Yeluka Vacche Illu Bhadram 31

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

**************************

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 31

ఇలపావులూరి మురళీ మోహనరావు

**********************************************************************

“ ఏంటి మీరు మాట్లాడేది? నేను వెంకట్రావును నేను వెంకట్రావును అని ఏదో పెద్ద మినిష్టర్ చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారు.” అని కసిరింది సుందరి.

“ ఆయనేదో పెళ్లి హడావుడిలో ఉన్నట్లున్నారు. నేనొకటి చెబుతుంటే ఆయనొకటి చెబుతున్నాడు. కొంచం సేపు ఆగి చేస్తాను " ఫోన్ పెట్టేస్తూ అన్నాడు వెంకట్రావు.

“ ఏం మనిషో నాయనోయ్. ఒక్కపని సవ్యంగా చెయ్యడం రాదుకదా! ఫోన్ చేసి మనిషితో మాట్లాడటం రాకపోయే " నుదురు కొట్టుకుంటూ అన్నది సుందరి.

“ నువ్వు మాట్లాడు తెలుస్తుంది.ప్లీజ్ వెయిట్ " కోపంగా అన్నాడు వెంకట్రావు.

అరగంట తరువాత మళ్ళీ ఫోన్ చేశాడు వెంకట్రావు.

“ హలో శాస్త్రి గారు... నేను వెంకట్రావును " అన్నాడు వెంకట్రావు.

“ ఆ...వెంకట్రావుగారు బాగున్నారా? నాన్నగారు ఎన్ని గంటలకు స్వర్గస్తులయ్యారు?” అన్నాడు శాస్త్రి గారు.

“ మా నాన్నగారు స్వర్గస్తులు కావడం ఏమిటి? నిక్షేపంలా ఉన్నారు " అని చెప్పాడు వెంకట్రావు.

“ ఆ ఏంటి విషయం వెంకట్రావు గారూ. పాపం కిడ్నీలు రెండూ చెడిపోయయా ? హాస్పటల్లో చేర్చలేదూ " అన్నాడు శాస్త్రి గారు.

“ కిడ్నీలు చెడిపోవడం ఏంటి? ఆయన కిడ్నీలు రెండు కంచి ఇడ్లీలా నిగనిగలాడుతున్నాయి.మీరు ఎక్కడ ఉన్నారు ?” అని అడిగాడు వెంకట్రావు.

“ నేనా? ఖర్మలో దానాలన్నీ పట్టుకొచ్చారా? భూధానం నాకివ్వండి.గోదానం నా రెండో అసిస్టెంటుకివ్వండి. ఆ... ఏం వెంకట్రావు గారూ " అన్నాడు శాస్త్రిగారు.

“ ఖర్మ ఖర్మ... నేను చెప్పేది వినబడుతోందా? గోదానమేంటి? భూమి నాకేలేదు ఎక్కడా. ఇక మీకేం ఇమ్మంటారు. నేను చెప్పేది వినకుండా ఈ దానాలగోలేంటి ? “ అన్నాడు వెంకట్రావు.

“ ఏంటి చెప్పండి వెంకట్రావు గారూ. బాబూ శవాన్ని పాడేకు కట్టండి "

“శవమెంటండి స్వామీ! శవాన్ని అవతల పారేశాం. పిల్లి పిల్ల శవానికి పాడే ఎందుకు ?”

“ భలేవారే! శవం లేవకపోతే మాత్రం శవం కదలకుండా తాళ్ళతో కట్టడం మన సంప్రదాయం. హలో వెంకట్రావు గారూ "

“ అయ్యా శాస్త్రిగారూ...మీతో అర్జంటుగా "

“ తప్పకుండానండీ. ఆ బాబూ పాడెనేత్టండి నారాయణ నారాయణ నారాయణ చెప్పండి వెంకట్రావుగారూ నారాయణ చెప్పండి " అన్నాడు శాస్త్రిగారు.

“ నారాయణ నారాయణ ఛి ఛీ... నేనంటున్నానేంటీ ?" విసుగ్గా ఫోన్ పెట్టేశాడు.

ఆ సంభాషణ వింటున్న సుందరికీ వళ్ళు మండిపోయింది.

“ ఏంటా వెధవగోల... ఎవరితో మాట్లాడుతున్నారు ? ” అరిచింది సుందరి.

“ ఇంకెవడు? ఈ శాస్త్రిగారు ఇందాక పెళ్ళిలో ఉన్నాడు. ఇప్పుడు ఖర్మలో ఉన్నాడు. నాతో ఒకమాట వాళ్ళతో ఒకమాట. అబ్బబ్బ ఎంతబిజీ! కొంచెం సేపాగి మళ్ళీ ట్రై చేస్తాను " కోపంగా అన్నాడు వెంకట్రావు.

సుందరి ఏమి మాట్లాడలేకపోయింది.

అరగంట గడిచింది.

మళ్ళీ చేశాడు వెంకట్రావు.

“ ఆ వెంకట్రావుగారూ బాగున్నారా! ఇరవయ్యో తారీకు రాత్రి పదకొండు గంటలా ముప్పై ఆరు నిమిషాల మూడు విఘడియలకు దివ్వమైన ముహూర్తం ఉంది " అన్నాడు శాస్త్రిగారు.

“ దేనికి ?” అర్థం కానట్టు అడిగాడు వెంకట్రావు.

“ ఇద్దరి జాతకాలు బ్రహ్మానండంగా కుదిరాయి. ఇక రెండో మాటవద్దు. నా దక్షిణ ఇచ్చేయండి తద్దినం పెట్టాలి. వెంకట్రావు గారూ ఏంటి విషయం ?” అన్నాడు శాస్త్రిగారు.

“ జాతకమేంటండీ స్వామీ. మా యింట్లో పిల్లి చచ్చింది.” చెప్పాడు వెంకట్రావు.

“ సరేలెండి. ఆ... అమ్మా తాంబూలాలు మార్చుకోండి. ఎవరు చచ్చారూ ?” అన్నాడు శాస్త్రిగారు.

ఫోనును విసిరికొట్టి కిందపడి జుట్టంతా పీక్కోసాగాడు వెంకట్రావు.

“ అయ్యో అయ్యో మీ కోపం కృష్ణానదిలో మునగా ఏంటది? ఏమైంది ? ఏమంటారు శాస్త్రిగారూ ?” అంది అప్పుడే వచ్చిన సుందరి.

“ నా ఖర్మ, నా పెళ్లి, నా తద్దినం, నా శ్రాద్ధం, నా పిండాకూడు, దానాలు, ధర్మాలు, దక్షిణలు, ముహూర్తాలు... నా పాడె పచ్చిబద్దలు...” నోటికి ఏది వస్తే అది అన్నాడు వెంకట్రావు.

సుందరికి భయం వేసింది.

“ ఏమైందండీ? ” అన్నది ఏడుపు గొంతుతో.

*********************************************************************

వెంకట్రావు భార్యతో ఏమి చెప్పాడు?

అందుకు సుందరి ఎలా స్పదించింది ?

అసలు వెంకట్రావు, శాస్త్రిగారిని పట్టుకున్నాడా ?

తన ఇంటికి శాంతి చేయించాడా? లేదా ?

తరువాయి ఎపిసోడ్ లో

**********************************************

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)