Yeluka Vacche Illu Bhadram 30
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 30
ఇలపావులూరి మురళీ మోహనరావు
*******************************************************************
“ఏంటండోయ్ సుందరిగారు.మా తమ్ముడినేదో అంటున్నారు ?”అడిగింది అండాళ్ళమ్మ.
“చూడండి వదినగారు.దరిద్రపు ఎలుకను పట్టుకోవడానికి పిల్లిని తెమ్మంటే కడుపుతో ఉన్న పిల్లిని తెచ్చారు.”అని చెప్పింది సుందరి.
“అయితేనేం.ఎలుకను చంపిందన్నారుగా ?”అంది అండాళ్ళమ్మ.
“చంపితే మాత్రం ఏంలాభం ?”
“మీరు మరీనూ ఎలుకను చంపడంలో కూడా లాభాలు కావాలంటే ఎలా ?”అంది ఆండాళ్ళమ్మ.
“పూర్తిగా వినరేం ?ఈ ముండమోపి పిల్లికి ఎప్పుడు కడుపొచ్చిందో తెలియదు కానీ "అని చెబుతున్నా సుందరి మాట పూర్తి కాకుండానే మధ్యలో ఆండాళ్ళమ్మ కలిపించుకుంది. “దానికెపుడు కడుపోచ్చుంటుందో దానికే తెలియదండీ "అని.
“అబ్బా...నేను చెప్పేది వినండి.ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఆరు కూనలను కన్నది "అని చెప్పింది సుందరి.
“పిల్లులంతేనండీ.వాటికి పొట్ట చిన్నదైనా ఒకేసారి పదిమందికి జన్మనిస్తాయి "అంది ఆండాళ్ళమ్మ.
“నిజమేనండీ.వీటికోసమని రోజూ లీటరు పాలు ఎక్కువ పోయించుకుంటున్నాం "
“మంచిదే కదండీ.ఈ మాత్రం ధూతదయ ఉండటం పుణ్యమే "
“నా బొంద పుణ్యం.ఇవేళ వాటిలో ఒకటి పుటుక్కున చచ్చింది.”అని చెప్పింది సుందరి.
“అవ్వవ్వవ్వ...పిల్లిని చంపారా !ఎంతఘోరం ఎంతఘోరం ?"చెంపలు వాయించుకున్నది ఆండాళ్ళమ్మ.
“రామ రామ మేం చంపలేదండీ.అదే చచ్చింది "కంగారుగా అంది సుందరి.
“ఏ రాయైతేనేం పళ్ళు రాలగోట్టుకోవడానికి ?మీరు చంపితేనేం? అది చస్తేనేం ?మొత్తానికి పిల్లి చచ్చింది ?అయినా వాటికి తల్లి పాలుండగా మీరు పాలెందుకు పట్టారు ?పాలెక్కువై చచ్చి ఉంటుంది "అంది ఆండాళ్ళమ్మ.
“పాలెక్కువై చావడమా ?”ఆశ్చర్యంగా అంది సుందరి.
“ఏంటీ సుందరిగారు మరీ అంతా అమాయకంగా మాట్లాడతారు ?పాలు తాగే పసివాడికి పాలసీసా ఇవ్వాలి.కానీ పాల గుండిగలో పడేస్తే చావకుండా ఉంటుందా?పాలెక్కువయ్యే చచ్చిఉంటుంది కూన"
“అయ్యయ్యే...ఇప్పుడు ఎలాగా ?”కంగారుగా అన్నది సుందరి.
“పిల్లిని చంపడం మహా పాపం అందులోను పసిపిల్ల ఉన్న ఇంట్లో చావడం మరింత అరిష్టం.వెంటనే ఏదైనా శాంతి చేయించండి " అని చెప్పింది ఆండాళ్ళమ్మ.
“ఈ మాత్రం దానికే శాంతా "ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావు.
“లేకపోతే మీకు మనశ్శాంతి ఉండదు తమ్ముడు.ఇంట్లో చచ్చిన పిల్లి ఆత్మ,ఇల్లు దాటి పోదంటారు. ఎవరు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళను ఆవహిస్తుందిట.మా తోడికోడలు గారింట్లో కూడా ఇలాగే ఒక పిల్లి చచ్చిపోయి వాళ్ళ చిన్న కూతురును పట్టుకుందట.అప్పటి నుంచి ఆ అమ్మాయి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ నేను పిల్లిని నేను పిల్లిని అంటుంటుంది.ఎవరైనా పిలిస్తే వస్తున్నా అనకుండా మ్యావ్ అంటుంది.పాపం ఆ పిల్ల గురించి వాళ్లకు ఒకటే దిగులు.”అని చెప్పింది ఆండాళ్ళమ్మ.
ఆ దంపతుల శరీరంలోని నరాలన్నీ వణికాయి.
“హా...అంతా పవరుందా పిల్లిలో "వణుకుతూ అన్నది సుందరి.
“పెద్దలంటారు.అయినా ఈ రోజుల్లో ఎవరిష్టాలు వాళ్లవి.మధ్యలో నాకెందుకు ?మీ అన్నయ్యగారు కాఫీ కాఫీ అని అరగంట నుంచీ ఆంబోతులా రంకెలు పెడుతున్నారు.వస్తాను "అని చెప్పి అక్కడి నుంచి పగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆండాళ్ళమ్మ.
ఆ దంపతుల శరీరాలు చెమటతో తడిసిపోయాయి.
" అంతా నీ వెధవ సలహా వల్లనే వచ్చింది.బోడి ఎలుక వచ్చిందని ఇల్లంతా గుల్ల చేశావు.ఎలుక మందు తెమ్మని పద్నాలుగు వేలు వదిలించావు.ఇంట్లో సామానంతా పగలగోట్టావు.ఇప్పుడు మళ్ళీ ఈ శాంతి గీంతి అంటే ఎంత వదిలిస్తాడో ఏమో బ్రాహ్మణుడు "అరిచాడు వెంకట్రావు.
“బాగానే వుంది.చెప్పినప్పుడు నోరు మూసుకుని వింటారు.ఏమన్నా అయితే మాత్రం నా మిద విరుచుకుపడతారు.మందు తెమ్మన్నానే గానీ పాపకు అందేట్లు పెట్టమన్నానా ?పిల్లిని తెమ్మన్నాను కానీ పిల్లల తల్లినీ తెమ్మన్నానా ?”అని సుందరి అరిచింది.
“అంతా శని దరిద్రం పట్టింది.పిల్లపోయినా పురిటికంపుపోనట్లు ఎలుక ఎప్పుడో చచ్చినా దాని తాలూకు శని మాత్రం వదట్లేదు.ఇక చేసేది ఏముంది ?బ్రాహ్మణుడికి ఫోన్ చేస్తాను.ఆయన ఫోన్ నెంబర్ ఎంత ?”అడిగాడు వెంకట్రావు.
చెప్పింది సుందరి.
డయల్ చేశాడు వెంకట్రావు.
(ఇంకావుంది )
(హాసం సౌజన్యంతో )