్దుబారి పోయింది. ముందు నువ్వు చిక్కని డికాషన్ వేసి నాలుగు చెంచాల పంచదార తో నీళ్ళు కలపని పాలుపోసి ఒక లోటాతో కాఫీ పట్రా చెబుతా " అని కావలసిన వాటివి చెప్పాడు.
“ లోటా కాఫీ ఎందుకు శాస్త్రిగారు ? ఈ మధ్య పుణ్య:వచనాలు కాఫీతో చేస్తున్నారా ఏంటి?” పెద్దగా నవ్వారు శాస్త్రిగారు.
“ చమత్కారంలో మీ ఆయన తరువాతే ఎవరైనా అమ్మాయ్.ఈ కాలనీలో ఎవడు నోరు తెరిచినా కంపే కానీ మీ ఆయన వాగ్దాటికి గంగాదేవైనా పొంగి డివి నుండి భువికి ఎగురుతూ వస్తుంది " అన్నాడు శాస్త్రిగారు.
వెంకట్రావు ఛాతీ పొంగింది. సుందరి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. శాస్త్రిగారు నశ్యం డబ్బా తీశారు.చిటికెడు నశ్యాన్ని బొటనవేలు, మధ్యవేలుతో బిగించి పెద్ద శబ్దం చేస్తూ గట్టిగా పీల్చుకున్నారు.ఒక్క నిమిషం పాటు కళ్ళు తేలవేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.
“ ఆహా హా హా ఈ నష్యగంధాన్ని ఎవరు కనిపెట్టారో తెలియదుగానీ వెంకట్రావు గారూ...ఆహా దీనిని ఆఘ్రాణించగా కలిగే సౌఖ్యం సురాపాన విందులోగానీ, అందాల మగువల పొందులోగానీ ఉండదంటే నమ్మండి గట్టిగా పీల్చగానే గుండెకవాటాల్లోకీ, మెదడు నరాల్లోకీ, కళ్ళలోకీ, చెవిగూబల్లోకి, స్వరపెటికలోకి ఒకేసారి చొచ్చుకుపోయి స్వర్గం కళ్ళముందు సాక్షాత్కారిస్తుందనుకొండి " అన్నారు శాస్త్రిగారు.
“ శాస్త్రిగారూ నేను నశ్యం పీల్చను. మందు వాసన కూడా చూడను. అమ్మాయిలంటేనే నాకు చచ్చే భయం ఇక ఈ స్వర్గాల సంగతి నాకేం తెలుస్తుంది " అన్నాడు వెంకట్రావు.
ఇంతలో లోటాతో కాఫీ తెచ్చింది.సుందరి లోటాలో ముఖం పెట్టి వాసన పీల్చారు శాస్త్రిగారు.
“ ఆహా...ఫిల్టర్ చెయ్యడంలో అమ్మాయిని మించిన ఘనాపారీలు ఈ చుట్టుపక్కల అగ్రహారాల్లోనే లేరండీ.నేను కాశీ నుండీ రామేశ్వరం వరకు నాలుగుసార్లు చుట్టి వచ్చాను. ఎక్కడ తాగినా చుట్ట కంపు తప్ప కాఫీ ఇంపులేదు ముందు దీనిని తాగితే గానీ నాకు నోట మాట వచ్చేటట్లు లేదు " జుర్రుమని శబ్దం చేస్తూ కాఫీ తాగారు శాస్త్రిగారు.
మళ్ళీ నశ్యం పట్టు పట్టారు.
“ ఆహా! వెంకట్రావుగారూ నశ్యాన్ని పిలిస్తే క్యాన్సరోస్తుందని, క్షయ వస్తుందని చదువుకున్న మూర్ఖులు అంటుంటారు.మా తాత రోజూ డబ్బా నశ్యం పీలుస్తూ నూటైడదు సంవత్సరాలు బ్రతికారు.మా నాన్నగారు రోజూ అటు ముక్కు ద్వారా పీల్చడమే కాక తాంబూలంలో కూడా నశ్యాన్ని వేసుకుంటూ తొంభై సంవత్సరాలోచ్చినా గుండుముక్కలా ఉన్నారు.పల్లెల్లో రైతులు మూరెడు పొడుగు చుట్టలు కాలుస్తుంటారు.
ఏదో విధంగా అవతలివాడి వ్యాపారం చెడగొట్టడం తప్ప వీళ్ళకేం పన్లేదు ఏమంటారు ?” వెంకట్రావుకు విసుగొచ్చింది.
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో