Yeluka Vacche Illu Bhadram 36

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

ఎలుకవచ్చే ఇల్లు భద్రం - 36

ఇలపావులూరి మురళీమోహనరావు

************************

“ అసలు ఈ పిల్లి ఎంతటి మహార్జంతువో చెబుతా వినండి. పిల్లిసాక్షాత్తూ శ్రీ మహా విష్ణువుకు బంధు వర్గంలోనిది " అని చెప్పాడు శాస్త్రిగారు.

“ పిల్లి మహావిష్ణువుకు బంధువా? ఎలాగా ?” అని అడిగింది సుందరి.

“ వినండి. అసలు పిల్లి ఎవరు ?” అన్నాడు శాస్త్రిగారు.

“ ఎవరూ అంటే పిల్లే " అని చెప్పాడు వెంకట్రావు.

“ తప్పు...పిల్లి సాక్షాత్తూ పులికి మేనల్లుడు. పులి ఎవరు ?” అని చెప్పాడు శాస్త్రిగారు.

“ ఎవరు ?” అని సుందరి వెంకట్రావు ఇద్దరు ఒకేసారి అడిగారు.

“ పులి సాక్షాత్తూ ఆదిశక్తి వాహనం. ఆదిశక్తి ఎవరు ?” అన్నాడు శాస్త్రిగారు.

“ ఆదిశక్తి అంటే..అది..అది...” అని బుర్ర గీక్కుకున్నాడు వెంకట్రావు.

“ వినండి చెబుతా..ఆదిశక్తి లక్ష్మీదేవి అంశంలోనిది. ఆ లక్ష్మీదేవి మహా విష్ణువు సతీమణి ఆ విధంగా పిల్లి శ్రీ మహావిష్ణువు బంధువైంది. అంతేకాదు పిల్లి మేనమామ పులి అయ్యప్పస్వామికి వాహనం.అయ్యప్పస్వామి హరిహరసుతుడు. ఆ విధంగా ఆదిశంకరుడికి కూడా పిల్లి బంధువైంది. మరి అటువంటి పిల్లి చంపితే ఆ యముడు ఊరుకుంటాడా చెప్పండి " అని చెప్పి అడిగాడు శాస్త్రిగారు.

“ పిల్లికి ఇంతమంది బంధువులు ఉంటారని మాకు తెలియదండీ చాలా పాపం చేశాం" అని భయంగా అన్నాడు వెంకట్రావు.

“ అంతేనా..శతకకారుడు గోద్దెన ఏమన్నాడు ?”

“ గొద్దెన ఎవరండీ ?”

“ బద్దెన బ్రదరు ఏమన్నాడు ?”

“ తెలియదండీ "

“ నేను చెబుతాను కదా " అని ఒక పద్యం చదివాడు శాస్త్రిగారు.

“ మేము ఎప్పుడు ఈ పద్యం వినలేదండి. సుమతీ శతకం చదివాను కానీ ఇలాంటి పద్యం తగల్లేదు" అని చెప్పింది సుందరి.

“ చిన్నప్పుడు చదివారు కదా మరిచిపోయి వుంటారులే. ఇంకా ఈ పిల్లి గురించి భాగవతంలో పోతన్ వారేం చెప్పారో తెలుసా ?” అన్నాడు శాస్త్రిగారు.

“ తెలియదండీ. భాగవతం శ్రీకృష్ణ లీలలని విన్నాం అందులో కూడా పిల్లి గురించి ఉందా! “

“ అయ్యే ఇందు గలదని అందులేదని సందేహం గలదు బిడాలము కంటే అని ఆ పద్యాలు శ్లోకాలు మీకు కొరుకుడు పడవు కానీ తాత్పర్యము వివరిస్తాను వినండి. చూడమ్మాయీ సుందరి శ్రీకృష్ణకి ఇష్టమైన పదార్ధములేమిటి " అని అడిగాడు శాస్త్రిగారు.

“ అందరకూ తెలిసినవేగా పాలు పెరుగు వెన్న " అని టక్కున చెప్పింది సుందరి.

“ చూశారా..పిల్లిని కూడా సరీఘ్గూ ఇవంటేనే ఇష్టం. శ్రీకృష్ణుడు దొంగతనంగా గోపెమ్మల ఇళ్లలో దూరి పాలు పెరుగు కాజేస్తూ ఎవరైనా వస్తున్నా అలజడి కాగానే తుర్రున పారిపోతాడు. పిల్లి కూడా ఎవరూ చూడటం లేదులే అనుకుని దొంగతనంగా ఇళ్లలో దూరి కళ్ళు మూసుకుని పాలు పెరుగు తాగుతూ ఏదైనా అలజడి కాగానే తుర్రున పారిపోతుంది.

శ్రీకృష్ణుడు వెన్న తిని మూతి తుడుచుకోనట్లే పిల్లికూడా పాలుతాగి మూతి తుడుచుకొదు.శ్రీకృష్ణుడిని నల్ల పిల్లిగా అభివర్ణించారు. కవులు దీన్నిబట్టి మీకేం అర్థమౌతున్నది " అని చెప్పాడు శాస్త్రిగారు.

“ అది కూడా మిరే చెప్పండి "

“ పిల్లి శ్రీకృష్ణుడి హంశతో పుట్టింది పిల్లిని చంపడం అంటే సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడిని చంపినట్లే. లక్షమంది ఇంద్రులను, పది లక్షల మంది ద్విజులను చంపడం కంటే ఒక్క పిల్లిని చంపడం పాతకాలలోకేల్లా మహాపాపమని బ్రహ్మపురాణము ఆఖండ పురాణం వైదిక శాస్త్రాలలోనూ వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ చెప్పడం జరిగింది " అని అంటూ మరో నశ్యం పట్టు పట్టారు శాస్త్రిగారు.

గొంతు తడారిపోయింది దంపతులకు.

" దీని వెనక ఇంత గందరగోళం ఉంటుందనుకోలేదు.పుణ్యానికి పోయి పాలు పోస్తే పాపం మెడకు చుట్టుకుంది " అని విచారంగా అన్నది సుందరి.

“ ఇంకా వినండి.అజ్ఞాతవాన సమయంలో అర్జునుడు అఖుభుక్కి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు " అనో ఏదో చెప్పబోతుండగా మాట మధ్యలో కలిపించుకున్నాడు వెంకట్రావు.

“ మైగాడ్...దరిద్రపు పిల్లి కూడా ఇంత చరిత్రం ఉందని, కవులు మునులు కూడా పిల్లికి ఇంత ప్రాముఖ్యతని ఇచ్చి మా కొంప ముంచుతారని మేము ఊహించలేదు. ఇప్పుడు మీరు చెబుతుంటే మాకు వెన్నులో చలివేస్తున్నది.ఏం చెయ్యాలి ?” వణుకుతూ అన్నాడు వెంకట్రావు.

“ అవును శాస్త్రిగారు...నాదో సందేహం " అన్నది సుందరి.

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో