Yeluka Vacche Illu Bhadram 32
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 32
ఇలపావులూరి మురళీ మోహనరావు
***************************************************************
“ అమ్మమ్మో...ప్రైమ్ మినిష్టర్నైనా పట్టుకోవచ్చుగానీ ఈ బ్రాహ్మలను పట్టుకోలెం. వీళ్ళకు వందతలలు, రెండు వందల చేతులున్నా చాలవు. అసలు మాట దూరనిస్తేనా? ఆయన గోలే ఆయనిది. లాభం లేదు. రాత్రి రెండయినా సరే ఇంటి దగ్గర కావు కాసి పట్టుకోవాల్సిందే" రొప్పుతూ అన్నాడు వెంకట్రావు.
***************************************************************
రాత్రి రెండు గంటలకు శాస్త్రి గారింటికి బయలుదేరాడు వెంకట్రావు. చలి తీవ్రంగా ఉండటంతో మంకీ కేఫ్ ధరించి శాలువా కప్పుకున్నాడు. వీధిదీపాలు వెలగడం లేదు. అంతా కటిక చీకటి పౌర్ణమినాడు తెల్లవార్లూ వెలిగే వీధి దీపాలు అమావాస్య రాత్రి చస్తే వెలగవు.
వెంకట్రావు చలికి వణుకుతూ నడుస్తున్నాడు. నాలుగో రోడ్డులో ఉన్నది శాస్త్రిగారి ఇల్లు. చలిని తిట్టుకుంటూ ఇల్లు చేరాడు. గేటు చప్పుడు చేశాడు. అదే క్షణంలో వెనుక నుంచి ఎవరో గొంతు మీద చెయ్యి వేసి ఉడుం పట్టు పట్టారు. వెంకట్రావు ఎంత గింజుకున్నప్పటికీ తలను కదల్చలేకపోయాడు.
“ రాస్కెల్...ఇన్నాళ్ళ నుంచీ అర్థరాత్రి పూట ఈ కాలనీలో దొంగతనాలు చేస్తున్నది నువ్వేనన్న మాట. ఎన్నాళ్ళకి దొరికావురా గాడిద కొడకా! నా పట్టునుంచి తప్పించుకోవడం యముడికి కూడా తరం కాదురా!” అని మరో చేత్తో డొక్కలో పిడిగుద్దులు గుద్దాడు ఆగంతకుడు.
వెంకట్రావు గొంతు పెగలక కుయ్ కయ్ మనలేకపోతున్నాడు. చూస్తుండగానే నైలాన్ తాడుతో వెంకట్రావు చేతులను బిగించి కట్టాడు.
“ బాబోయ్ నేను దొంగను కాదండీ. ఈ కాలనీ మనిషినే నా పేరు వెంకట్రావండీ " బిక్కచచ్చి పోయి చెప్పాడు వెంకట్రావు.
చీకట్లో లీలగా మాత్రంగా పోలీసు యూనిఫాంలో భీకరాకారంతో కనబడుతున్నాడు ఆ వ్యక్తీ.
“ మీరు...మీరు ఎవరు సార్ " భయం భయంగా అడిగాడు వెంకట్రావు.
“ హెడ్ కానిస్టేబుల్ కనకలింగాన్ని. దొంగతనానికి నువ్వే వచ్చావా? నీ ముఠా ఎక్కడుంది?”
“ అయ్యబాబోయ్ దొంగతనమేంటి? ముఠా ఏంటి? నాకేం తెలియదు సార్. నేను శాస్త్రిగారి ఇంటికి వచ్చాను " చెప్పాడు వెంకట్రావు.
“ అదేరా భాడ్కోవ్...రెండు రోడ్లనుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. నువ్వు ఎవరింటి దగ్గర ఆగుతావా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నాను. శాస్త్రిగారి ఇంట్లో డబ్బు బాగా ఉందని నీకు నీ ముఠా వాళ్ళు చెప్పారా ?”
“ ఇదెక్కడి పెంటండి సార్? నేను ఈ కాలనీ వాడినేనండి.” అన్నాడు వెంకట్రావు.
“ఐసీ... ఈ కాలనీలో ఉంటూ ఈ కాలనీలోనే దొంగతనాలు చేస్తున్నావన్న మాట! ఓరి భోటాచోర్... నిన్ను ఉరికే వదలకూడదు " అని వెంకట్రావుని వంగబెట్టి ఫటాఫట్ గుద్దుల వర్షం కురిపించాడు కనక లింగం.
వెంకట్రావు గావుకేకలు పెట్టసాగాడు. ఆ అరుపులకి బజారంతా లేచింది.బిల బిల మంటూ వచ్చారందరూ. మంకీ కాపులో ఉన్న వెంకట్రావుని గుద్దుతున్న పోలీసు కనిపించాడు.
“ ఎవరు ఎవరు ?” గుసగుసలాడారు.
“ దొంగండీ.. ముసుగుదొంగ.ఈ చుట్టుపక్కల కాలనీలో గత ఆరు మాసాలుగా దొంగతనాలు చేస్తుంది వీడే.ఖర్మకాలి ఇన్నాళ్ళకు దొరికాడు " మీసాలు మెలేశాడు కనకలింగం.
“ వాడి ఎముకలు విరగొట్టండి "
“ కాళ్ళు చేతులు నరకండి "
“ తోలు వలవండి "
" నడుములు విరగొట్టండి " ఇలా అన్ని విధాలా అందరూ అరవసాగారు.
“ ఏరా అడ్డగాడిదా మా ఇంటికే దొంగతనానికి వచ్చావా? ఒక్క మంత్రం చదివి కుంకుమ చల్లానంటే కళ్ళు పేలిపోతాయి.పోలీసుగారూ వేడిని స్టేషనుకు తీసుకెళ్లండి.తుక్కురేగ్గొట్టండి " అన్నాడు శాస్త్రిగారు.
“ అయ్యే..శాస్త్రిగారు...నేను మీ కోసమే వచ్చాను. నేను వెంకట్రావునండీ..” టోపీ తీసేశాడు వెంకట్రావు.
**************************************************************
టోపీ తీసివేసిన వెంకట్రావుని అక్కడ ఎంతమంది గుర్తించారు?
గుర్తించినందుకు ఏం జరిగింది?
వెంకట్రావు దొంగతనానికి రాలేదని అక్కడ ఎవరు నమ్మగలరు?
అందరిని ఎవరు నమ్మించగలరు?
తరువాయి భాగంలో
***************************************************************
(ఇంకావుంది)
హాసం సౌజన్యంతో