Yeluka Vacche Illu Bhadram 33

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

***********

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 33

ఇలపావులూరి మురళీ మోహనరావు

***********************************

వెంకట్రావును చూసి ఆశ్చర్యపోయారు అక్కడికి వచ్చిన వారందరూ.

“ వెంకట్రావుగారూ మీరా? మికిదేం పోయే కాలం ? మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా?” అని వెంకట్రావు అంటే గిట్టని ఒకాయన అన్నాడు.

“ చాల్లే ఊరుకోవయ్యా... శాస్త్రిగారు నేను పొద్దుట నుండి మీకోసం నాలుగైదు సార్లు సెల్ కు చేశాను. రాత్రి రెండింటికి ఇంటికి వస్తారని మీ అమ్మాయి చెప్పింది. ఓ అర్జంటు పనుండి మీ కోసం వచ్చాను.” అని చెప్పి బావురుమన్నాడు వెంకట్రావు.

“ అవును నాన్న" చెప్పింది రంగవల్లి.

“ అవునుసార్...ఈయన మా మనిషే.దొంగకాడు " అని చెప్పాడు ఆ కాలనీ ప్రెసిడెంట్.

దానికి అందరూ వత్తాసు పలికారు.

“ అవును పోలీసుగారూ ఈయన మావాడే చాలామంచివాడు. నిజంగా నా కోసమే వచ్చాడు. వదిలెయ్యండి" అని చెప్పాడు శాస్త్రిగారు.

“ఛి ఛీ... పట్టక పట్టక ఒక్కడు దొరికితే వాడు దొంగాకాడా? అంతా నా రాత " అనుకుంటూ వెంకట్రావును బంధవిముక్తుణ్ణి చేశాడు కనకలింగం.

“ దొంగైతే అంత తేలిగ్గా దొరుకుతాడండీ మన పిచ్చిగానీ " వ్యంగ్య బాణం వేశాడోకాయన. అందరిని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు పోలీసు.

అందరూ సణుక్కుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

“ అయ్యయ్యో ఎంత పని జరిగింది! వాడేమైనా కొట్టాడా ?” అడిగాడు శాస్త్రిగారు.

“ అబ్బెబ్బే అస్సలు నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు.ఊరికే కొడతానని బెదిరించాడు. ఇంతలో మీరంతా వచ్చారు " అని డొక్కల్లోని బాధని దిగామింగాడు వెంకట్రావు.

“ పోన్లెండి...మిమ్ముల్ని వంగదీసి గుద్దుతుంటే నిజంగానే గుద్దాడేమో అని భయపడ్డా ఇంతకూ అసలు విషయం ఏమిటి ? ఇంత రాత్రివేళ మా కోసం ఎందుకొచ్చారు ?” అని అడిగాడు శాస్త్రిగారు.

“ అదంతా ఇప్పుడు వివరంగా చెప్పలేను. మీరు రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకి మా యింటికి రండి మాట్లాడుకుందాం " అని చెప్పాడు వెంకట్రావు.

“ ఏమిటి విషయం? రేపు చీఫ్ మినిస్టర్ గారింట్లో అన్న ప్రాశన ఉందే...ఎలా ? ” అన్నాడు శాస్త్రిగారు.

“ పది నిమిషాల పనండీ.వెంటనే వెళ్ళొచ్చు " అన్నాడు వెంకట్రావు.

“ సరే! అలాగే రేపు ఉదయం ఎనిమిది నుంచీ ఎనిమిది నలబై వరకూ మీకు కేటాయిస్తున్నాను " అని చెప్పాడు శాస్త్రిగారు.

“ సంతోషం ఉంటాను " అని వళ్ళంతా పిసుక్కుంటూ మూలుగుతూ ఇంటికి వచ్చాడు వెంకట్రావు.

“ దొరికాడా శాస్త్రి " అని అడిగింది సుందరి.

“ ఆహా..రేపు ఉదయం వస్తానన్నాడు " అని చెప్పాడు వెంకట్రావు.

**************

ఉదయం ఎనిమిదింటికి శాస్త్రిగారు, వెంకట్రావు ఇంటికి వచ్చారు.

“ ఏంటి విషయం వెంకట్రావు గారూ? అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చి పోలీసు చేత...” అని శాస్త్రిగారు అంటుండగా, మాట మధ్యలోనే " ఆ...ఆ...ముఖ్య విషయం శాస్త్రిగారూ " అని ఏదో చెప్పబోయాడు వెంకట్రావు కలిపించుకుని.

“ పోలీసు ఏంటి శాస్త్రిగారు ?” అడిగింది సుందరి కొంచం కంగారు పడుతూ.

“ ఏం లేదులే. నువ్వు శాస్త్రిగారి కాఫీ విషయం చూడు " అని తప్పించబోయాడు వెంకట్రావు.

“ నా దగ్గర విషయాలు దాస్తారా? ఏమైంది శాస్త్రిగారు ?” అన్నది సుందరి.

“ అబ్బే ఏం లేదమ్మా! రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు వెంకట్రావును గారిని చూసి ఎవరైనా దొంగేమో అనుకున్నారు. నేను వెంకట్రావునండీ ఫలానా ఆఫీసు అని చేపగానే వెంకట్రావుగారికి పోటీలు పడి నమస్కారాలు చేసి తమ పొరబాటును మన్నించమని, పై అధికారులకు చెబితే ఉద్యోగాలు ఊడతాయని బతిమాలారు. అబ్బో ఏమో అనుకున్నాను కానీ అమ్మాయ్ మీ ఆయనకున్న పలుకుబడి అపారం. పోలీసులు సైతం భయపడ్డరంటే ఆహా మీ ఆయన మా కాలనీలో ఉంటున్నందుకు శరీరం రోమాంచితమవుతున్నది " అని చెప్పారు శాస్త్రిగారు.

సుందరి గర్వంగా నవ్వింది.

వెంకట్రావు నిట్టూర్చాడు.

***********************

వెంకట్రావు, శాస్త్రిగారికి పిల్లి కథ చెప్తాడా లేదా?

ఒకవేళ పిల్లి కథ వెంకట్రావు చెబితే, శాస్త్రిగారు ఎలా స్పందిస్తారు?

రాత్రి కాలనీలో వెంకట్రావుకు జరిగిన దొంగ సన్మానం గురించి సుందరితో చెప్తాడా లేదా? చెబితే సుందరి ఎలా రియాక్షన్ అవున్తుంది ?

తరువాయి భాగంలో...

*********************

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో