Yeluka Vacche Illu Bhadram 22

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -22

ఇలపావులూరి మురళీ మోహనరావు

“మా మేనేజర్ గారిది.వాళ్ళు దీన్ని అపురూపంగా చూసుకున్నారట.కన్నీళ్ళూ పెట్టుకుని మరీ ఇచ్చాడు"చెప్పాడు వెంకట్రావు.

******

అవతల మేనేజర్ ఇంట్లో. భార్యాభర్తలిద్దరూ విరగబడి నవ్వుకుంటున్నారు.

“ఇన్నాళ్ళకు శనిగ్రహం వదిలింది.దున్నపోతులా తినడం తాగడం తప్ప ఏనాడూ ఎలుక పిల్లని కూడా పట్టి ఎరగదు దరిద్రపు పిల్లి.భలే తెలివిగా వదిలించారు"అన్నది పర్వతం.

“పాపం!తెలివి తక్కువ శుంథ!మనం నిజంగానే ఏడుస్తున్నాం అనుకున్నాడు.ఇకవాడి తిప్పలు ఆ బ్రహ్మదేవుడికే ఎరుక "పొట్ట పట్టుకుని నవ్వుతూ అన్నాడు మేనేజర్.

“వారం పదిరోజుల దాకా పిల్లిని గురించి అడుగుతుందండి.లేకపోతే మన పిల్లి ప్రేమంతా నాటకం అని తెలిసిపోతుంది.”చెప్పింది పర్వతం.

******

మర్నాడు ఆఫీసులో. “ఏవోయ్ వెంకట్రావ్?ఎలా వుంది మా చిట్టితల్లి?ఏవైనా మారాం చేస్తున్నదా ?దారిలో కొచ్చిందా?”అడిగాడు మేనేజర్.

“రాత్రి సంచిలోంచి తియ్యగానే అటక మీదికేక్కింది సార్.మళ్ళీ కిందికి రాలేదు.దగ్గరకు వెళ్లబోతుంటే కరుస్తున్నది "చెప్పాడు వెంకట్రావు.

“కొత్త వాతావరణం కదయ్యా.కాస్త అలవాటైందాకా సర్దుకుపో.అన్నట్టు మీకూ కేబుల్ కనెక్షన్ ఉందా?”అన్నాడు మేనేజర్.

“ఉన్నది సార్.ఈటీవీ,జెమినీ టీవీ తప్ప మరేం పెట్టదు మా ఆవిడ.సీరియల్స్ చూస్తుంది.వార్తలు రాగానే టీవీ ఆపేసి వంట పని చేస్తుంది.”చెప్పాడు వెంకట్రావు.

“ఈ లేడీసంతా ఇంతేనయ్యా.వార్తలు చూడటమంటే టైం వేస్టని వాళ్ళ అభిప్రాయం.పార్లమెంట్లో రభస,కాశ్మీర్లో తీవ్రవాదుల మృతి క్రికెట్లో ఇండియా ఘోరపరాజయం,వాతావరణం పొడిగా ఉంటుంది.స్టాక్ మార్కెట్ కుప్పకూలింది ఏ రోజూ ఇవేగా...ఇంతోటి దానికి అవన్నీ చూదాల్నా అంటుంది మా ఆవిడ "అన్నాడు మేనేజర్.

“యస్సార్ పాతికేళ్ళ కాపురం చేసిన తరువాత తన భర్తకు అంతకుముందే పెళ్ళైందని భార్యకు తెలియడం,తల్లిని కూతురు అరెస్టు చేయ్యడం ముఫ్ఫై ఏళ్ళొచ్చిన తరువాత కూడా కొడుకు తల్లిని పది రూపాయలడగడం,పెళ్ళైన మూడో రోజే భర్తను వదిలేసి భార్య పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను మెయిన్ టెయిన్ చేస్తూ రోజుకోక కార్లో తిరగడం,ఓనమాలు రాణి ఆడపిల్ల పెళ్ళైన తరువాత ఐ ఎ యస్ ప్యాసై కలెక్టర్ కావడం ఇలాంటి సీరియల్స్ చూస్తే జన్మ తరిస్తుందని మా ఆవిడ అభిప్రాయం "అన్నాడు వెంకట్రావు.

“బాగా చెప్పావు.బట్ సీ వెంకూ.నీకు ఎలాగైనా మీ ఆవిడ నొప్పించి ఒక సాహాసం చెయ్యాలి " అన్నాడు మేనేజర్.

“ఏంటి సార్ అది ?చెప్పండి "అన్నాడు వెంకట్రావు.

“చేస్తావు గదా?”

“అదేంటి సార్ అలా అడుగుతున్నాను? మీరూ చెప్పిన తరువాత చెయ్యక పోవడమా ?” వినయంగా అన్నాడు వెంకట్రావు.

“మా బుజ్జి పిల్లికి ఏనిమల్ ప్లానెట్ అన్నా,డిస్కవరీ అన్నా,నేషనల్ జియోగ్రాఫిక్ అన్నా చాలా ఇష్టం రోజూ కనీసం గంటసేపయినా చూడకుండా ఉండలేదు.రోజూ రాత్రిపూట పన్నెండు గంటల నుంచీ రెండు గంటల వరకూ దానికోసం ఆ ఛానెల్స్ ఆన్ చేసుంచే వాళ్ళం "చెప్పాడు మేనేజర్.

వెంకట్రావు ఆశ్చర్యంగా కళ్ళంత లావు చేశాడు "పిల్లి టీవీ చూస్తుందా!వింతగా ఉందే "అన్నాడు.

“మరో వింత చెబుతా మా పిల్లి గురించి జాగ్రత్తగా విను "అన్నాడు మేనేజర్.

“ఏంటిసార్ అది ?”

“నువ్వు ఏ ఛానెలైనా పెట్టు కానీ ఫ్యాషన్ టీవీ మాత్రం పెట్టకు.మీ ఆవిడ మీద పడి రక్కుతుంది " ఎగిరెగిరి నవ్వాడు నవ్వాడు మేనేజర్.

వెంకట్రావు కూడా నవ్వాడు.

“భలే చిత్రమైన పిల్లండీ "అన్నాడు.

******

సాయంత్రం ఇంటికి రాగానే"ఏవండోయ్ శుభవార్త "నవ్వుతూ ఎదురొచ్చింది సుందరి.

“ఏంటి ?మన పిల్లి ఎలుకను చంపెసిండా ?”ఆత్రంగా అన్నాడు వెంకట్రావు.

“కాదు నిన్నటి నుంచి అటక దిగకుండా అక్కడే కూర్చుందా పిల్లి!మధ్యాహ్నం టీవీ పెట్టి ఛానెల్ స్కానింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏనిమల్ ప్లానెట్ వచ్చింది.అది రాగానే పిల్లి గభాల్న కిందికి దూకి టీవీ ముందుకొచ్చింది "చెప్పింది సుందరి.

“ఆ...వాటే వండర్...మేనేజర్ చెప్పింది నిజమేనన్నమాట!ఆ తరువాత ఏం జరిగింది ?”అడిగాడు వెంకట్రావు.

“నాలుగైదు ఛానెల్స్ తరువాత నేను నిద్రపోయింతరువాత రోజూ అర్ధరాత్రి లేచి మీరూ చూస్తుంటారే ఒక ఛానెల్ అదొచ్చింది "అని చెప్పింది సుందరి.

గతుక్కుమన్నాడు వెంకట్రావు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)